iDreamPost

తీవ్రవాదంపై క్రియేటివ్ ఖడ్గం – Nostalgia

తీవ్రవాదంపై క్రియేటివ్ ఖడ్గం – Nostalgia

తీవ్రవాదం వల్ల కలిగే నష్టాలను చూపిస్తూ వాటిని దేశభక్తితో ముడిపెట్టి ప్రేక్షకులను మెప్పించేలా సినిమా తీయడం సాధ్యమా. అసలు ఆ ఆలోచన రావడమే ఒక సాహసం. అందులోనూ కమర్షియల్ హీరోలను డీల్ చేస్తున్నప్పుడు ఇది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. అయినా దీన్ని అద్భుతంగా డీల్ చేసి తనదైన ముద్రవేసిన క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తీసిన ‘ఖడ్గం’ పాట్రియాటిక్ చిత్రాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది. 2002లో ఖడ్గం షూటింగ్ జరుగుతున్న టైంకి రవితేజ ‘ఇడియట్’తో సోలో హీరోగా భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అయినా కూడా తనకు ‘సిందూరం’ లాంటి మెమరబుల్ మూవీ ఇచ్చాడన్న కారణంగా కృష్ణవంశీ తనను ముగ్గురు హీరోల్లో ఒకడిగా చూపిస్తానన్నా అభ్యంతరం చెప్పలేదు.

మహేష్ బాబుతో ‘మురారి’ లాంటి ఎమోషనల్ డ్రామా, అంతకు ముందు సౌందర్యతో ‘అంతఃపురం’ లాంటి ఫ్యాక్షన్ కం మెసేజ్ మూవీ తీశాక ‘సముద్రం’ దెబ్బ కొట్టడంతో కృష్ణవంశీ మనసు దేశభక్తి వైపు మళ్లింది. మతాల పేరుతో విద్వేషాలు పెంచుకోవడం, క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ వర్గం పాకిస్థాన్ కు మద్దతుగా హైదరాబాద్ లో సంబరాలు చేసుకోవడం లాంటి సంఘటనలు ఆయనను విపరీతమైన ఆలోచనకు గురి చేసేవి. సరిహద్దులో సైనికులు మన కోసం ప్రాణాలు ఇస్తుంటే ఆ స్వతంత్రాన్ని సద్వినియోగపరుచుకోకుండా ఇలా కొట్టుకోవడం గురించి ఆలోచింపజేసేలా ఒక సినిమా తీయాలని నిర్ణయించుకుని రాసుకున్న కథే ఖడ్గం. ఉత్తేజ్ సంభాషణలు సమకూర్చగా సత్యానంద్ అడిషనల్ స్క్రీన్ ప్లే అందించారు.

ముస్లిం అయినా దేశమంటే ప్రాణమిచ్చేంత ప్రేమ ఉన్న అంజాద్(ప్రకాష్ రాజ్), టెర్రరిస్టుల వేటలో తన ప్రియురాలిని కోల్పోయినా నిబ్బరంగా తీవ్రవాదుల అంతం చూసేందుకు కంకణం కట్టుకున్న రాధా కృష్ణ(శ్రీకాంత్), ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిపోవాలని నానా రకాల ప్రయత్నాలు చేస్తున్న కోటి(రవితేజ). ఈ ముగ్గురి కథలను కలుపుతూ దానికి దేశభక్తి థ్రెడ్ ని అద్భుతంగా ముడిపెట్టిన కృష్ణవంశీ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బ్రహ్మాజీ శవం దగ్గర సన్నివేశాలు, పాకిస్థాన్ మీద ప్రేమ చూపించే కొందరు యువకులకు ముగ్గురు బుద్ది చెప్పే ఎపిసోడ్ ఇలా చాలా సన్నివేశాలు ఖడ్గం చూస్తున్న ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకునే అనుభూతిని ఇచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ పాటలు, బ్యాక్ గ్రౌడ్ స్కోర్ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. హాస్యనటుడు పృథ్వి 30 ఇయర్స్ ఇంటిపేరుగా ,మారింది ఈ సినిమాతోనే.  జాతీయ సమైక్యత విభాగంలో ఖడ్గం జాతీయ అవార్డు గెలుచుకుంది. 2002 నవంబర్ 29న రిలీజైన ఖడ్గం సూపర్ హిట్ కొట్టేసి కమర్షియల్ గానూ గొప్ప విజయం నమోదు చేసుకుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి