iDreamPost

జనసేన పరిస్థితి ఏంటి.? నెక్స్ట్ ఎవరు.?

జనసేన పరిస్థితి ఏంటి.? నెక్స్ట్ ఎవరు.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఎంతదూరం ప్రయాణిస్తారు, అసలు రాజకీయాలలో పవన్ స్థిరంగా ఉంటారా.? ఒకే విషయంపై రోజుకో మాట మాట్లాడే పవన్ తీరు ఆపార్టీ క్యాడర్ కే అర్దం కావట్లేదు. తన పార్టీ పంథా ఏంటో ఆ పార్టీ కార్యకర్తలకే అర్ధం కానంతగా ఉంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ బలహీన పడుతున్న సమయంలో వైసీపీకి దీటుగా ఎదిగేందుకు ఎన్నో అవకాశాలున్న జనసేన పార్టీ అధినేత తీరుతో రోజురోజుకూ దిగజారిపోతోంది. సినిమా హీరోగా తనకున్న క్రేజ్ ద్వారా రాజకీయాల్లో తిరుగుండదని రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి అభిమానాన్ని ఓట్లరూపంలోకి మలచుకుని అధికారంలోకి రావడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యాడు. 2019 లో ఎన్నికల్లో జనసేన నుండి అభ్యర్థులను బరిలోకి దింపి ఎక్కడ మీటింగ్ పెట్టిన జనాలు వస్తుంటే సినిమా హిట్టైన విధంగా రాజకీయాలలో కూడా హిట్టవుతానని భావించాడు. కనీసం ఓ ముప్పైసీట్లు వస్తాయని అంచనా వేసుకున్నారు. (ఓటమి అనంతరం నాదెండ్ల చెప్పారు) కానీ ఫలితాలు వచ్చేటప్పటికి పవన్ సత్యం బోధపడింది.

సినిమా క్రేజ్ రాజకీయాల్లో పనిచేయదని అర్ధమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పోటీ చేసిన రెండు చోట్ల ఓటమిపాలై పరువు పోగొట్టుకున్నాడు జనసేనిన. కేవలం ఒకే ఒక అసెంబ్లీ స్థానాన్ని జనసేన గెలుచుకుంది. అలాగే రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా తెలుగుదేశం పార్టీ అతి తక్కువ స్థానాలు గెలుచుకుంది. ఆపార్టీపై తీవ్ర వ్యతిరేకత ప్రజాతీర్పులో కనిపించింది. ఈక్రమంలో భవిష్యత్ లో ఏపీలె రాజకీయంగా పెద్దపార్టీ గా ఎదుగుతుందని ఆశపడ్డ సగటు జనసేన కార్యకర్తకు పవన్ వైఖరితో నిరాశే ఎదురవుతూ వచ్చింది. అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబుని తన భుజాలపై మోయడం, అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నాడు.. కొన్నిరోజులు బిజేపిని ఆడిపోసుకుంటాడు.. మళ్లీ బిజేపీ ని పొగుడుతాడు, నేను బీజేపికి దూరం కాలేదంటాడు.. బీజేపీ తనను భయపెట్టలేదంటాడు.. ఇలా ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియక జనసేనాని జనాలకు దూరమవుతున్నాడు. ముఖ్యంగా అందివచ్చిన అవకాశాలతో వ్యూహాలు రచించి రాజకీయంగా ఎదగాల్సిన సమయంలో రాజకీయ పరిణితి లేకుండా మాట్లాడి నవ్వుల పాలవుతున్నాడు.

అలాగే జనసేన పార్టీ లో కూడా పెద్దగా ప్రభావం చూపే రాజకీయ నాయకులు కరువయ్యారు. నాదెండ్ల మనోహర్ ఒక్కడే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కనిపిస్తుంటాడు అంతే కాని మిగతా నాయకులు ఎవ్వరూ ఎక్కువగా కనపడరు. ఉన్న కొంతమంది కూడా ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారు. జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మేల్యే రాపాక కూడా పార్టీ అధినేత తీరు పై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చేటప్పుడు ఒక వ్యక్తి గురించి చెప్పాడు అతనే రాజు రవితేజ. జనసేన పార్టీ స్థాపించడంలో తన ప్రమేయం ఉందని, తను జనసేనతో కలసి నడుస్తాడని పవన్ ప్రకటించాడు. ఇద్దరు కలసి ఇజం అనే పుస్తకాన్ని రచించారు. ఇటీవల పవన్ అనుసరిస్తున్న విధానాల పట్ల అసంతృప్తిగా ఉన్న రవితేజ సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీకి రాజీనామా చేసారు. పవన్ రాజకీయాలలో ప్రమాదకర శక్తిగా తయారవుతున్నారని, కుల,మత ప్రాతిపదికన రాజకీయాలకు పాల్పడుతున్నాడంటూ ఆరోపిస్తు రవితేజ జనసేనకు దూరమయ్యారు. పవన్ సమాజానికి ప్రమాదకరం అంటూ రవితేజ చేసిన తీవ్ర ఆరోపణలు రాజకీయంగా దుమారాన్ని లేపాయి.

ఇప్పడు రాజురవితేజ చేసిన వాఖ్యల పట్ల రాజకీయాలలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. తనకు అత్యంత సన్నిహితుడే ఇంత దారుణమైన మాటలు మాట్లాడటంతో అసలు జనసేన లో ఏం జరుగుతోంది అంటు ఊహాగానాలు మొదలయ్యాయి.పార్టీ బలపడాల్సిన సమయంలో ఇలా ఒక్కొక్కరు దూరమవడం, అసలు పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు ఒక్కరు లేకపోవడం,ఇప్పటికి పవన్ ఇమేజ్ తోనే పార్టీని లాగుతుండటం భవిష్యత్ లో పార్టీ భవితవ్యం ఏంటని సగటు కార్యకర్త ఆలోచిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఇలాగే ఆలోచన లేకుండా ఒంటెద్దు పోకడలు పోతే జనసేన జనానికి పూర్తిగా దూరమయ్యే అవకాశం ఉందని అర్ధమవుతోంది. రాయలసీమ పర్యటనలో పవన్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా గళమెత్తితే.. ఆయన పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంకు మద్దతుగా మాట్లాడారు. తర్వాత కాకినాడలో పవన్ రైతు సమస్యలపై ఒక్కరోజు నిరాహార దీక్ష చేస్తే మర్నాడే పవన్ సన్నిహితుడు రవితేజ పార్టీని వీడారు. ఇప్పుడు తర్వాత ఎవరు అనే ప్రశ్న వినిపిస్తోంది. పవన్ తర్వాత పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీస్పీకర్ నాదెండ్ల పార్టీకి దూరమయ్యేలా వున్నారని పార్టీ వర్గాల్లో టాక్.. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ ఇప్పటికే పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండగా అతి త్వరలో ఆయన కూడా పార్టీని వీడతారనే ప్రచారం జరుగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి