iDreamPost

తెలంగాణలో లాక్‌డౌన్‌..?

తెలంగాణలో లాక్‌డౌన్‌..?

గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో నమోదవుతున్న కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. లాక్‌డౌన్‌ విధించబోమని పాలకులు చెబుతున్నా.. పరిస్థితులు మాత్రం ఆ దిశగానే సాగుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో రోజుకు 8 వేలకు పైబడి కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రం లాక్‌డౌన్‌ దిశగా సాగుతున్న నేపథ్యంలో.. తెలంగాణలో కూడా లాక్‌డౌన్‌ పెడతారన్న ఊహాగానాలు సాగుతున్నాయి.

ఈ రోజు హోం మంత్రి మహమూద్‌ ఆలీ కోవిడ్‌ కేసులపై పోలీసు ఉన్నతాధికారులపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న నైట్‌ కర్ఫ్యూ, ఇతర ఆంక్షల అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. లాక్‌డౌన్‌ పెట్టడడం కేసీఆర్‌కు ఇష్టం లేదంటూ ప్రకటన చేసిన హోం మంత్రి.. త్వరలో కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కేసీఆర్‌ కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఈ రోజు చేసిన పరీక్షలో ఆయనకు నెగిటివ్‌ వచ్చిందని ప్రభుత్వం ప్రకటించింది.

కేసులు నమోదు, ఇతర రాష్ట్రాలలో లాక్‌డౌన్‌లు, పాలకులు చేస్తున్న ప్రకటనలతో హైదరాబాద్‌లో అలజడి రేగుతోంది. లాక్‌డౌన్‌ తప్పదనే భావనలో నగరవాసులున్నాయి. లాక్‌డౌన్‌ పెడతారనే అంచనాలతో నగరానికి ఉపాది, ఉద్యోగాల కోసం వచ్చిన కార్మికులు, వలస కూలీలు, చిరు ఉద్యోగులు స్వస్థలాల బాట పడుతున్నారు. రెండు రోజులుగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కిక్కిరిసిపోతోంది. రిజర్వేషన్‌ కోసం రెండు రోజులుగా ప్రయాణికులు కౌంటర్ల వద్ద వేచిచూస్తున్నారంటే.. రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. లాక్‌డౌన్‌ విధిస్తారనే అనుమానాలే ఈ రద్దీకి కారణంగా నిలుస్తోంది.

మహారాష్ట్రలో కర్ఫ్యూ విధించిన సమయంలో నగరంలో ఉన్న వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ, కర్ణాటకల్లో లాక్‌డౌన్‌ పెట్టినప్పుడు ముందుగా మేల్కొన్న వలస కార్మికులు ఢిల్లీ, బెంగుళూరు నగరాల నుంచి స్వస్థలాలకు బయలుదేరి వెళ్లారు. మరికొంత మంది అక్కడే చిక్కుకుపోయారు. ఈ పరిస్థితులను గమనిస్తున్న హైదరాబాద్‌లోని వలస కార్మికులు, చిరు వ్యాపారులు ముందు జాగ్రత్తగా నగరం విడిచి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు.

Also Read : లాక్ డౌన్ ప్రకటనలు.. అంత రహస్యమెందుకు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి