iDreamPost

కంగారూల పొగరును అణచిన ఇద్దరు లెజెండ్స్.. ఈడెన్ విక్టరీకి 23 ఏళ్లు!

  • Published Mar 14, 2024 | 7:20 PMUpdated Mar 14, 2024 | 7:20 PM

వరల్డ్ క్రికెట్​ను ఏలిన ఆస్ట్రేలియాను వాళ్లు గడగడలాడించారు. తమకు ఎదురు లేదని బడాయికి పోయిన కంగారూల పొగరును అణిచారు ఆ లెజెండ్స్.

వరల్డ్ క్రికెట్​ను ఏలిన ఆస్ట్రేలియాను వాళ్లు గడగడలాడించారు. తమకు ఎదురు లేదని బడాయికి పోయిన కంగారూల పొగరును అణిచారు ఆ లెజెండ్స్.

  • Published Mar 14, 2024 | 7:20 PMUpdated Mar 14, 2024 | 7:20 PM
కంగారూల పొగరును అణచిన ఇద్దరు లెజెండ్స్.. ఈడెన్ విక్టరీకి 23 ఏళ్లు!

క్రికెట్​ను ఆస్ట్రేలియా ఏలుతున్న రోజులవి. బై లాటరల్ సిరీస్ నుంచి వరల్డ్ కప్ వరకు.. వన్డేల నుంచి టెస్టుల దాకా అన్నింటా కంగారూలదే హవా. లాంగ్ ఫార్మాట్​లో గెలుపు కాదు కదా.. వాళ్ల చేతిలో ఓడకుండా డ్రా చేసుకోవడమే చాలా టీమ్స్ టార్గెట్​గా ఉండేది. అంతగా ఆసీస్ హవా చూపించిన కాలం అది. రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, మార్క్​ వా, స్టీవ్ వా, జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్​క్రిస్ట్ లాంటి హేమాహేమీ బ్యాటర్లకు తోడు షేన్ వార్న్, జేసన్‌ గిలెస్పీ, గ్లెన్ మెక్​గ్రాత్ వంటి కాకలు తీరిన బౌలర్లతో టీమ్ పవర్​ఫుల్​గా ఉండేది. అయితే ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్లిన కంగారూల పొగరును ఇద్దరు భారత లెజెండ్స్ అణిచారు. ఓడిపోతే ఉండే బాధ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియన్లకు రుచి చూపించారు. ఈడెన్ గార్డెన్స్​లో ఆ ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు ఆ రోజు అసాధారణంగా ఆడిన తీరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.

భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఫుల్ జోష్​లో ఉంది. ఆ టీమ్​తో మ్యాచ్ అంటేనే అందరూ భయపడే పరిస్థితి. రెండో టెస్టుకు కోల్​కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన కంగారూలు 445 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో మన జట్టును త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్​ను ముగిద్దామనుకున్న ఆసీస్.. ఫాలో ఆన్​కు పిలిచింది. అయితే ఇక్కడే ఓ అద్భుతం చోటుచేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఎవర్​గ్రీన్​గా నిలిచిపోయే ఓ పార్ట్​నర్​షిప్ నమోదైంది. సొగసరి బ్యాట్స్​మన్ వీవీఎస్ లక్ష్మణ్ (281) డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 180 పరుగులతో సత్తా చాటాడు.

23 years for VVS laxman and dravid massive batting

లక్ష్మణ్​-ద్రవిడ్ కలసి ఐదో వికెట్​కు ఏకంగా 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లిద్దరి పార్ట్​నర్​షిప్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్​లో 657 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. ఆ స్కోరు ఇన్నింగ్స్​ను డిక్లేర్ చేసింది. అనంతరం ఛేజింగ్​కు దిగిన ఆసీస్​ను టర్బనేటర్ హర్భజన్ సింగ్ (6/73) ఆఫ్ స్పిన్ మాయతో తిప్పేశాడు. అతడికి బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 3 వికెట్లు తీసి మంచి సహకారాన్ని అందించాడు. దీంతో 212 పరుగులకే కుప్పకూలింది ఆసీస్.  171 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది భారత్. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టు, ఫాలో ఆన్​కు దిగి ఇలా భారీ స్కోరు చేసి ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో అంతా షాకయ్యారు. ద్రవిడ్-లక్ష్మణ్ దెబ్బకు స్పిన్ లెజెండ్ వార్న్ ఏకంగా 152 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్​గ్రాత్, గిలెస్పీ, కాస్ప్రోవిచ్ బౌలింగ్​లోనూ సగటున 100కు పైగా పరుగులు పించుకున్నారు ద్రవిడ్-లక్షణ్​. బ్యాటింగ్​లో వీళ్లిద్దరూ విధ్వంసం సృష్టిస్తే.. బౌలింగ్​లో భజ్జీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్​కు 23 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆ రోజును ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. వీళ్ల స్ఫూర్తితో టీమిండియా తదుపరి సిరీస్​ల్లోనూ ఇలాగే ఆడాలని అంటున్నారు.

ఇదీ చదవండి: వీడియో: కెమెరాను చూసి జడుసుకున్న బాబర్ ఆజం.. భయంతో పరిగెడుతూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి