iDreamPost

లాక్ డౌన్ – దేశ ఆర్థిక రంగం ఏమ‌వుతుంది?

లాక్ డౌన్ – దేశ ఆర్థిక రంగం ఏమ‌వుతుంది?

లాక్ డౌన్ కార‌ణంగా భార‌త‌దేశం విల‌విల్లాడుతోంది. ప్ర‌పంచ‌మే స్తంభించిన నేప‌థ్యంలో దేశం అస్త‌వ్య‌స్తంగా మారే ప్ర‌మాదం దాపురిస్తోంది. ముఖ్యంగా ఆర్థిక‌రంగంలో పెను ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మ‌ళ్లీ వెంట‌నే కోలుకోలేని స్థాయిలో ఈ ముప్పు ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. దేశ భ‌విష్య‌త్ లో ఇది ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తోంద‌న‌నే ఆందోళ‌న సర్వ‌త్రా వ్య‌క్తం అవుతోంది.

దేశంలో తాజా అంచ‌నాల ప్ర‌కారం లాక్ డౌన్ కార‌ణంగా రోజుకి 35 నుంచి 40వేల కోట్ల రూపాయ‌ల న‌ష్టం త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. దాంతో లాక్ డౌన్ కాలంలో క‌లిగే న‌ష్టాలు 7.5ల‌క్ష‌ల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌నే లెక్క‌లు ఆర్థిక వేత్త‌లు వేస్తున్నారు. దేశ బ‌డ్జెట్ లో 30శాతం వ‌ర‌కూ కోల్పోవాల్సిన స్థితి క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే మొత్తం ఆర్థిక‌రంగంలో అల్ల‌క‌ల్లోలం అనివార్యం అవుతుంద‌ని భావిస్తున్నారు. అందులో ప్ర‌ధానంగా ప్ర‌ధానంగా టూరిజం, ట్రాన్స్ పోర్ట్, రీటైల్ స‌హా అన్ని రంగాల‌పైనా త‌ప్ప‌ద‌నే వాద‌న ఉంది. మాన్యుఫ్యాక్చ‌రింగ్ రంగంతో పాటుగా అగ్రిక‌ల్చ‌ర్ మీద కూడా ముప్పు త‌ప్ప‌దు. వాస్త‌వంగా చెప్పాలంటే మొత్తం అన్ని రంగాల మీద క‌రోనా కాటు ఖాయంగా ఉంది.

దేశంలో ఆటోమొబైల్ రంగం ఇప్ప‌టికే ప‌డ‌కేసింది. విమాన‌యానం పూర్తిగా స్తంభించింది. ఇలాంటి కీల‌క రంగాల్లో క‌ల‌క‌లం ఏర్ప‌డ‌డంతో మ‌ళ్లీ య‌ధాస్థితికి ఎప్పుడు వ‌చ్చినా వెంట‌నే కోలుకునే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. సంఘ‌టిత‌, అసంఘ‌టిత రంగాల్లో పెద్ద స్థాయిలో ఉపాధి కోల్పోయే ప్ర‌మాదం ఉంది. నిర్మాణ రంగం కూడా నిలిచిపోవ‌డంతో ఒక్క క‌న‌స్ట్ర‌క్ష‌న్ లోనే 4.5 కోట్ల మంది ప‌నులు కోల్పోవాల్సి వ‌చ్చింది. దాంతో అన్ని రంగాల్లోనూ ఆర్థిక‌రంగం మీద క‌లిగే ముప్పుతో పాటుగా ప్ర‌జ‌ల్లో కొనుగోలు శ‌క్తి కోల్పోయిన నేప‌థ్యంలో ఇక ఆ త‌ర్వాత అమ్మ‌కాలు, కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయే ప‌రిస్థితి ఉంటుంది. దాంతో 30 నుంచి 40 రోజుల పాటు క‌రోనా కార‌ణంగా క‌లిగే లాక్ డౌన్ తో ఏకంగా 50శాతం జీడీపీ మీద ప‌డే ముప్పు ఉంటుంద‌నే వాద‌న కూడా ఉంది.

దేశీయ ప‌రిణామాల‌తో పాటుగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ్య‌క్త‌మ‌వుతున్న మూటింట ఒక వంతు జీడీపీ కోల్పోవ‌డం ఖాయం అయిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఉద్దీప‌న ప్యాకేజీలు ప్ర‌క‌టించారు. కార్మికుల‌కు, ఉద్యోగులు స‌హా వివిధ సంక్షేమ చ‌ర్య‌ల‌కు పూనుకుంటున్నారు. కానీ ఫ‌లితాలు మాత్రం ఏమేర‌కు అన్న‌ది అంతుబ‌ట్టని అంశంగా ఉంది. ఆర్థిక రంగ నిపుణులు కూడా పూర్తిస్థాయి ప్ర‌భావం మీద అంచ‌నాలు వేయ‌లేక‌పోతున్న‌ప్ప‌టికీ పెను ముప్పు త‌ప్ప‌ద‌నే అభిప్రాయం వినిపిస్తున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు దేశం సిద్ధం కావాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి