iDreamPost

కన్నాకు అంత ధైర్యముందా ? ఏం చేస్తాడో చూద్దాం

కన్నాకు అంత ధైర్యముందా ? ఏం చేస్తాడో చూద్దాం

అయిన దానికి కాని దానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై నోరు పారేసుకుంటున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధైర్యానికి నిజమైన పరీక్ష ఎదురైంది. రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం ధక్షిణ కొరియా నుండి కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. మొత్తం లక్ష కిట్లను సుమారు రూ. 14 కోట్లతో పర్చేజ్ ఆర్డర్ పెట్టింది. ఒక్కో కిట్ ధర రూ. 730 రూపాయలుగా తేలగానే ముందు టిడిపి నేతలు తర్వాత బిజెపి అధ్యక్షుడు కన్నా అవినీతి ఆరోపణలు మొదలుపెట్టేశారు.

సరే మొదటి నుండి కన్నా వ్యవహారం అలాగే ఉంది. ముందు చంద్రబాబు కానీ టిడిపి నేతలు కానీ వైసిపి ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం వెంటనే కన్నా అందుకోవటం అందరూ చూస్తున్నదే. సరే ప్రస్తుత విషయానికి వస్తే ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం ఒక్కో కిట్ ను 337 రూపాయలకే కొనుగోలు చేసినపుడు ఏపి మాత్రం 730 రూపాయలు ఎందుకు చెల్లించిందన్నది వీళ్ళ ప్రధాన ఆరోపణ. సరే కాస్త వీళ్ళ ఆరోపణను పక్కనపెడదాం. ఏపిలో ఆర్డర్ చేసినట్లుగానే కేంద్రం కూడా 2 లక్షల కిట్లను ఆర్డర్ చేసింది. ఒక్కో కిట్ ధర రూ 795 పడింది. అదే విధంగా కర్నాటక ప్రభుత్వం కూడా ఇదే తరహా కిట్లను ఆర్డర్ చేసింది. ఇక్కడ కూడా ఒక్కో కిట్ ధర రూ. 795 పెట్టి కొంటున్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే కిట్ల కొనుగోలులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కన్నా మరి కేంద్రం, కర్నాటక ప్రభుత్వాలను నిలదీయగలడా ? కిట్ల కొనుగోలు అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసినట్లే కేంద్ర, కర్నాటక ప్రభుత్వాలను కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేయాలి కదా. నిజంగా కన్నా గనుక ఆ పని చేస్తే ధైర్యమున్న వాడని అందరూ అభినందిస్తారు మరి ఆ పని చేయగలడా ?

ఇపుడు ఇదే విషయమై వైసిపి నేతలు అడుగుతున్న ప్రశ్నలకు కన్నా ఏమని సమాధానం చెబుతాడు. చంద్రబాబుదేముంది ఎన్ని ఆరోపణలైనా చేస్తాడు, ఎన్ని మాటలైనా పడతాడు. ఎందుకంటే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి పోయేదేమీ లేదు కాబట్టి. కానీ కన్నా విషయం అలా కాదు. ఏపిలో ప్రభుత్వంపై గుడ్డిగా ఎవరికోసమనో ఆరోపణలు చేస్తే పై వాళ్ళకు సమాధానాలు చెప్పుకోవాలి. చూద్దాం కన్నా ధైర్యం ఏపాటిదో.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి