iDreamPost

లారీనమ్మిన నిర్మాత కోటీశ్వరుడయ్యాడు – Nostalgia

లారీనమ్మిన నిర్మాత కోటీశ్వరుడయ్యాడు – Nostalgia

కొన్ని సినిమా అద్భుతాలు నమ్మశక్యం కాని రీతిలో ఉంటాయి. వాటి తాలుకు విశేషాలు ఆశ్చర్యం కలిగించే స్థాయిలో అబ్బురపరుస్తాయి. అలాంటిదే ఇది కూడా. శ్రీదేవి, చంద్రమోహన్ జంటగా కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1978లో రూపొందిన పదహారేళ్ళ వయసు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. చిన్న సినిమాగా పాతిక కేంద్రాల్లో రిలీజ్ చేస్తే ఏకంగా 12 సెంటర్స్ లో వంద రోజులు, నాలుగు చోట్ల సిల్వర్ జూబ్లీ ఆడింది. అయితే ఇది రీమేక్. దీని వెనుక ఆసక్తికరమైన కథ ఒకటుంది. భారతిరాజా ‘పదినారు వయదినిలే’ పేరుతో ఒక ఫుల్ స్క్రిప్ట్ రాసుకుని లోన్ కోసం ఫిలిం ఫైనాన్సు కార్పోరేషన్ కి అప్లికేషను పెట్టుకున్నారు. కాని సానుకూల స్పందన రాలేదు. దీంతో నిరాశ చెందక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

అప్పుడే పరిచయమయ్యాడు లారీ ఓనర్ ఎస్ఎ రాజకన్ను. అతనికి విపరీతమైన సినిమా పిచ్చి. బడ్జెట్ ఎంత అని అడిగాడు. భారతీరాజా లెక్కలేసి నాలుగున్నర లక్షలు చెప్పాడు. సరే అని కమల్ హాసన్, రజినీకాంత్, శ్రీదేవి కాంబినేషన్ లో ఇళయరాజా సంగీతంతో సెట్స్ పైకి వెళ్ళిపోయారు. తీరా పూర్తయ్యేలోగా 6 లక్షలు అయ్యింది ఖర్చు. మిగిలింది సర్దడం కోసం రాజకన్ను తన లారీని అమ్మేసి డబ్బు సర్దుబాటు చేసి నానా కష్టాలు పడి కేవలం 6 ప్రింట్లతో రిలీజ్ చేశారు. మొదటి రెండు మూడు వారాలు అసలు టాకే లేదు. ఇదేం సినిమా అన్నవాళ్లు లేకపోలేదు. రివ్యూలు అంతంత మాత్రమే. తర్వాత అనూహ్యంగా టాక్ పెరిగిపోయింది. పది ఇరవై కాదు ఏకంగా వంద ప్రింట్లు వేసినా ఇంకా కావాలని డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఫోన్లు వచ్చేంత. కలెక్షన్ల వర్షం కురుస్తోంది.

యాభై రోజులు కాకుండానే రాజకన్ను వరదలా వస్తున్న వసూళ్ళ దెబ్బకు ఇన్కం టాక్స్ డిపార్ట్ మెంట్ ఎక్కడ రైడ్ చేస్తుందో అని భయపడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. తెలుగు హక్కుల కోసం నిర్మాత మిద్దె రామారావు గారు రాజకన్నుని ఎక్కడో చెన్నైలో ఓ మారుమూల లాడ్జ్ లో ఉన్నారని తెలుసుకుని రీమేక్ రైట్స్ కి ఏకంగా లక్షా 50 వేలు ఆఫర్ చేశారు. అక్కడే ఉన్న భారతీరాజాకు ఇది పెద్ద మొత్తం అనిపించింది. ఆ విధంగా డీల్ క్లోజ్ అయ్యింది. కట్ చేస్తే తెలుగులో శ్రీదేవినే టైటిల్ రోల్ చేయగా రెండు కీలక పాత్రలు చంద్రమోహన్, మోహన్ బాబు చేశారు. ఇక్కడా అదే స్థాయి విజయం సాధించింది మూవీ. సిరిమల్లె పూవా పాట ఊరువాడా మారుమ్రోగిపోయింది. శ్రీదేవి కలల రాణి అయిపోయింది. లారీ అమ్ముకున్న రాజకన్ను తమిళనాడులో స్టార్ ప్రొడ్యూసర్ అయిపోయాడు. సినిమా విచిత్రాలు అంటే ఇలాగే ఉంటాయి మరి. ఇన్నేళ్ళ తర్వాత త్వరలో తమిళ వెర్షన్ ని తెలుగులో రీ మాస్టర్ చేసి విడుదల చేయబోతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి