iDreamPost

టెస్టుల్లో తొలి హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌.. పంత్‌కు థ్యాంక్స్ చెబుతూ..!

  • Author singhj Published - 09:59 AM, Mon - 24 July 23
  • Author singhj Published - 09:59 AM, Mon - 24 July 23
టెస్టుల్లో తొలి హాఫ్‌ సెంచరీ చేసిన ఇషాన్‌ కిషన్‌.. పంత్‌కు థ్యాంక్స్ చెబుతూ..!

వెస్టిండీస్​తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఆతిథ్య జట్టును 255 రన్స్​కు ఆలౌట్ చేసి 183 రన్స్ లీడ్​ను సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్​లో ధనాధన్ ఆటతో 181/2 దగ్గర డిక్లేర్ చేసి విండీస్​కు 365 రన్స్ టార్గెట్​ను నిర్దేశించింది. భారీ రన్ ఛేజింగ్​లో కరీబియన్ టీమ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 76 రన్స్ చేసింది. వెస్టిండీస్ విజయానికి ఇంకా 289 రన్స్ అవసరం. యంగ్ బ్యాటర్ త్యాగ్​నారాయణ్​ చందర్​పాల్ (16 నాటౌట్)తో పాటు బ్లాక్​వుడ్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నారు. నిలకడగా ఆడుతూ వచ్చిన క్రెయిగ్ బ్రాత్​వైట్ (28), కిర్క్ మెకంజీ (0)ను రవిచంద్రన్ అశ్విన్ వరుస ఓవర్లలో ఔట్ చేశాడు. మూడో రోజు టీమిండియా బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్న వెస్టిండీస్ బ్యాటర్లు.. నాలుగో రోజు ఫస్ట్ సెషన్​లోనే తేలిపోయారు.

ఓవర్​నైట్ స్కోరు 229/5తో బ్యాటింగ్​ను కొనసాగించిన విండీస్.. 7.4 ఓవర్లలో 26 రన్స్ చేసి ఆఖరి ఐదు వికెట్లు కోల్పోయింది. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (5/60) ప్రత్యర్థిని చావుదెబ్బ తీశాడు. ఆతిథ్య జట్టు ఆఖరి నాలుగు వికెట్లు అతడి ఖాతాలోనే చేరాయి. గేమ్ మొదలు కాగానే విండీస్ ఆరో వికెట్​ను కోల్పోయింది. ముకేశ్ కుమార్ బౌలింగ్​లో అథనేజ్ (37) వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత జేసన్ హోల్డర్ (15)తో పాటు జోసెఫ్​ను వెనక్కి పంపాడు సిరాజ్. అలాగే కీమర్​రోచ్, గాబ్రియెల్​ను ఒకే ఓవర్లో ఔట్ చేసి భారత శిబిరంలో జోష్ నింపాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారీ ఆధిక్యం సాధించిన టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో రెండో ఇన్నింగ్స్​ను ధాటిగా మొదలుపెట్టింది. రోహిత్ శర్మ (44 బంతుల్లో 57) టీ20 తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్​తో అలరించాడు.

తొలి టెస్టుతో పాటు రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్​లోనూ ఫెయిలై విమర్శలు ఎదుర్కొంటున్న ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్​లో సత్తా చాటాడు. బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడి 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఇది అతడికి టెస్టుల్లో తొలి అర్ధ సెంచరీ కావడం విశేషం. ఈ ఇన్నింగ్స్​ క్రెడిట్​ను రిషబ్ పంత్​కు ఇస్తానన్నాడు ఇషాన్. ఎన్​సీఏలో తాను ప్రాక్టీస్ చేసినప్పుడు అక్కడే ఉన్న పంత్ తనకు విలువైన సూచనలు చేశాడన్నాడు. బ్యాట్ పట్టుకునే పొజిషన్​ మార్చుకోవడంలో పంత్ సాయపడ్డాడని అతడికి థ్యాంక్స్ చెప్పాల్సిందేనన్నాడు ఇషాన్. ఇక, ఈ మ్యాచ్​లో ‘ఆర్పీ 17’ అని రాసి ఉన్న బ్యాట్​తో గ్రౌండ్​లోకి దిగిన ఇషాన్.. పంత్​ స్టైల్​లో సింగిల్ హ్యాండ్​తో సిక్స్ కొట్టడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి