iDreamPost

కెజిఎఫ్ 2 కు అదే అసలు సమస్య

కెజిఎఫ్ 2 కు అదే అసలు సమస్య

ఊహించని రీతిలో కన్నడ సినిమా చరిత్రలో మొదటిసారిగా వంద కోట్ల మార్కును చేరుకున్న చిత్రంగా రికార్డులు సృస్టించిన కెజిఎఫ్ సీక్వెల్ షూటింగ్ ప్రస్తుతం రాయలసీమ ప్రాంతాల్లో జరుగుతోంది. కర్నూల్, కడప జిల్లాల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు పూర్తి చేసుకున్న యూనిట్ తిరిగి కర్ణాటకలో బాలన్స్ కొనసాగించనుంది. తెలుగు హిందీ డబ్బింగ్ వెర్షన్స్ లోనూ ఘన విజయం సొంతం చేసుకున్న కెజిఎఫ్ కొనసాగింపుగా వస్తున్న చాప్టర్ 2 పై అంచనాలు మాములుగా లేవు. ఇప్పుడు ఇదే సమస్యగా పరిణమించే అవకాశం లేకపోలేదు.

చాప్టర్ 1 రిలీజైనప్పుడు దాని మీద పెద్దగా అంచనాలు లేవు. ట్రైలర్ ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ మనవాళ్ళు ఓపెనింగ్ రోజు బ్రహ్మాండమైన వసూళ్లు ఇవ్వలేదు . పోటీగా వచ్చిన అంతరిక్షం, పడి పడి లేచే మనసు దారుణంగా బోల్తా కొట్టడం, కెజిఎఫ్ లో ఎలివేషన్స్ గురించి మాస్ నుంచి మంచి టాక్ రావడం ఇదంతా ప్లస్ గా మారింది. మరోవైపు బాలీవుడ్లో అదే తేదీన వచ్చిన షారుఖ్ ఖాన్ జీరో టైటిల్ కు తగ్గట్టే సున్నా చుట్టేయడంతో కెజిఎఫ్ బాలీవుడ్ లోనూ జయకేతనం ఎగరేసింది. దీని క్రేజ్ దెబ్బకు సంజయ్ దత్ విలన్ గా నటించేందుకు ముందుకు రావడాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఇప్పుడు కెజిఎఫ్ 2 ఈ హైపే సమస్యగా మారనుంది. అన్ని భాషల్లోనూ దీని మీద విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎంత లేదన్నా పాన్ ఇండియా లెవల్ లో రెండు వందల కోట్ల బిజినెస్ ఈజీగా జరుగుతుందని ట్రేడ్ పండితుల ఉవాచ. సో మొదటి భాగం కన్నా ఎన్నో రేట్లు పైన ఉంటె తప్ప ఈ సీక్వెల్ మెప్పించడం కష్టం.

అసలే దక్షిణాది సినిమా చరిత్రలో రెండో భాగంగా వచ్చి విజయం సాధించిన సినిమా బాహుబలి ఒక్కటే. మిగిలినవన్నీ మాములు డిజాస్టర్లు కాలేదు. అందుకే కెజిఎఫ్ 2 మీద ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసే భారం కూడా ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ హీరో యష్ లు చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన కొత్త పోస్టర్లకు స్పందన బాగానే ఉంది కానీ టీజర్ వచ్చే దాకా క్లారిటీ రాదు. మొదటి భాగం లాగే కెజిఎఫ్ 2 కూడా ఏడాది చివర్లో అంటే డిసెంబర్ లోనే విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి