iDreamPost

ఏపీ కి 84… టీఎస్ కు 140…నీటి పంపకం

ఏపీ కి 84… టీఎస్ కు 140…నీటి పంపకం

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ నది జలాల పంపకం ముగిసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో కనీస నీటి మట్టాలకు ఎగువన అందుబాటులో ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 84, తెలంగాణకు 140 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. రబీలో సాగు, వేసవిలో తాగునీటి అవసరాలకు 98 టీఎంసీలు కేటాయించాలని ఏపీ, 157 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ సర్కార్‌ చేసిన ప్రతిపాదనలపై బోర్డు చర్చించింది.

ఉమ్మడి ప్రాజెక్టుల్లో కనీస నీటి మట్టాలకు ఎగువన ఉన్న జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 66, తెలంగాణకు 34 శాతం చొప్పున కేటాయిస్తూ కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటు ప్రకారమే ఈ ఏడాది నీటి కేటాయింపులు చేస్తామని బోర్డు స్పష్టంచేసింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో కనీస నీటి మట్టాలకు ఎగువన ప్రస్తుతం 233 టీఎంసీల నీరు ఉందని.. ఆవిరి నష్టాలు తీసివేయగా మిగిలిన 224 టీఎంసీల్లో ఏపీకి 84, తెలంగాణకు 140 టీఎంసీలను బోర్డు కేటాయించింది.

హైదరాబాద్‌లోని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు పంపిణి ప్రక్రియ సాగింది. వరద వచ్చిన రోజుల్లో వినియోగించుకున్న నీటిని లెక్కలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ చేసిన ప్రతిపాదనపై మరోసారి చర్చిద్దామని సూచిం చింది. బోర్డు వర్కింగ్‌ మాన్యువల్‌ (కార్యనిర్వాహక నియమావళి)ని కృష్ణా, గోదావరి బోర్డుల సంయుక్త సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని చైర్మన్‌ డాక్టర్‌ ఆర్కే గుప్తా చేసిన ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి.

ప్రస్తుత సీజన్‌లో ఇప్పటిదాకా ఏపీ 511, తెలంగాణ 159 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఈ ఏడాది శ్రీశైలానికి కృష్ణా నది నుంచి ఎనిమిది దఫాలుగా భారీగా వరద ప్రవాహం రావడంవల్ల ప్రకాశం బ్యారేజీ నుంచి ఈ ఏడాది 800 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశామని ఏపీ అధికారులు తెలిపారు. సముద్రంలో కలుస్తున్న వరద జలాలను వినియోగించుకున్నామని.. వాటిని లెక్కలోకి తీసుకోవద్దని బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోలేమని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి