Dharani
Dharani
ఒకప్పుడు గుండెపోటు అంటే.. 50 ఏళ్లు దాటిని వారికి వచ్చే జబ్బుగా అనిపించేంది. అది కూడా అధిక బరువుతో బాధపడుతున్న వారికి, మద్యపానం, పొగతాగే అలవాటు ఉన్న వారికి వచ్చే జబ్బుగా జమ కట్టేవారు. పైగా గుండెపోటు రాగానే కన్ను మూసేవారు కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. కొన్ని చిన్ని చిన్న మార్పులు చేసుకుంటే గుండెపోటు బారిన పడే అవకాశం చాలా వరకు ఉండేది కాదు. కానీ గత కొంత కాలంగా సంభవిస్తోన్న గుండెపోటు మరణాలు చూస్తే.. భయం వేస్తోంది. వయసుతో సంబంధ లేకుండా నాలుగేళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్లు పైబడిన వృద్ధులు అనే తేడా లేకుండా గుండెపోటు బారిన పడుతున్నారు. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు ఉన్నట్లుండి కుప్ప కూలుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఇక తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని గుండెపోటుతో మృతి చెందింది. ఫ్రెషర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలింది. ఆ వివరాలు..
కరీనంగర్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది. గంగాధరలోని మోడల్ స్కూల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. కొత్త విద్యార్థులకు ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ పార్టీ.. ఆ యువతికి సెండాఫ్ పార్టీగా నిలుస్తుందని ఎవరూ ఊహించలేదు. తోటి విద్యార్థినులతో కలిసి ఫ్రెషర్స్ పార్టీలో డ్యాన్స్ చేస్తోన్న ప్రదీప్తి ఉన్నట్లుండి ఒక్కసారిగా కుప్పకూలింది. విషయం గమనించిన వెంటనే ఉపాధ్యాయులు స్పందించారు. అప్పటికే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోన్న ప్రదీప్తికి టీచర్లు సీపీఆర్ చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గ మధ్యలోనే ప్రదీప్తి మృతి చెందింది.
ప్రదీప్తి స్వస్థలం గంగాధర మండలంలోని వెంకటాయపల్లి గ్రామం. తండ్రి గుండు అంజయ్య. ఇక ప్రదీప్తి విషయానికి వస్తే.. తాను స్థానికంగా ఉన్న మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అప్పటి వరకు సంతోషంగా ఎంజాయ్ చేస్తోన్న విద్యార్థులు.. ప్రదీప్తి అలా కుప్ప కూలడంతో ఆందోళన చెందారు. ప్రదీప్తి మృతి చెందిందన్న విషయం తెలిసి తోటి విద్యార్థులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే.. ప్రదీప్తికి గుండెలో రంధ్రం ఉన్నట్లు తెలుస్తోంది.