iDreamPost

దీప్తి మృతి కేసులో షాకింగ్ విషయాలు వెల్లడించిన SP!

దీప్తి మృతి కేసులో షాకింగ్ విషయాలు వెల్లడించిన SP!

జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన టెక్కీ దీప్తి మృతికేసులో జిల్లా ఎస్పీ భాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి అసలు విషయాలను వెల్లడించారు. పోలీసులు వెల్లడించిన విషయాలను చూసి అంతా విస్తుపోతున్నారు. డబ్బు కోసం చెల్లి ఇంతకు తెగించిందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమె తన అక్కను ఎలా చంపింది? అసలు వాళ్ల మధ్య ఆ రోజు ఏం జరిగింది? అనే మొత్తం విషయాలను ఎస్పీ భాస్కర్ వెల్లడించారు. దీప్తి చెల్లెలి ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణంగా పోలీసులు వెల్లడించారు.

ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ.. “దీప్తీ తండ్రి బంకా శ్రీనివాసరెడ్డి తమ కుమార్తెలకు సంబధింజి ఫిర్యాదు చేశారు. ఆగస్టు 28 రాత్రి 10 గంటల తర్వాత పెద్ద కూతురు బంకా దీప్తి, చందనాతో మాట్లాడినట్లు చెప్పారు. ఉదయం కాల్ చేస్తే దీప్తీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చందనా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అనుమానంతో తల్లిదండ్రులు పక్కింటి వారికి ఫోన్ చేశారు. వాళ్లు వెళ్లి చూడగా.. దీప్తీ చనిపోయి ఉంది. చిన్న కుమార్తె చందనా ఇంట్లో కనిపించలేదు. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం 5 టీమ్స్ ఏర్పాటు చేశాం. క్లూస్ టీమ్స్ , టెక్నికల్ టీమ్స్ తో సమన్వయం చేసుకుంటూ దర్యాప్తు చేశారు.

ఆర్మూరు- బాల్కొండ రూటులో కారులో వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు వెళ్లారు. ఓ దాబా దగ్గర ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నరు. చందనా- ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ ను విచారించిన తర్వాత అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చందనా– ఉమర్ మధ్య ఏర్పడిన ప్రేమే ఈ హత్యకు కారణం. చందనా 2019లో హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ జాయిన్ అయింది. రెండేళ్లు బీటెక్ చేసిన తర్వాత డిటైన్ అయింది. హైదరాబాద్ కు చెందిన ఉమర్ షేక్ సుల్తాన్ చందనాకి సీనియర్ గా ఉండేవాడు. ఒక సంవత్సరం డిటైన్ అయి తర్వాత చందనా క్లాస్ మేట్ అయ్యాడు. వారి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వాళ్లు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. ఆగస్టు 19న కోరుట్లలో ఉమర్ తో మాట్లాడింది. తనని పెళ్లి చేసుకోవాలి అని అడిగింది. అదే విషయాన్ని ఉమర్ తల్లి, చెల్లి, స్నేహితుడితో మాట్లాడింది. కానీ, అందుకు ఉమర్ అంగీకరించలేదు. ఇద్దరూ లైఫ్ లో సెటిల్ కాకుండా పెళ్లి ఎలా చేసుకుంటాం అంటూ చెప్పుకొచ్చాడు. తర్వాత చందన అతనితో పెళ్లి కోసం ప్లాన్ చేసింది.

ఆమె ప్లాన్ లో భాగంగానే 28న ఉమర్ కి కాల్ చేసి.. అమ్మానాన్న హైదరాబాద్ ఫంక్షన్ కి వెళ్తున్నారు. నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్లు. నా దగ్గర డబ్బు, బంగారం ఉంది. దాంతో మనం సెటిల్ కావచ్చు అని చెప్పింది. 28న ఉదయం 11 గంటలకే ఉమర్ కారు తీసుకుని కోరుట్ల వచ్చాడు. ఆ రోజు రాత్రి చందనా వోడ్కా, బీజర్ బాటిల్ తెప్పించింది. తల్లిదండ్రులతో ఫోన్ మాట్లాడిన తర్వాత వోడ్కా, బీజర్ తాగి అక్కాచెల్లెళ్లు పడుకున్నారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఉమర్ కి చందనా మెసేజ్ చేసింది. అతను ఇంటి వెనుక వైపు ఉమర్ కారు తీసుకుని వచ్చాడు. చందనా డబ్బు, నగలు తీసుకుంటున్న సమయంలో దీప్తి లేచింది. ఆ సమయంలో చందనా తన స్కార్ఫ్ తో దీప్తి ముక్కు, మూతిని కట్టింది. తర్వాత కూడా ఆమె అరుస్తోందని ఆమె చేతులను కట్టేశారు.

దీప్తీ ఇంకా అరుస్తూ ఉండటంతో.. ఇంట్లో ఉన్న ప్లాస్టర్ తీసి చందనా- ఉమర్ కలిసి దీప్తి మూతికి, ముక్కుకు వేశారు. అలా 10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం ఆగిపోయింది. తర్వాత రూ.1.20 నగదు, 70 తులాల బంగారం తీసుకున్నారు. ఆమె మూతికి ఉన్న ప్లాస్టర్, స్కార్ఫ్ తీసేసి సహజ మరణం అన్నట్లు క్రియేట్ చేశారు. వాళ్లు తర్వాత హైదరాబాద్ లో ఉమర్ షేక్ సుల్తాన్ ఇంటికి వెళ్లారు. ఈ నగదు, గోల్డ్ తీసుకుని ఉమర్ తల్లి, చెల్లి, బంధువుతో కలిసి ఎక్కడికైనా వెళ్లిపోవాలి అని ప్లాన్ చేసుకున్నారు. బాంబే గానీ, నాగ్ పూర్ గానీ వెళ్లాలి అని స్టార్ట్ అయ్యారు. సాంకేతికత సాయంతో వారిని ట్రేస్ చేయగలిగాం. ఈ కేసులో ఏ1గా చందన, ఏ2గా ఉమర్ షేక్ సుల్తాన్, ఏ3గా ఉమర్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్, చెల్లి అసియా ఫాతిమా, ఫ్రెండ్ హఫీజ్ ఉన్నారు. నిందితుల నుంచి రెండు పెద్ద వడ్డాణాలు, పెద్ద హారాలు, 3 జతల పెద్ద బంగారు గాజులు, బంగారు కంకణం, చిన్న హారాలు, సెల్ ఫోన్, పారిపోవడానికి వాడిన కారు, లక్ష నగదు స్వాధీనం చేసుకున్నాం. ఈ కేసును ఛేదించిన కోరుట్ల పోలీసులు, ఈ దర్యాప్తులో పాల్గొన్న అందరినీ అభినందిస్తున్నాం” అంటూ జిల్లా ఎస్పీ భాస్కర్ వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి