iDreamPost

ఒక సీఎం పదవి పోవటానికి కారణమైన ఊరు,దేశమంతా అన్నదాన సత్రాలు నెలకొల్పిన ఊరు కానీ నేడు స్కూల్ దారికి…

ఒక సీఎం పదవి పోవటానికి కారణమైన ఊరు,దేశమంతా అన్నదాన సత్రాలు నెలకొల్పిన ఊరు కానీ నేడు స్కూల్ దారికి…

ఒక సీఎం పదవి పోవటానికి కారణమైన ఊరు,
ఎన్నో అన్నదాన సత్రాలు కట్టించిన ఊరు ..
స్కూల్ కు మాత్రం అడ్డంగా గోడ కట్టారు

సై సినిమాలో చూపించినట్లు విలన్ ఉదయం లేచేసరికి రూమ్ నుంచి బయటకు వచ్చే వీలు లేకుండా తలుపుకు అడ్డంగా గోడ కట్టినట్లు ఆ ఊరిలో స్కూల్ కు వెళ్లే దారిలేకుండా అడ్డుగోడ కట్టారు.

గతంలో స్థలం అమ్మిన వాళ్ళు చేసిన పొరపాటో , ఉద్దేశ్యం పూర్వకంగానో జరిగిన పొరపాటుకు ప్రస్తుత యజమానులు “ఇది మా స్థలం ,మీకు దారి ఇవ్వవలసిన అవసరం లేదని” అడ్డంగా గోడ కట్టారు.. ఇది కర్నూల్ జిల్లా ఆత్మకూర్ వద్ద నున్న కరివెన గ్రామంలో జరిగింది.

ఐదు రోజుల పాటు టీచర్లు విద్యార్థులను గోడ ఎక్కించి స్కూల్ లోపలి తీసుకెళ్లారు. స్థానిక నాయకులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. మూడు రోజుల కిందట ఈటీవీ వాళ్ళు ఈ వార్తను ప్రచారం చెయ్యటంతో సమస్య అందరికి తెలిసింది.

అనేక మంది ఈ సమస్య మీద స్పందించి స్థానిక అధికారులతో మాట్లాడారు. విద్యారంగ సంస్కరణల మీద ఆంధ్రప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో కీలక సభ్యులు వెంకట్ రెడ్డి సార్ ఈ సమస్య మీద కర్నూల్ జిల్లా సహచరుల ద్వారా ఆత్మకూర్ MRO ,MPDO లతో మాట్లాడారు. వెంటానే స్పందించిన MRO కరువెన గ్రామానికి వెళ్లి స్కూలుకు అడ్డంగా ఉన్న గోడను తొలగింపచేశారు.

రెండు నెలల కిందట హైదరాబాదులో స్కూలోకి తొంగి చూస్తూన్న బాలికను అదే స్కూల్లో చేర్చటంలో వెంకట రెడ్డి సార్ టీం పాత్ర ముఖ్యమైనది.

కరివెన గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. దేశ వ్యాప్తంగా “అన్నదాన సత్రాలు” కరివెనా పేరుతో నడుస్తున్నాయి. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రకాశం పంతులు గారిని అవిశ్వాస తీర్మానంతో దించటంలో కరివెన భూ పోరాటం , కల్లు గీత కార్మికుల పోరాటం ప్రధాన కారణాలు

కరివెన అగ్రహార చరిత్ర

1957లో రోడ్డు మార్గం ఏర్పాటు అయ్యేవరకూ శ్రీశైలానికి దక్షిణ ,తూర్పు వైపు నుంచి వెళ్ళే భక్తులు కర్నూల్ జిల్లా ఆత్మకూరు ప్రాంతం నుంచి అడవి మార్గంలో శ్రీశైలానికి వెళ్ళేవారు. మార్కాపురం వైపు నుంచి దోర్నాల మీదుగా కూడ భక్తులు వెళ్ళేవారు .

ఇంక కరివెన చరిత్రకు వస్తే, కాకతీయ ప్రతాపరుద్రుడు(1289-1323) శ్రీశైలం యాత్రకు వెళ్తు సామంతుడైన ముసలిమడుగు (ఆత్మకూరు-సంగమేశ్వరప్రాంతంలో వుంది) రాజు ఆతిధ్యం స్వీకరించటానికి ముసలిమడుగు వెళ్తాడు.ఆ సందర్భంలో అక్కడి బ్రాహ్మణులకు కరివనం (ఎనుగుల వుండే తోపు) చుట్టు 3000 ఎకరాల విస్తీర్ణంలో వున్న ప్రాంతాన్ని “సర్వాగ్రహారం”గా అంటే పూర్తి హక్కులతో రాజుకు ఎలాంటి శిస్తు,పన్నులు కట్టవలసిన అవసరంలేని విధంగా దానం చేశారు.

ఆవిధంగా కరివనం చరిత్ర మొదలైంది.కాలక్రమంలో కరివనం “కరివెన” అయ్యింది. కాకతీయ సామ్రాజ్యం, రెడ్డిరాజులు, విజయనగర సామ్రాజ్యం తరువాత కరివనం కర్నూల్ నవాబు పాలన కిందికి వచ్చింది. కర్నూల్ నవాబు కరివనం భూముల మీద శిస్తు వెయ్యగా కొందరు డిల్లీకి వెళ్ళి సుల్తాన్ నుంచి శిస్తు కట్టవలసిన అవసరంలేదని పర్మాన తెచ్చుకున్నారంట .దీనికి సంభందించి చారిత్రక ఆధారాలు ఈ కరివెన కథలు పుస్తకంలో రాయలేదు.

1957 ముందు వరకు అంటే రోడ్డు లేని రోజుల్లో భక్తులు శ్రీశైలానికి ఆత్మకూరు అటవి మార్గంలో వెళ్ళేవారు. మార్గ మధ్యంలో నట్టడివిలో వుండే “పెచ్చెరువు” దగ్గర రాత్రి విశ్రమించేవారు.

కరివెన అన్నదాన సత్రాల చరిత్ర

పెచ్చెరువు ప్రాంతం అడవి మధ్యలో వుండటం వలన భక్తులకు తినటానికి ఆహారం దొరకని పరిస్థితి.1940 ప్రాంతంలో కరివెన అగ్రహారానికి చెందిన “నిడిచినమెట్ల సుబ్రమణ్య సోమయాజులు” గారు భక్తులకు పెచ్చెరువు దగ్గర ఆహారం ఏర్పాటు చెయ్యాటానికి పూనుకొని గ్రామస్తులు మరియు స్థానిక చెంచుల సహాయంతో అటుకులు, పేలపిండి,మజ్జిగ సమకూర్చటం మొదలుపెట్టారు.

సోమయాజుల గారి తరువాత కొన్ని సంవత్సరాల విరామముతో వారి కుమారుడు సోమసుందరశాస్త్రి గారు 1957 వరకు ప్రజల సహకారంతో పెచ్చెరువు వద్ద అన్నదానం జరిపారు. పేలపిండి, అటుకులతో మొదలైన అన్నదానం క్రమంగా భోజనం పెట్టేవరకు ఎదిగింది. 1957లో కరివెన బ్రాహ్మణులు శ్రీశైలంలో సత్రం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకొని శ్రీశైలంలో పందిళ్ళ కింద అన్నదానం మొదలుపెట్టారు. 1961లో ప్రభుత్వం స్థలం ఇవ్వటంతో మహబూబ్ నగర్,మార్కాపురం వాళ్ళతో కలిసి కమిటీగా ఏర్పడి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో “కరివెన బ్రాహ్మణ” అన్నదాన సత్రాన్ని నిర్మించారు.

మొదట కేవలం శివరాత్రి రోజుల్లోనే అన్నదానం చేసేవారు. 1974 నుండి నిత్య అన్నదానం చెయ్యటం మొదలుపెట్టారు. అప్పుడే “అఖిలభారత కరివెన బ్రాహ్మణ నిత్య అన్నదాన సత్రం”గా మారింది. ఈ కరివెన బ్రాహ్మణులే కాశిలో కూడ అన్నదాన సత్రాని నిర్మింఛారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు అన్ని పుణ్యక్షేత్రాలలో కరివెన అన్నదాన సత్రాలు ఏర్పడ్డాయి.

ఇది కరివెన అన్నదాన సత్రాల చరిత్ర!

కరివెన ఉద్యమాల చరిత్ర

1953 జూన్ 5 న కర్నూల్ రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ప్రకాశం పంతులుగారు ముఖ్యమంత్రిగా, సంజీవ్ రెడ్డి ఉప ముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రభుత్వం ఏర్పడింది. నిత్యం ఎదో ఒక గొడవ,ఎవరో ఒక నాయకుడి అలకలతో ప్రకాశం గారు ప్రభుత్వాన్ని నెట్టుకొచ్చేవారు.

పైన చెప్పిన కరివేన అగ్రహార భూముల కౌలుదారులు హక్కుల కోసం సోషలిస్టులు ఉద్యమాలు చేశారు. ఈ ఉద్యమానికి తోడు మద్యనిషేధం విధి విదానాల మీద సొంఠి రామూర్తి కమిటీ చేసిన సిఫార్సులను అమలు పరచాలని గౌతు లచ్చన్న నాయకత్వంలో కృషికార్ లోక్ పార్టీ ఉద్యమించింది. తుదకు1954 నవంబర్ లో ప్రకాశం పంతులుగారి ప్రభుత్వం మీద విపక్షాలన్నీ ఏకమై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి…

అవిశ్వాస తీర్మానం గెలవటానికి ప్రకాశం పంతులు గారు చేసిన ప్రయత్నాలకు కాంగ్రెస్ సభ్యులే గండికొట్టారు. కాంగ్రెస్ తరుపున కర్నూల్ నుంచి గెలిచిన శంకర్ రెడ్డి , కైకలూరు నుంచి గెలిచిన అడుసుమల్లి సుబ్రమణ్యం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వెయ్యటంతో ప్రభుత్వం పడిపోయి ప్రకాశం పంతులు గారు పదవీచ్యుతులయ్యారు …

కరివెన రాజకీయ చరిత్ర ఇది..

ఇలాంటి కరివెన గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఆస్తి గొడవలో భాగంగా ప్రభుత్వ స్కూల్ కు వెళ్లే అవకాశం లేకుండా గోడ కట్టారు. ఈటీవీ వాళ్ళు ఈ సమస్యను రిపోర్ట్ చేయటం వలన అనేక మంది కదిలి స్థానిక అధికారులతో మాట్లాడటంతో రెండు రోజుల్లో స్కూల్ కు వెళ్లే దారికి అడ్డంగా ఉన్న గోడను పడగొట్టి విద్యార్థులు స్కూల్ కు వెళ్లే మార్గం కలిగించారు..

ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు స్థానికులు స్పందించి పరిష్కరించుకోవాలి.. స్థానిక సర్పంచ్ బాధ్యత తీసుకోవాలి .. మారిన ప్రపంచంతో పాటు మనం మారాలి .. వ్యక్తుల మధ్య సమస్య వ్యవస్థల పనితీరుకి అడ్డంకిగా మారకూడదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి