iDreamPost

కేటీఆర్ ,ది బెస్ట్ మినిస్ట‌ర్ అవార్డు విన్నర్

కేటీఆర్ ,ది బెస్ట్ మినిస్ట‌ర్ అవార్డు విన్నర్

తండ్రి కేసీఆర్ రాజ‌కీయ వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్నా.. త‌న‌కంటూ ప్ర‌త్యేక శైలి ఏర్ప‌రుచుకుని తెలంగాణ రాజ‌కీయాల్లో గుర్తింపు పొందిన వ్య‌క్తి క‌ల్వ‌కంట్ల తార‌క రామారావు. అత‌నే కేటీఆర్. అటు విప‌క్షాల ఎత్తుల‌ను తిప్పికొడుతూ ఇటు మంత్రిగా రాష్ట్ర అభివృద్ధిలో త‌న‌దైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఎన్నో ప్ర‌శంస‌లు పొందుతున్నారు. సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఐటీ మంత్రి అనిపించుకుంటున్నారు.

మున్సిప‌ల్ శాఖ మంత్రిగా పౌర సేవ‌ల‌ను ప‌రుగెట్టిస్తున్నారు. అందుకే ఆయ‌న దేశంలోనే ఉత్త‌మ మంత్రిగా గుర్తింపు పొందారు. దేశంలోనే ఉత్తమ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిగా కేటీఆర్‌ నిలిచారు. ఈ మేరకు స్కోచ్‌ గ్రూప్‌ మంత్రి కేటీఆర్‌ ప్రశంసాపత్రం అందించింది. ఇక తెలంగాణ రాష్ట్రానికి ఈ గవర్నెన్స్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఈయర్‌ అవార్డు స్కోచ్‌ గ్రూప్‌ ప్రకటించింది. మొన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలోనే అత్యుత్తమ సీఎంగా స్కోచ్‌ అవార్డు అందించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో భాగం అయ్యేందుకు అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి 2004 నుంచి పరోక్ష రాజకీయాల్లోకి వచ్చారు కేటీఆర్. 2006 కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ 2లక్షల పైచిలుకు మెజార్టీతో పొంద‌డంలో కేటీఆర్ కీల‌క పాత్ర వ‌హించారు. 2009 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారిగా పోటీచేసి, తన సమీప ప్రత్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, తిరిగి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్‌రెడ్డిపై 68,219 ఓట్ల భారీ మెజార్టీతో రెండోసారి గెలుపొందారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కొండూరి రవీందర్‌రావుపై 53,004 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తొలిసారి ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 2018 ముందస్తు ఎన్నికల్లో 89,009 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2018 డిసెంబరు 17న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు.

2019 సెప్టెంబరు 8న ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖలను కేటాయించారు. ఓ సంద‌ర్భంలో కేటీఆరే తెలంగాణ ముఖ్య‌మంత్రి అన్న ప్ర‌చారం కూడా విప‌రీతంగా జ‌రిగింది. ఆయ‌న‌కు ఆ అర్హ‌త‌లు ఉన్నాయంటూ టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌లు బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. ఇలా కేసీఆర్ కుమారుడిగానే కాకుండా సొంత ఇమేజ్ పెంపొందించుకుంటున్నారు. అటు ప్ర‌జ‌ల‌లోను, ఇటు పాల‌న‌లోను ప్ర‌త్యేకత‌ను చాటుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న దేశంలోనే ఉత్త‌మ మంత్రిగా గుర్తింపు పొందార‌ని టీఆర్ఎస్ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాయి.

దేశంలోనే అత్యుత్తమంగా ఐటీ మంత్రిగా సేవలందిస్తున్న కేటీఆర్‌కు ఈ అవార్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్కోచ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సమీర్‌ కొచ్చర్‌ మంత్రి కేటీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజలకు ఐటీ సేవలను అందించడం కొనసాగించాలని చెప్పారు. కరోనా కాలంలో ఐటీ సేవలను విస్తృతంగా వినియోగించారని అభినందించారు. 2016లో ఒకసారి మళ్లీ ఇప్పుడు రెండుసార్లు అవార్డు పొందడం అభినందనీయమని కేటీఆర్‌కు సందేశం పంపించారు. అయితే ఈ గవర్నెన్‌ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండో స్థానంలో నిలవడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి