iDreamPost

లాక్ డౌన్ సడలింపు.. మూడు జోన్లు గా దేశం..

లాక్ డౌన్ సడలింపు.. మూడు జోన్లు గా దేశం..

ఈనెల 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ పై సడలింపులు ఇచ్చేందుకు దేశాన్ని మూడు జోన్లుగా కేంద్ర ప్రభుత్వం విధించింది. కరోనా వైరస్ కేసుల సంఖ్య ఆధారంగా జిల్లాలను..హాట్‌స్పాట్‌ జిల్లాలు, నాన్హాట్‌స్పాట్‌ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాలుగా విభజించారు.హాట్‌స్పాట్‌ జిల్లాలో ప్రస్తుతం ఉన్న లాక్ యధావిధిగా మే మూడో తేదీ వరకు కొనసాగనుండగా నాన్హాట్‌స్పాట్‌ జిల్లాలు, గ్రీన్ జోన్ జిల్లాల్లో సడలింపులు ఇవ్వనున్నారు. దేశంలో 170హాట్‌స్పాట్‌ జిల్లాలు, 207 నాన్హాట్‌స్పాట్‌ జిల్లాలు, మిగతావి గ్రీన్ జిల్లాలుగా కేంద్రం నిర్ధారించింది. 

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు మినహా మిగతా 11 జిల్లాలను రెడ్ జోన్ పరిధిలోకి కేంద్రం తీసుకువచ్చింది. తెలంగాణలో 33 జిల్లాలకు గాను 8 జిల్లాలను రెడ్ జోన్ పరిధిలోకి తీసుకు వచ్చింది. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ అర్బన్, రంగారెడ్డి, జోగులాంబ గద్వాల, మేడ్చల్, కరీంనగర్, నిర్మల్ జిల్లాలను రెడ్ జోన్ లో చేర్చింది.

కరోనా వైరస్ నియంత్రణ కు గత నెల 24వ తేదీ అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చిన లాక్ డౌన్ 14 తో ముగిసింది అయితే వైరస్ నియంత్రణలోకి రాకపోవడంతో లాక్ డౌన్ ను వచ్చే నెల 3వ తేదీ వరకూ కేంద్రం పొడిగించింది. అయితే ఈ నెల 20వ తేదీ తర్వాత వైరస్ సోకిన వారి సంఖ్య ఆధారంగా లాక్ డౌన్ నిబంధనల్లో మినహాయింపులు ఇవ్వనుంది. ఆ మేరకు ఈరోజు ఉదయం మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా దేశాన్ని మూడు జోన్లుగా విభజిస్తూ నిర్ణయం తీసుకుంది.

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 11,953 చేరింది. 392 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. 1,344 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో ఈరోజు తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదయింది. రెండు రోజుల క్రితం నాగాలాండ్ లో తొలి కేసు నమోదు కాగా తాజాగా త్రిపురలో మొదటి కేసు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి