iDreamPost

లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి – పుదుచ్చేరిలో రాజకీయం

లెఫ్టినెంట్ గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి – పుదుచ్చేరిలో రాజకీయం

పుదుచ్చేరిలో రాజకీయ రచ్చకెక్కింది. అయితే ఈ వివాదం రాజకీయ పార్టీల మధ్య కాదు. ఏకంగా ముఖ్యమంత్రి, గవర్నర్ల మధ్య నెలకొన్న వివాదం మాటల యుద్ధానికి దారి తీసింది.

అయితే ఈ వివాదం ఈనాటిది కాదు. కిరణ్ బేడీ బిజెపి తరపున ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓటమి చెందారు. ఆ ఓటమి తరువాత ఖాళీగా ఉన్న కిరణ్ బేడీని మోడీ సర్కార్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమించింది.

ఆమె అక్కడెళ్లి బాధ్యతలు తీసుకున్న తరువాత నుంచి వివాదం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు కిరణ్ బేడీ అడ్డు తగులు తుంది. వీరి పంచాయితీ ప్రధాని మోడీ దృష్టికి వెళ్లింది. ప్రధాని మోడీకి ఆమె పై ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఫిర్యాదు చేశారు. కిరణ్ బేడీకి వ్యతిరేకంగా సిఎం నారాయణ స్వామి ప్రత్యక్ష పోరాటానికే దిగుతూ గతంలో రాజ్ నివాస్ ముందు బైఠాయించారు. అలాగే అనేక సార్లు నిరసన తెలిపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

అయితే లెఫ్టినెంట్ గవర్నర్ హోదాలో కిరణ్ బేడీ ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు. ముఖ్యమంత్రి చేస్తున్న విమర్శలను పట్టించుకోకుండా, నిరంతరం ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటూనే ఉన్నారు.

లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ ప్రజాస్వామ్యాన్ని పాతిపట్టే దిశగా పయనిస్తున్నారని, నాలుగేళ్లుగా ఆమె తీరుతో ప్రజలు ఆవేదనకు గురయ్యారని పుదుచ్చేరి సిఎం నారాయణ స్వామి విమర్శించారు. లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన పరిధిని మించి రోజు వారీ ప్రభుత్వ వ్యవహారాల్లో కిరణ్ బేడీ జోక్యం చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. 

కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ రోజూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ కిరణ్ బేడీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారని సిఎం నారాయణ స్వామి విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలులో కిరణ్ బేడీ జోక్యాన్ని నారాయణ స్వామి తీవ్రంగా తప్పుపడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని మండిపడుతున్నారు.

అయితే దీనిపై కిరణ్ బేడీ స్పందిస్తూ తన బౌండరీస్ ఏంటో నాకు తెలుసంటూ సమాధానమిస్తున్నారు. ప్రభుత్వంలో జోక్యంపై గతంలో ఇచ్చిన ఆదేశాలను కేంద్ర హోం శాఖ మద్రాస్ హైకోర్టులో సవాల్ చేసిందదని, తీర్పు వచ్చే వరకు ముఖ్యమంత్రి ఓపిక పట్టాలని కౌంటర్ ఇచ్చారు. కోర్టుల్లో కేసులు నడుస్తున్నా వీళ్లిద్దరిలో ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఇక్కడ మొదటి నుంచి సిఎం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్యూ నడుస్తూనే ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి