iDreamPost

పాపం పండింది కాబట్టే కరోనా వొచ్చింది – జేసీ బాబా

పాపం పండింది కాబట్టే కరోనా వొచ్చింది – జేసీ బాబా

సీనియర్ నేతల్లో జేసి దివాకర్ రెడ్డి కూడా ఒకడు. ఉన్నదున్నట్లు మాట్లాడేస్తుంటాడనే ముసుగులో జేసి మాటలు చాలాసార్లు సంచలనాలుగాను కొన్నిసార్లు అధినేతలను ఇబ్బందుల్లో పడేసిన సందర్భాలున్నమాట వాస్తవం. తాజాగా జేసి చేసిన వ్యాఖ్యలు అలాగే ఉన్నాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే జేసి మీడియాతో మాట్లాడుతూ పాపం పండింది కాబట్టే కరోనా వైరస్ వచ్చిందన్నారు. పాపాలు బాగా పెరిగిపోయినపుడు జనాభా తగ్గించేందుకు ప్రకృతి / దేవుడు ఏదో ఓ రూపంలో అవతరించక తప్పదన్నాడు. మరి పాపాలు చేసిందెవరు ? వాళ్ళు చేసిన పాపాలేమిటి ? అన్న విషయాలను మాత్రం చెప్పలేదు లేండి. ప్రతి వందేళ్ళకు ఇలాంటివి జరగటం సహజమే అన్నారు. పాపాలు చేయటమంటే ఎదుటివాళ్ళని చంపటం, నరకటం లాంటివి కావని ప్రశాంతంగా జీవించలేని వాతావరణాన్ని సృష్టించటమే అని కూడా చెప్పాడు లేండి.

కరోనా అన్నది సమస్త మానవజాతికి ఓ హెచ్చరికగా జేసి వర్ణించాడు. వైరస్ నియంత్రణకు పోలీసులు, డాక్టర్లు చాలా కష్టపడుతున్నాడని కితాబు కూడా ఇచ్చాడు లేండి. ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా చాలా కష్టపడుతున్నా వైరస్ వ్యాప్తి తగ్గలేదని తెగ బాధపడిపోయాడు. వైరస్ వ్యాప్తికి కారణం మాత్రం జనాలే అని కూడా తేల్చేశాడు. యాక్టివ్ రాజకీయాల నుండి రిటైర్ అయినట్లు ప్రకటించినా తెలుగుదేశంపార్టీ నేతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాత్రం కరోనా వైరస్ తీవ్రతను చాలా తేలిగ్గా తీసుకున్నట్లు మండిపడ్డాడు.

ఇంత చెప్పిన జేసి వైరస్ గురించి తనకు ఎంత తెలుసు అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. వైరస్ ఎటాక్ కాకూడదంటే వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉండాలని జేసి భలే చెప్పారు. అందరికీ జేసిలకున్నట్లు వ్యవసాయ క్షేత్రాలుండద్దూ ? కొసమెరుపేమిటంటే తమ వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటలతోనే కోటి రూపాయలు సంపాదించినట్లు చెప్పటం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి