ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే విశ్వ సమరానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. దీంతో అన్ని జట్లు తమ తమ ప్రణాళికలను జట్లను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే కొన్ని జట్లు వరల్డ్ కప్ టీమ్స్ ను కూడా ప్రకటించాయి. తాజాగా టీమిండియా కూడా వరల్డ్ కప్ ఆడే యోధుల పేర్లను ప్రకటించింది. ఈ నేపథ్యంలో టీమ్ సెలక్షన్ పై కొందరు ప్రశంసలు కురిపించగా.. మరికొందరు గణిత శాస్త్రంలో ఉన్న లెక్కలన్నీ చూసి ఆ ఆటగాళ్లను ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటూ పెదవి విరుస్తున్నారు. ఆ జాబితాలోకి తాజాగా చేరాడు వరల్డ్ కప్ హీరో, మాజీ చీఫ్ సెలెక్టర్
శ్రీకాంత్ కృష్ణమాచారి. ఆ ప్లేయర్ వరల్డ్ కప్ టీమ్ లో అవసరమా? అంటూ ప్రశ్నించాడు.
వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీ కోసం టీమిండియాను ప్రకటించింది బీసీసీఐ. కాగా.. జట్టును చూసి కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు మాత్రం కొంత మంది ఆటగాళ్లను ఎందుకు సెలెక్ట్ చేశారు? అంటూ బీసీసీఐపై మండిపడుతున్నారు. తాజాగా టీమిండియా వరల్డ్ కప్ టీమ్ సెలెక్షన్ పై స్పందించాడు మాజీ చీఫ్ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్. ఆల్ రౌండర్ కోటాలో శార్దూల్ ఠాకూర్ ను ఎందుకు తీసుకున్నారు? అంటూ బీసీసీఐను ప్రశ్నించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో శ్రీకాంత్ కృష్ణమాచారి టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తో ఈ విషయంపై వాదనకు దిగాడు. శార్ధూల్ ఎంపిక చాలా విడ్డూరంగా ఉందని పేర్కొన్నాడు.
కృష్ణమాచారి శ్రీకాంత్ మాట్లాడుతూ..”శార్ధూల్ నిలకడైన బ్యాటర్ కాదు.. అలాగని అతడి బౌలింగ్ కూడా ప్రస్తుతం గొప్పగా ఏమీ లేదు. గతేడాది టీ20 వరల్డ్ కప్ తర్వాత అతడి టాప్ స్కోర్ 25 మాత్రమే. అదీకాక అతడు వన్డేల్లో ఎన్నిసార్లు తన పూర్తి కోటా 10 ఓవర్లు వేశాడు? వెస్టిండీస్, జింబాబ్వే లాంటి పసికూనలపై రాణించాడని వరల్డ్ కప్ లోకి తీసుకోకూడదు. వరల్డ్ కప్ ఆడేది పసికూనలతో కాదు.. ఆసీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్థాన్ లాంటి బలమైన జట్లతో” అంటూ శార్ధూల్ ఎంపికపై మండిపడ్డాడు.
ఇక చాలా మంది ఎనిమిదో నెంబర్లో బ్యాటర్ కావాలని అంటున్నారు, కానీ ఆ స్థానంలో అసలు బ్యాటర్ ఎందుకు? అని ప్రశ్నించాడు. ఓ ప్లేయర్ ఓవరాల్ సగటు చూసి మోసపోవద్దని, బలమైన జట్లపై అతడి ప్రదర్శన చూడాలని శ్రీకాంత్ కృష్ణమాచారి అన్నాడు. కాగా.. గతేడాది జనవరి నుంచి 24 వన్డేలు ఆడిన శార్దూల్ కేవలం రెండు సార్లు మాత్రమే తన 10 ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. అలాగే 12 ఇన్నింగ్స్ ల్లో 8వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి.. 9 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగాడు శార్దూల్. మరి శార్ధూల్ ఠాకూర్ పై శ్రీకాంత్ కృష్ణమాచారి చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను తెలియజేయండి.