iDreamPost

జగన్ చేయవలసిన అసలు పోరాటం ఇప్పుడే మొదలు…

జగన్ చేయవలసిన అసలు పోరాటం ఇప్పుడే మొదలు…

ఆరంభింపరు నీచమానవులు అని ఏనుగు లక్ష్మణ కవి రచించిన పద్యం ఒకటి ఉంది. ఏదైనా పని చేయాలనుకున్న తర్వాత అందులో ఎదురయ్యే కష్టాలను తలచుకొని, అసలు మొదలే పెట్టకుండా వదిలేసే వాళ్ళు కొందరైతే, మొదలుపెట్టి, దారిలో ఎదురయ్యే ఇబ్బందులకు భయపడి మధ్యలో వదిలేసే వారు మరికొందరు. ధృఢచిత్తం కలిగిన ధీరులు ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా మొదలుపెట్టిన పనిని చివరివరకూ నడిపించగలరు అని ఆ పద్యం యొక్క భావం. మన దేశ రాజకీయాల్లో ఇటీవల కాలంలో ఈ మూడో రకం వ్యక్తులకు ఉదాహరణగా నిలిచింది ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నాయకుడిగా ఉన్న తండ్రి మరణం తరువాత అధిష్టానం విధించిన ఆంక్షలు భరించలేక బయటకు వచ్చి స్వంత పార్టీ పెట్టగానే రకరకాల కేసులు పెట్టి, అభియోగాలు రుజువు కాకుండానే విచారణ పేరిట జైలులో పెట్టించారు. ప్రతి నిందితుడికీ సహజ హక్కుగా రావలసిన బెయిల్ రాకుండా అడ్డుకుని పదహారు మాసాలు జైలులో ఉండేలా చేశారు. అయినా వెరవకుండా పార్టీని నడిపించారు జగన్.

ప్రతి ఉప ఎన్నికలో ప్రత్యర్థికి డిపాజిట్లు దక్కకుండా ఘనవిజయం సాధించినా, సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్యర్ధులందరూ ఒకటై స్వల్ప ఓట్ల శాతం తేడాతో అధికారం దక్కకుండా చేసినా పార్టీ ఎత్తేయడమో, అమ్మేయడమే చేయకుండా ధైర్యంగా ముందుకు సాగారు.

నీటిలోని మొసలితో, అధికారంలో ఉన్న చంద్రబాబుతో పోరాటం అసాధ్యం అని రాజకీయ విశ్లేషకులు అందరూ చెప్తారు. అలాంటి చంద్రబాబు సామ దాన దండోపాయాలతో తన పార్టీ గుర్తు మీద గెలిచిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులను ఫిరాయింపజేసినా, అసెంబ్లీలో అడుగడుగునా అడ్డుపడి తమ గొంతు వినపడనీయక పోయినా ఏమాత్రం వెరవక తండ్రి బాటలో పాదయాత్ర మొదలుపెట్టారు. సుదీర్ఘమైన పాదయాత్రలో సామాన్య ప్రజలతో మమేకమై వారి ఆకాంక్షలకు తగ్గట్టుగా మానిఫెస్టో రూపొందించి, అందరూ నిర్ఘాంతపోయే స్థాయిలో ఘనవిజయం సాధించి, అధికారంలోకి వచ్చారు.

వచ్చిన వెంటనే ఏమాత్రం విరామం తీసుకోకుండా, కష్టాల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడకుండా చేసిన వాగ్దానాలు నెరవేర్చేపనిలో పడ్డారు. నాలుగున్నర సంవత్సరాలు తాత్సారం చేసి, వాగ్ధానాల అమలు పేరుతో చివరిలో నాలుగు మెతుకులు విదిల్చే విధానం కాకుండా మొదటినుంచే మానిఫెస్టో అమలు అన్న మార్గం ఎంచుకున్నారు.

అసలు పోరాటం ఇప్పుడే
అధికారంలోకి రావడానికి ఇంతకాలం చేసిన పోరాటం కన్నా ఇప్పుడు జగన్ చేయవలసిన పోరాటం కష్టతరమైనది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదు. చేసిన ఏ ఒక్క వాగ్ధానం కూడా అమలు చేయకుండా వదిలే ఆలోచనలో జగన్ లేరు. ప్రత్యర్థి చంద్రబాబు ఏ చిన్న అవకాశం వచ్చినా వదిలిపెట్టే వాడు కాదు. గత ఎన్నికలకు ముందు బీజేపీ పార్టీని, ఆ పార్టీ నాయకులనూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఎన్నికల్లో బోల్తా పడ్డాక, తప్పు తెలుసుకుని మళ్ళీ ఆ పార్టీకి చేరువయ్యే ప్రయత్నాలు మొదలుపెట్టారు.

జగన్ ముందున్న మరో సవాలు రాజధాని. అయిదేళ్ళలో వర్షం పడితే జలమయమయ్యే భవనాలు, గ్రాఫిక్స్ బొమ్మలు తప్ప మరేమీ నిర్మించకపోవడం గత ఎన్నికల్లో చంద్రబాబు పరాజయానికి ఒక కారణం. ఇప్పుడు అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని మూడు చోట్ల రాజధాని అని జగన్ ఆలోచిస్తున్నారు. ఈ భావనకు ప్రజల ఆమోదం పొందడం, వాటి నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవడం జగన్ ముందున్న అతి పెద్ద కార్యాలు.

నెలకు అయిదు వేల రూపాయలు జీతం వచ్చే వాలంటీర్ల ఉద్యోగమే కాకుండా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలను రాష్ట్రానికి తీసుకురావడం కూడా జగన్ దృష్టి పెట్టవలసిన మరో అంశం. పెట్టుబడుల సదస్సుల పేరిట లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకోవడం, ఆ తర్వాత వాటిని చింపి పడేయడం లాంటి డ్రామాలు కాకుండా నిజమైన వ్యాపార సంస్థలు, నిజమైన ఉద్యోగాలు రాష్ట్రానికి వచ్చేలా చేసినప్పుడే ప్రజల్లో జగన్ నమ్మకం పెంచగలుగుతారు.

అయితే జగన్ పనితీరు, పట్టుదల దగ్గర నుంచి గమనించిన వారు ఇవన్నీ సాధించే సత్తా వారిలో ఉందని నమ్ముతారు.
(డిసెంబర్ 21న జగన్ జన్మదినం సందర్భంగా)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి