iDreamPost

World Cup 2023: IND vs PAK మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

  • Author Soma Sekhar Updated - 03:44 PM, Wed - 6 September 23
  • Author Soma Sekhar Updated - 03:44 PM, Wed - 6 September 23
World Cup 2023: IND vs PAK మ్యాచ్ చూడాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే!

వరల్డ్ క్రికెట్ లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దాయాదుల సమరాన్ని వీక్షించేందుకు ప్రపంచం మెుత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటుంది. అదీకాక వరల్డ్ కప్ లాంటి విశ్వ సమరంలో ఈ రెండు జట్లు తలపడితే.. ఇంకేమైనా ఉందా? ఆ హై ఓల్టేజ్ మ్యాచ్ గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మ్యాచ్ కోసం, టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి మ్యాచే ఈ ఏడాది వరల్డ్ కప్ లో జరగబోతోంది. మరి ఈ మ్యాచ్ ను మీరు చూడాలనుకుంటున్నారా? అయితే ఒక్క టికెట్ కోసం మీ ఆస్తులు మెుత్తం అమ్ముకోవాల్సిందే. ఒక్క టికెట్ ఎన్ని లక్షలు పలుకుతుందో తెలుసా?

వరల్డ్ కప్ 2023 సమరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ లకు సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముతున్నారు. ఇక అక్టోబర్ 14న అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు సంబంధించిన టికెట్లు ఆన్ లైన్ లో పెట్టగా.. పెట్టిన గంటలోనే అన్నీ అమ్ముడైపోయాయి. దీన్ని బట్టే అర్ధం చేసుకోవచ్చు ఇండియా-పాక్ మ్యాచ్ రేంజ్ ఏంటో! ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఈ మ్యాచ్ కోసం వెయిట్ చేశారు. కానీ అందరికి టికెట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే ముందే టికెట్లను బుక్ చేసుకున్న కొందరు ఈ టికెట్లను బ్లాక్ లో అమ్మేందుకు సిద్దపడుతున్నారు. ఇలా అమ్మే టికెట్లు ఎంత ధర పలుకుతున్నాయో తెలిస్తే.. మీరు కళ్లు తేలేయాల్సిందే. ఒక్కో టికెట్ అక్షరాలా రూ. 57 లక్షలు అంటే నమ్ముతారా?

కాగా.. ఎలాంటి లైవ్ ఈవెంట్స్ కు సంబంధించిన టికెట్స్ అయినా లభించే సెకండరీ మార్కెట్లలో వయాగోగో ఒకటి. ఇక ఇది వరల్డ్ లోనే పెద్ద సెకండరీ మార్కెట్ అని కొందరు అంటారు. వరల్డ్ కప్ కు సంబంధించిన అన్ని మ్యాచ్ ల టికెట్లు ఈ వెబ్ సైట్ లో ఉన్నాయి. కానీ వీటి ధర మాత్రం మనం ఊహించలే. వరల్డ్ కప్ లో టీమిండియా ఆడే తొలి మ్యాచ్ ఆసీస్ తో. ఈ మ్యాచ్ టికెట్లే ఈ వెబ్ సైట్ లో ఒక్క టికెట్ ఏకంగా రూ. 41, 118 నుంచి రూ. 1.67 లక్షల వరకు పలుకుతున్నాయి. ఆసీస్ తో మ్యాచ్ కే ఈ రేటు ఉంటే.. దాయాదుల పోరుకు ఆ మాత్రం రేటు ఉండదా? ఇండియా-పాక్ మ్యాచ్ ఒక్క టికెట్ రేటు అక్షరాలా రూ. 57,198 నుంచి రూ. 57.15 లక్షల వరకు పలుకుతోంది. అంటే ఒక్క టికెట్ కొనాలంటే అరకోటి పైనే అన్నమాట. కాగా.. ఈ మ్యాచ్ చూడాలంటే.. మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్ రేట్లు నిజమైన ఫ్యాన్స్ కు అన్యాయం చేస్తున్నాయని మండిపడుతున్నారు నెటిజన్లు. ఇంత జరుగుతున్నా బీసీసీఐ, ఐసీసీ ఏం చేస్తున్నాయని సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి