iDreamPost

ఏప్రిల్‌లో రిటైర్‌మెంట్‌.. తర్వాతేంటి?

ఏప్రిల్‌లో రిటైర్‌మెంట్‌.. తర్వాతేంటి?

కాంగ్రెస్‌ పార్టీకి ఏపీలో ఎలాంటి భవిష్యత్‌ లేదని తేలడంతో ఆ పార్టీ బడా నాయకులంతా ఇతర పార్టీలకు వెళ్లడమో, రాజకీయాలకు దూరంగా ఉండడమో చేస్తున్నారు. అయితే ఇద్దరు మాత్రం నమ్మినబంటుల్లాగా పార్టీని కాచుకొని ఉన్నారు. ఇతర పార్టీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూ తమ విశ్వాసాన్ని చాటుకుంటూ ఉన్నారు. వారే రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి. ఈ ఇద్దరి పదవీకాలం ఏప్రిల్‌ 9తో ముగియనుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత సుబ్బిరామిరెడ్డిని ఏపీకి, కేవీపీని తెలంగాణకు కేటాయించిన విషయం తెలిసిందే. పదవీకాలం ముగిసిన తర్వాత వీరి కార్యాచరణ ఏంటి అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

దివంగత వైఎస్సార్‌ ప్రాణ స్నేహితుడిగా కేవీపీ అందరికీ సుపరిచితమే. వైఎస్సార్‌ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌ కొత్తపార్టీ పెట్టుకున్నా.. అటువైపు చూడలేదు. అప్పట్లో వైఎస్సార్‌కు ఎంతో సన్నిహితంగా ఉన్న వారంతా వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసినా కేవీపీ మాత్రం మాట తూలలేదు. వైఎస్‌ జగన్‌ నాకు కొడుకు లాంటివాడు అని చెబుతూనే ఉండేవాడు. అదే సమయంలో కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్‌ పార్టీపై కూడా విమర్శలు చేయలేదు. పార్టీకి విధేయుడిగానే కొనసాగుతూ వస్తున్నాడు. వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం కార్యక్రమానికి హాజరయ్యాడు. ఈ సందర్భంలో ఆయన వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చినా.. అవి ఊహాగానాలుగానే నిలిచిపోయాయి.

ఇక సుబ్బిరామిరెడ్డి కూడా కాంగ్రెస్‌ పార్టీకి విధేయునిగానే ఉంటున్నారు. మొన్నటి ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీలో చేరి విశాఖ నుంచి పోటీ చేస్తారని పుకార్లు వచ్చినా.. అవి నిజం కాలేదు. కానీ వైఎస్‌ జగన్‌ నిర్ణయాలకు అప్పుడప్పుడూ సపోర్ట్‌గానే ఉంటున్నారు. పరిపాలనా వికేంద్రీకరణ, ఇంగ్లిష్‌ మీడియం తదితర విషయాల్లో జగన్‌కే అనుకూలంగానే మాట్లాడారు.

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సీట్లు లేకపోయినా.. దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయినా.. ఇటీవల కొన్ని పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు కేవీపీ, సుబ్బిరామిరెడ్డి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సభ్యులు, ఇతర సీనియర్‌ నాయకులను కలిసి తమ వాదనలు వినిపిస్తున్నారు. తన స్నేహితుడు, మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌ ద్వారా మరోసారి రాజ్యసభలో ప్రవేశించాలని కేవీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రాజ్యసభలో దిగ్విజయ్‌ పదవీకాలం కూడా త్వరలోనే ముగియనుండంతో ఏ మేరకు సహాయం చేస్తారనేది వేచిచూడాలి.

ఇక సుబ్బిరామిరెడ్డి సోనియా గాంధీకి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుల ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీకి కష్టకాలంలో తాను అందించిన ఆర్థిక సహాయలను మర్చిపోవద్దని సుబ్బిరామిరెడ్డి కోరుతున్నారు. అధిష్టానం కూడా ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వడంపై సానుకూలంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా రాజ్యసభలో వచ్చే సీట్లు తక్కువ.. కానీ ఆశావహుల సంఖ్య మాత్రం కాంగ్రెస్‌ పార్టీలో భారీగానే ఉంది. ఉత్తరాది డ్యామినేషన్‌ను తట్టుకొని వీరిద్దరూ మరోసారి అవకాశం సాధిస్తారో లేదో వేచిచూడాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి