iDreamPost

ఈ మౌనం విలువెంత..!

ఈ మౌనం విలువెంత..!

ఎన్నికల్లో గెలవడం.. అధికారం చేపట్టడం జనసేన లక్ష్యం కాదు. రాజకీయాల్లో జవాబుదారీతనం పెంచడం, అందుకోసం ప్రశ్నించే గొంతుకులకు ఆసరగా నిలబడడమే తమ ధ్యేయం.. అంటూ జనసేన ఏర్పాటు సందర్భంగా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఈయన సంధించిన ప్రశ్నలు ప్రజల్లో అనేకానేక సందేహాలను రెకెత్తించాయి. తిరిగి ప్రజలే ఈయన్ను ప్రశ్నించే రీతిగా వ్యవహారశైలి ఉందంటూ సొంత పార్టీ నేతల నుంచే పెదవిదాటని విమర్శలు కూడా బైటపడ్డాయి.

అయితే అనుభవ రాహిత్యం, కొత్త పార్టీ, రాన్రాను రాటుదేలతారు.. అంటూ కొన్ని శాంతవచనాలు విన్పించినప్పటికీ.. రోజులు గడుస్తున్నప్పటికీ ప్రశ్నల్లో వాడీ పెరగడంలేదు. ఆయన అభిమానులు ఆశించిన స్పీడు కన్పించడం లేదు. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటేనే అంతంత మాత్రంగా ప్రశ్నలు సంధించారు.. సినిమాలు చేస్తూ రాజకీయాలు నడపడమంటే ఇంక మన ప్రశ్నలు జనాన్ని చేరేదెప్పుడో అన్న నిట్టూర్పులు కూడా విన్పించాయి. అయితే ఎవరెన్ని చెప్పినా తన ధోరణి తనదేనన్న రీతిలో సెల్ఫ్‌ జస్టిఫికేషన్‌ చేసుకున్న పవన్‌ సినిమా పనుల్లో బిజీ అయ్యారు. ఇంత వరకు బాగానే ఉంది.

కరోనా లాక్డౌన్‌ కారణంగా సినిమా షూటింగ్‌లు లేవు. అన్ని భాషల సినిమా పరిశ్రమల జనం ఎవరింట్లో వాళ్ళు కూర్చుని, ఇష్టమొచ్చిన పనులు చేసుకుంటున్నారు. ఇంకా జనం దృష్టిలో పడేందుకు వీడియోలు కూడా చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఈ ఖాళీ సమయంలో కూడా రాష్ట్రంలో పరిస్థితులు, రాజకీయ సంబంధిత వ్యవహారాలు, జనం కోసం ప్రశ్నించడాలు గట్రా ఏమీ లేకుండా పవన్‌ సైలెంట్‌గా వ్యవహరించడం సొంత పార్టీ నేతల్లోనే గుబులు రేకెత్తిస్తోందన్న విమర్శలు జోరుగా విన్పిస్తున్నాయి.

కనీసం పక్క రాష్ట్రంలో కూర్చుని ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు జూమ్‌ మీటింగ్‌లైనా చేస్తూ నేనున్నానంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌ మాత్రం కనీసం అటువంటి బలమైన ప్రయత్నాలను కూడా కొనసాగించకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక ‘శంక’లు రేపుతోంది. పవన్‌ మీద ఈగ కూడా వాలనీయకుండా సోషల్‌మీడియాలో అండగా ఉంటే అభిమాన సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సైన్యం కూడా ఇటువంటి విమర్శలపై సమాధానలు చెప్పాలంటే నీళ్ళు నమలాల్సిన పరిస్థితులున్నాయడంలో ఎటువంటి అనుమానం లేదు. అడపాదడపా ప్రెస్‌ నోట్‌లు రిలీజ్‌ చేయడం మినహా చెప్పుకోదగ్గ పార్టీ కార్యకలాపాలు నిర్వహంచకపోవడం పట్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

కొత్త ప్రభుత్వం కొలువుదీరాక అడపాదడపా ఒకట్రెండు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ వాటి ద్వారా జనసేనకు జనంలో వచ్చిన మైలేజీపై సందేహాలు ఇప్పటిక్కూడా తీరలేదు. చివరగా చెప్పొచ్చేదేంటంటే జనం గొంతునవుతానంటూ తెరపైకొచ్చిన జనసేన తన బాటమ్‌లైన్‌ఆఫ్‌థీమ్‌ని మర్చిపోయిందేమోన్న అనుమానం జనంలో బలంగానే ఉంది. అధికార పక్షాన్ని ప్రశ్నించడం తరువాత.. సొంతపార్టీపైనే ఎదురవుతున్న అనేకానేక ప్రశ్నలకైనా పవన్‌సమాధానమిచ్చే విధంగా వ్యవహరిస్తారో? లేక ఎప్పటి మాదిరిగానే గమ్మునుంటారో కాలమే తేల్చాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి