iDreamPost

యువసామ్రాట్ డెబ్యూ కథ – Nostalgia

యువసామ్రాట్ డెబ్యూ కథ – Nostalgia

కోట్లాది అభిమానుల అశేషమైన ప్రేమను సంపాదించుకున్న స్టార్ హీరో తన వారసుడిని తెరకు పరిచయం చేయడం అంటే మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు. ఏ మాత్రం అటుఇటు అయినా భవిష్యత్తు కష్టం. పైగా తండ్రిగా నిందను మోసుకోవాల్సి వస్తుంది. అందుకే ఈ విషయంలో కథానాయకులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. 1985లో అక్కినేని నాగేశ్వరరావు గారి వద్దకు అన్నయ్య వెంకట్ ను వెంటబెట్టుకుని ఆయన రెండో అబ్బాయి నాగార్జున వచ్చి నటుడవ్వాలనుకుంటున్నానని చెప్పినప్పుడు ఏఎన్ఆర్ చాలా ఆలోచించారు. చివరికి సరేనని నటన, నృత్యం, డైలాగ్ డెలివరీకి సంబంధించి అన్ని రకాల శిక్షణను నిష్ణాతుల చేత ఇప్పించాక మీడియా సమావేశంలో ప్రకటన ఇచ్చారు.

తొలి చిత్రం కాబట్టి రిస్క్ లేకుండా రీమేక్ ఎంచుకోవాలని డిసైడ్ అయ్యారు ఏఎన్ఆర్. తనతో 20 సినిమాల అనుబంధం ఉన్న వి మధుసూదన్ రావుని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిల హవా నడుస్తోంది. 1983లో బాలీవుడ్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సుభాష్ ఘాయ్ హీరో సబ్జెక్టు అయితేనే నాగార్జునకు సూటవుతుందని వెంటనే హక్కులు కొనేశారు. శోభన హీరోయిన్ గా తీసుకుని 1985 ఆగస్ట్ లో శివాజీగణేషన్ ముఖ్యఅతిధిగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్, కర్ణాటక, మంగళూరు, కుద్రేముఖ్ ప్రాంతాల్లో భారీ ఖర్చుతో షూటింగ్ జరిపారు.

చిన్నపాటి క్రైమ్ రివెంజ్ ఎలిమెంట్ మిక్స్ చేసిన అద్భుతమైన లవ్ స్టోరీ విక్రమ్. 1986 మే 23న భారీ అంచనాలతో సుమారు అరవైకి పైగా థియేటర్లలో ఊహించని స్థాయిలో ఓపెనింగ్ తెచ్చుకుంది. నాగ్ గెటప్, హెయిర్ స్టైల్, నటన మీద కొంత మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ అంతటి క్లిష్టమైన పాత్రను మంచి ఈజ్ తో నెగ్గుకురావడం విమర్శకులను మెప్పించింది. వంద రోజుల ఫంక్షన్ చేద్దామనుకుంటున్న టైంలో తుఫాను రావడంతో ఆ ఆలోచన విరమించుకున్నారు ఏఎన్ఆర్. కొన్ని ఒరిజినల్ ట్యూన్లతో పాటు స్వంతంగా చక్రవర్తి ఇచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సత్యానంద్ మాటలు, సుందరం ఛాయాగ్రహణం స్థాయిని పెంచాయి. కేవలం 5 రోజుల గ్యాప్ తో వచ్చిన చిరంజీవి వేట ఫ్లాప్ కావడం విక్రమ్ కు ప్లస్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి