iDreamPost
android-app
ios-app

కుంద‌న్‌షాని గుర్తుకు తెచ్చిన జాతిర‌త్నాలు

కుంద‌న్‌షాని గుర్తుకు తెచ్చిన జాతిర‌త్నాలు

జాతిర‌త్నాలు డైరెక్ట‌ర్ అనుదీప్‌, జానే బీ దోయారో (1983) సినిమా డైరెక్ట‌ర్ కుంద‌న్‌షాను గుర్తుకు తెచ్చాడు. అప్ప‌టి వ‌ర‌కూ ఒక మూస‌లో న‌డుస్తున్న హిందీ సినిమాల కామెడీని ఆయ‌న బ‌ద్ద‌లు కొట్టాడు. ఒక చిన్న క్రైమ్ క‌థ‌ని , రాజ‌కీయాలు, అవినీతి, బ్యూరోక్ర‌సీల‌పై సెటైర్లు వేసి న‌వ్వించాడు. భార‌త‌దేశ సినిమాల్లో ఇదో క్లాసిక్ కామెడీ.

ఇద్ద‌రు ఫొటోగ్రాఫ‌ర్లు అనుకోకుండా తీసిన ఫొటోలో మ‌ర్డ‌ర్ సీన్ ఉంటుంది. ఆ త‌ర్వాత అంతా నాన్‌స్టాప్ కామెడీ. దీన్ని తెలుగులో కూడా తీశారు. పేరు గుర్తు లేదంటే ఎంత చెత్త‌గా తీశారో తెలుస్తోంది. ముగ్గురు కుర్రాళ్లు హైద‌రాబాద్ వ‌చ్చి, ఒక క్రైమ్‌లో ఇరుక్కోవ‌డ‌మే జాతిర‌త్నాలు క‌థ‌. కుంద‌న్‌షా స‌మానుడు కాదు కానీ, సెటైర్‌తో సినిమాని న‌డ‌ప‌గ‌లిగిన స‌మ‌ర్థుడు ఒక‌డొచ్చాడు. థ్యాంక్స్ అనుదీప్‌.

లాజిక్‌కి అంద‌క‌పోతేనే సెటైర్‌. రాజ‌కీయాలు, మీడియా మీద విసుర్లు కావాల్సిన‌న్ని ఉన్నాయి జాతిర‌త్నాల్లో. డైలాగ్‌లు కాజువ‌ల్‌గా ప‌డుతుంటాయి. దెబ్బ కొట్ట‌డానికి తెలిసేలోగా ఇంకో డైలాగ్ ప‌డుతుంది. అనుదీప్ టాలెంట్‌కి , న‌వీన్ పోలిశెట్టి దొరికాడు. loudness లేకుండా విశ్వ‌రూపం చూపించాడు. న‌వీన్ స్పీడ్‌కి ఇంకొక‌రైతే దెబ్బై పోయే వాళ్లే . రాహుల్ రామ‌కృష్ణ‌, ప్రియ‌ద‌ర్శి కాబ‌ట్టి విజృంభించేశారు. వాళ్లంత టైమింగ్ ఉన్న న‌టులో అవ‌కాశం వ‌స్తే ఎంత రెచ్చిపోతారో తెలుస్తుంది.

బ్ర‌హ్మానందాన్ని slapstick కామెడీలో చూసిచూసి జ‌నం విసిగిపోయి వాలెంట‌రీ రిటైర్మెంట్ ఇచ్చేశారు. దీంట్లో క‌నిపిస్తే మొద‌ట భ‌య‌మేసింది. ఎక్కువ మాట్లాడ‌కుండా, ఆయ‌న ఇచ్చిన expressions అదిరిపోయాయి. తెలుగు న‌టుడు కావ‌డం మ‌న అదృష్టం, ఆయ‌న దుర‌దృష్టం. వంద‌ల సినిమాల్లో చెంప దెబ్బ‌ల కామెడీతో అన్యాయంగా వాడేశారు.

కీర్తి సురేష్ ఉందంటే క‌థ‌లో ఒక భాగం. విజ‌య్ దేవ‌ర‌కొండ ఎందుకు క‌నిపించాడో తెలియ‌దు. నిర్మాత నాగ్ అశ్విన్ కావ‌డ‌మేనా?

అశ్విన్‌ద‌త్ చాలా హిట్స్ తీశాడు. తుక్కు సినిమాలు కూడా! ఆయ‌న కూతుళ్లు తీసిన మూడు సినిమాలు ర‌త్నాలే. కూతుళ్ల పేరు వ‌ల్ల తండ్రి పేరు గుర్తుకొస్తే ఆయ‌న‌కే గౌర‌వం.

క‌థ‌లో కొన్ని లోపాలు, లాగ్ ఉన్నాయి. శుభ‌లేఖ సుధాక‌ర్ అన‌వ‌స‌రంగా క‌థ‌కి అడ్డం. ఫైన‌ల్‌గా న‌వ్వుకుంటూ బ‌య‌టికొస్తాం. అది చాలు.

జాక్స‌న్ విల్లీ (యూఎస్‌)లో ఒక తెలుగు సినిమా సాయంత్రం 4.30 నుంచి రాత్రి 8.30 వ‌ర‌కూ గంట‌కో షో నాలుగు స్క్రీన్స్ న‌డ‌వ‌డ‌మంటే గొప్ప విష‌యం. టికెట్స్ soldout అని చూస్తుంటే ఆనందంగా ఉంది. క‌రోనా పోయి మంచి రోజులు వ‌చ్చిన‌ట్టే ఉన్నాయి.

డైరెక్ట‌ర్ అనుదీప్ మూడో సినిమాని త‌న‌ను తాను రిపీట్ చేసుకోకుండా , త‌న శ‌క్తిని మ‌రిచి ఇంకేదో action సినిమాలు తీయ‌కుండా న‌వ్వించే సినిమాలే తీస్తే లైఫ్ జింద‌గీ బాగుంటాయి. లేదంటే hell and heaven.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి