iDreamPost

నాట్‌వెస్ట్‌ సిరీస్‌ హీరోస్ కైఫ్‌, యువరాజ్ సంభాషణ

నాట్‌వెస్ట్‌ సిరీస్‌ హీరోస్ కైఫ్‌, యువరాజ్ సంభాషణ

లాక్ డౌన్ వేళ సెలెబ్రెటీస్ సోషల్ మీడియా కేంద్రంగా గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. కీలక సంఘటనల వెనుక ఉన్న ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో మహమ్మద్ కైఫ్‌, యువరాజ్ సింగ్ 2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై సాధించిన చారిత్రక విజయం గురించి మహమ్మద్ కైఫ్‌, యువరాజ్ సింగ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌చాట్‌లో గుర్తు చేసుకున్నారు.

కైఫ్‌ మాట్లాడుతూ “నాటి ఫైనల్ మ్యాచ్‌లో నువ్వు ఔటవ్వగానే భారత్ ఓడిపోతుందని భావించా. అప్పటికే నేను నిలదొక్కుకున్నాను. నువ్వు క్రీజులో ఉన్నావు.దాంతో చివరివరకూ మనం క్రీజులో ఉంటే కచ్చితంగా గెలవచ్చు అనుకున్నా.కానీ నువ్వు ఔటయ్యేసరికి చాలా బాధపడ్డా.ఇంక గెలుపు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చా” అని నాటి అనుభూతులను ప్రస్తావించాడు.

కైఫ్‌ తన సంభాషణను కొనసాగిస్తూ అండర్‌-19 ప్రపంచకప్‌-2000 ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 25 బంతులలో 58 పరుగులు చేసి యువీ సాధించిన అర్థ సెంచరీ తనకెంతో ఇష్టమని చెప్పాడు.ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ కుర్ర బౌలర్ లైన మిచెల్‌ జాన్సన్‌,షేన్‌ వాట్సన్‌ బంతులను చితకబాదాడని కైఫ్‌ తెలిపాడు.

అనంతరం యువరాజ్‌ సింగ్‌ మాట్లాడుతూ అద్భుత ఫీల్డింగ్‌తో భారత్‌కు మహమ్మద్ కైఫ్‌ ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని లైవ్‌ చాట్‌లో యూవీ పొగడ్తలతో కైఫ్‌ని ఆకాశానికి ఎత్తేశాడు.ఇంకా తామిద్దరం కలిసి పాయింట్‌,కవర్‌ దిశలలో టీమిండియా ఫీల్డింగ్ గతిని సమూలంగా మార్చేశామని పేర్కొన్నాడు.నేటి భారత జట్టులో చాలా మంది మంచి ఫీల్డర్లు ఉన్నారని చెప్పాడు.అయితే భారత జట్టు ఫీల్డింగ్‌లో ఒక నూతన ఒరవడికి నాంది పలికింది మాత్రం తామేనని యూవీ వ్యాఖ్యానించాడు.

2002 నాట్‌వెస్ట్‌ సిరీస్‌ ఫైనల్‌:

ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో 326 పరుగుల లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలి మొదటి వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం ఇచ్చారు. మిడిల్ ఆర్డర్‌లో దినేష్ మెంగియా,సచిన్,ద్రావిడ్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో 145 పరుగుకే 5 వికెట్లు కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది.ఈ దశలో నాటి యువ బ్యాట్స్‌మెన్‌లు యూవీ, కైఫ్‌ అద్భుతంగా రాణించి విజయంపై ఆశలు రేకెత్తించారు.కానీ లక్ష్యానికి 59 పరుగుల దూరంలో టీమిండియా నిలిచిన స్థితిలో 63 బంతులలో 9 ఫోర్లు,ఒక సిక్స్‌తో 69 పరుగులు చేసిన యువీ ఔటయ్యాడు.

పట్టువదలని విక్రమార్కుడిలా టెయిలెండర్‌లతో కలిసి పోరాడిన కైఫ్‌ మరో 3 బంతులు మిగిలుండగానే 8 వికెట్ల నష్టానికి 326 పరుగుల లక్ష్యాన్ని చేరుకుని భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో నిలిచిన కైఫ్ 75 బంతులలో 6 ఫోర్లు,2 సిక్స్‌లతో అజేయంగా 87 పరుగులు చేసి నాట్ వెస్ట్ సిరీస్ భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. విజయానంతరం అప్పటి భారత కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ గ్యాలరీలో షర్ట్‌ విప్పి గిరగిరా తిప్పుతూ కేకలు వేయడం భారత క్రికెట్ అభిమానులకు ఈనాటికీ మధుర జ్ఞాపకంగా గుర్తుండిపోయింది.