iDreamPost

అక్క ఇంటి వాసాలు లెక్కపెడుతున్న కూనా రవి

అక్క ఇంటి వాసాలు లెక్కపెడుతున్న కూనా రవి

మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసారు. అసెంబ్లీలో అమరావతికి మద్దతిచ్చిన జగన్ ఇప్పుడు మాటతప్పారన్నారు. విశాఖ ప్రజలు జగన్‌ను గోబ్యాక్‌ అనాలని పిలుపునిచ్చారు. 9నెలల్లో పైసా ఖర్చులేకుండా జగన్ అమరావతి నుంచే పాలన సాగిస్తున్నారని,హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఉన్నాయని తెలిపారు. విజయవాడలో తిరిగే నైతిక అర్హత మంత్రి బొత్సకు లేదన్న కూన అమరావతి నుంచి పరిపాలన చేస్తూ తిన్నింటి వాసాలు లెక్కపెట్టేలా జగన్‌ అండ్‌ కో తీరు ఉందని రవికుమార్ ఆగ్రహించారు.

అయితే గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న రవికుమార్ ఈ మధ్యనే మీడియా ముందుకు వస్తున్నారు. గతంలో జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులతో అనుచితంగా మాట్లాడి దౌర్జన్యం చేశారని పోలీసులకు సరుబుజ్జిలి ఎంపీడీవో ఫిర్యాదుచేశారు. రవికుమార్ మాట్లాడిన ఆడియో టేపుల్ని ఆధారాలుగా అందజేయడంతో కూన రవికుమార్‌పై పోలీసులు కేసు నమోదుచేసారు. రవికుమార్‌‌ను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దాంతో కూనను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేయగా కూన ముందస్తు బెయిల్ కు ప్రయత్నాలు చేసుకుని అప్పుడు అజ్ఞాతాన్ని వీడారు. తనపై అక్రమంగా కేసులు పెట్టారని ఈకేసుల వెనుక స్పీకర్ తమ్మినేని ఉన్నారని కూన ఆరోపించారు.

లేటెస్ట్ గా అజ్ఞాతాన్ని వీడిన కూన తిన్నింటి వాసాలు జగన్ లెక్క పెడుతున్నారంటూ విమర్శించడం, స్పీకర్ తమ్మినేని సీతారాంపై పెద్దఎత్తున ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అసలు కూన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందే తమ్మినేని అనుచరుడిగానే.తమ్మినేని, కూన బావ, బామ్మర్ధులు.. తమ్మినేని జిల్లాలో సీనియర్ టీడీపీ నేత,జిల్లా అధ్యక్షుడిగా ఉన్నపుడు బావ వెంట కూన రవి ఉండేవారు.. బావ తమ్మినేని ఆయనతో రాజకీయ అరంగేట్రం చేయించారు. బావ రాష్ట్ర, జిల్లా రాజకీయాల్లో బిజీ అయినపుడు బావ సూచనలతో కూన స్థానిక రాజకీయాలకు న్యాయకత్వం వహించేవారు. బావ ఆదేశిస్తే ఆచరణలో పెట్టడమే బావమరిది వంతుగా ఉండేది.

అయితే ఒకప్పుడు ఒకటిగా ఇద్దరూ కలిసి ఏ రాజకీయాన్నైతే నడిపించారో ఇప్పుడు అదే రాజకీయంగా వీరిద్దరూ బద్ధ శత్రవులుగా తయారయ్యారు. 2009లో ఆవిర్భవించిన ఓ రాజకీయ పార్టీ వీరి బంధం తెగిపోవడానికి కారణమైంది. 2009లో టీడీపీ అగ్రనాయకుడిగా ఉన్న తమ్మినేని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే బావతో పాటు కూన పార్టీ మారలేదు.. బావ రాజకీయ అనుచరుడిగా అప్పటివరకూ అడుగులు వేసిన కూన అక్కడి నుంచి బావకు తిరుగుబావుటా ఎగురవేసారు.

అలాంటి బావ సైకిల్ దిగిపోయి రైలింజన్ ఎక్కినా.. కూన సైకిల్ పైనే ఉండిపోయారు. దాంతో ఆముదాలవలసలో సైకిల్ హ్యాండిల్ ను కూన చేతిలో పెట్టారు చంద్రబాబు. నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమితుడై 2009 ఎన్నికల్లో కూన పోటీచేయగా తమ్మినేని పీఆర్పీ తరపున పోటీ చేసారు. అయితే ఆ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయి కాంగ్రెస్ అభ్యర్ధి బొడ్డేపల్లి సత్యవతి గెలుపొందారు.

అనంతరం రాజకీయ పరిణామాల నేపధ్యంలో 2014 ఎన్నికల నాటికి తమ్మినేని వైసీపీనుండి కూన టీడీపీ నుండి పోటీ చేసారు. ప్రత్యర్ధులుగా కత్తులు దూసుకున్నారు. అదృష్టం వరించి కూన గెలుపొందారు. వెంటనే ప్రభుత్వ విప్ పదవి దక్కించుకున్నాడు. తన చేతిలో రాజకీయ ఓనమాలు దిద్దిన కూన గెలవడంతో తమ్మినేని సాధారణంగానే అసహనానికి గురయ్యారు. 2014నుండి 19వరకూ పలు అవినీతి వ్యవహారాల్లో కూన చక్రం తిప్పారు. ముఖ్యంగా పలువురు అధికారులపైనా నోరు పారేసుకున్నారు.

కట్ చేస్తే 2019 ఎన్నికల్లో బావ బామ్మర్ధులిద్దరూ అవే పార్టీలనుంచి రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లోనూ మాటల యుద్దానికి కూన శ్రీకారం చుట్టారు. అసలు నేను లేకపోతే తమ్మినేనికి గుర్తింపు ఎక్కడిదంటూ మాట్లాడేవారు.. అక్క భర్త కాబట్టి ఊరుకుంటున్నానని లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని హెచ్చరించారు. తమ్మినేని కూడా ఘాటుగానే స్పందించారు. అయితే 2019ఎన్నికల్లో తమ్మినేని విజయం సాధించారు. అందుకే ఆముదాలవలస ప్రజలు చెప్తుంటారు.. తమ్మినేని అండతో రాజకీయాల్లోకి వచ్చి ఆయనను అయన పార్టీ వీడినపుడు కిమ్మనకుండా ఆయనస్థానంలోకి వచ్చి ఆయనపైనే పోటీ చేసాడని చెప్తున్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా బావను అనేక ఇబ్బందులకు గురి చేసాడని, తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నాడంటూ జగన్ ని విమర్శిస్తున్న కూన ముందు అక్క ఇంటి వాసాలకు లెక్కలు చెప్పాలంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి