iDreamPost

రివెంజ్ ఫార్ములాతో కమల్ మేజిక్ – Nostalgia

రివెంజ్ ఫార్ములాతో కమల్ మేజిక్ – Nostalgia

మాస్ ని మెప్పించాలంటే కేవలం డాన్సులు ఫైట్లు ఉన్న కమర్షియల్ స్టోరీ ఉంటే సరిపోదు. వీటికి ఎంత ఆదరణ ఉన్నా పదే పదే చూపిస్తే వాళ్ళకే బోర్ కొట్టేసి తిరస్కరించడం మొదలుపెడతారు. ఇది ఎన్టీఆర్ నుంచి చిరంజీవి దాకా అందరికీ అనుభవమే. అయితే రివెంజ్ ఫార్ములాని సరైన రీతిలో డీల్ చేస్తే అద్భుతాలు చేయొచ్చని నిరూపించిన దర్శకులు ఉన్నారు. దానికో మంచి ఉదాహరణ చూద్దాం. 1985 సంవత్సరం. భారతీరాజా పేరు తమిళ పరిశ్రమలో మారుమ్రోగిపోతోంది. ఎర్రగులాబీలు లాంటి సైకో క్రైమ్ థ్రిల్లర్, సీతాకోకచిలుక లాంటి ప్యూర్ లవ్ స్టోరీ ఇలా కథావస్తువు ఏదీ తీసుకున్నా తనదైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్న సమయమది.

కమల్ తో మరోసారి జట్టుకట్టే ఉద్దేశంతో భారతీరాజా ‘టాప్ టక్కర్’ అనే సినిమా మొదలుపెట్టారు. కొంత భాగం తీశాక ఇది తిప్పితిప్పు మళ్ళీ ఎర్రగులాబీలు స్టైల్ లోనే వెళ్తోందని గుర్తించిన ఇద్దరు అప్పటిదాకా షూట్ చేసిన నెగటివ్ ని పక్కనపెట్టేశారు. ఆ సమయంలో కథకుడు నటుడు దర్శకుడు భాగ్యరాజ్ చెప్పిన కథ ఒకటి రాజా కమల్ లకు విపరీతంగా నచ్చేసింది. గెటప్ పరంగా ఎలాంటి సాహసానికైనా సిద్ధపడే లోకనాయకుడు తండ్రికొడుకులుగా డ్యూయల్ రోల్ చేసేందుకు ఎస్ చెప్పారు. ఇళయరాజా తప్ప సంగీత దర్శకుడిగా వేరే ఆప్షన్ పెట్టుకోదలుచుకోలేదు. రేవతి, రాధ హీరోయిన్లుగా ఎంపికయ్యారు.

ఓ రాజకీయ నాయకుడికి అనుచరుడిగా ఉన్న డేవిడ్(కమల్ హాసన్)అతని వల్లే భార్య(రాధ) శీలాన్ని ప్రాణాన్ని పోగొట్టుకుంటాడు. అది చాలక నేర తన మీదే మోపబడి ఇరవై రెండేళ్లు జైల్లో గడిపి బయటికి వస్తాడు. పసిబాలుడిగా ఉన్న కొడుకు(రెండో కమల్)ని స్నేహితుడు(జనక్ రాజ్)పెంచి పెద్దచేసి పోలీస్ ఆఫీసర్ ని చేస్తాడు. తనను ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళను చంపి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడిన డేవిడ్ ని స్వంత బిడ్డే పట్టుకునేందుకు కంకణం కట్టుకుంటాడు. తమిళ్ లో ‘ఓరు ఖైదీయన్ డైరీ’గా తమిళంలో 1985 జనవరి 14న విడుదలైన ఈ సినిమా తెలుగులో ‘ఖైదీ వేట’గా మే 31న రిలీజై ఘన విజయం అందుకుంది. హిందీలో భాగ్యరాజ్ మరుసటి ఏడాదే అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీస్తే అక్కడ కూడా సూపర్ హిట్ కొట్టింది. తిరిగి 1987లో కృషంరాజుతో కోదండరామిరెడ్డి దీన్నే అటుఇటు మార్చి ‘మారణహోమం’ పేరుతో రీమేక్ చేస్తే ఫలితం తేడా కొట్టేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి