iDreamPost

వైఎస్‌ జగన్‌తో చేతులు కలపనున్న సింధు, లక్ష్మణ్‌

వైఎస్‌ జగన్‌తో చేతులు కలపనున్న సింధు, లక్ష్మణ్‌

రాష్ట్రంలో అవినీతిని సమూలంగా, కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖ అధికారులకు పూర్తి స్వేచ్ఛగా ఇచ్చి.. కరెప్టెడ్‌ అధికారులను ఎంత మాత్రం ఉపేక్షించవద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. అవినీతి, లంచగొండితనం అనే మాట వినపడకుండా చేయాలనే ఉద్దేశంతో ఎన్నో చర్యలను చేపట్టారు. తరుచుగా ఏసీబీ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తూ.. పురోగతిని తెలుసుకుంటూ.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్నారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు దాడులు చేసి అవినీతి ఉద్యోగుల ఆట కట్టిస్తున్నారు. వేగంగా చర్యలు తీసుకుంటూ ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నారు. అయితే అవినీతి అంతానికి ప్రజల నుంచి కూడా సహకారం అవసరం. అందుకే ప్రజలకు అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, వెటరన్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌లతో అవినీతికి వ్యతిరేకంగా సందేశాలు ఇప్పించనుంది. అవినీతి వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజలను, అధికారులను జాగృతం చేసేలా చిన్న సందేశాత్మక చిత్రాలను సిద్ధం చేస్తున్నారు. సినీ నటులు, ఉత్తమ రిటైర్డ్‌ అధికారులతో కూడా ఆడియోలు, వీడియోలను చిత్రీకరించేలా ఏసీబీ ప్రణాళిక సిద్ధం చేసింది. త్వరలోనే ఈ కార్యక్రమం అమల్లోకి రానుంది.

ఎక్కడైనా అవినీతికి సంబంధించిన విషయాలు తెలిసిన వెంటనే సమాచారం అందించేలా ఇప్పటికే 14400 టోల్‌ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నంబర్‌కు పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పిస్తోంది. బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలపై పోస్టర్లను ఏర్పాటు చేయడం, ప్రధాన కూడళ్లలో హోర్డింగులను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎఫ్‌ఎం రేడియో ద్వారా కూడా అవినీతికి వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. మౌనం వీడండి.. అవినీతిపై గొంతెత్తండి అంటూ వీడియోలను సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రజల మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌లను పంపుతున్నారు. త్వరలోనే రాష్ట్రాన్ని అవినీతి లేని ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దుతామని అధికారులు దీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని స్వేచ్ఛ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని, ఆయన ఆశయాలను నెరవేర్చుతామని పేర్కొంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి