iDreamPost

లాక్ డౌన్ నిబంధనలు మీరిన యువకులు- భయపెడుతూనే నవ్వించిన పోలీసులు

లాక్ డౌన్ నిబంధనలు మీరిన యువకులు- భయపెడుతూనే నవ్వించిన పోలీసులు

లాక్ డౌన్ విధించినా కొందరు వాహనాలపై బయటకు వస్తూనే ఉన్నారు. పోలీసులు కఠినంగా వ్యవహరించినా,కేసులు పెట్టి,వాహనాలు సీజ్ చేసి ఫైన్ వేస్తామని హెచ్చరికలు జారీ చేసినా కొందరు ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను మీరి, లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తూనే ఉన్నారు.

అలా బయటకు వస్తున్న కొందరిని ఇంటికే పరిమితం అయ్యేలా చేయడానికి పోలీసులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇటీవల విజయవాడలో నేను తప్పుచేసాను క్షమించండి అంటూ 500 సార్లు రాయించారు పోలీసులు.. అలాగే మరి కొన్నిప్రాంతాల్లో గుంజీలు తీయిస్తున్నారు. ఇలా ప్రజలను సరైన మార్గంలో పెట్టడానికి రకరకాల మార్గాలు ఎన్నుకున్న పోలీసులు తీరు అభినందనీయం.. కానీ తిరుప్పూర్ పోలీసులు వ్యవహరించిన తీరు నిబంధనలు అతిక్రమించిన ముగ్గురు యువకులకు తీవ్ర భయాన్ని కలిగించడమే కాకుండా ఆ సంఘటన చూసిన ప్రజలను నవ్వుల పువ్వులు పూయిస్తుంది..ఇప్పుడీ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ పోలీసులను అభినందిస్తూనే నవ్వుకుంటున్నారు..

వివరాల్లోకి వెళితే నిబంధనలు మీరి ముగ్గురు యువకులు ఒకే స్కూటీపై వెళ్తుండగా పోలీసులు ఆపారు..  వారిని ఎందుకు బయటకు వచ్చారంటూ ప్రశ్నిస్తూనే పక్కనే ఆపి ఉన్న అంబులెన్స్ లో ఆ యువకులను ఎక్కించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక యువకుడు అంబులెన్స్ ను ఎక్కనంటూ మొండికేసాడు. బలవంతంగా ఆ యువకుడిని అంబులెన్స్ లో ఎక్కించారు పోలీసులు. మిగిలిన ఇద్దరు యువకులను కూడా అంబులెన్స్ లో ఎక్కించారు..

కానీ అంబులెన్స్ లో పూర్తిగా కరోనా వ్యాధి సోకిన రోగి తరహాలో ఒక వ్యక్తి ఉన్నాడు.. ఆ వ్యక్తి అంబులెన్స్ లో ఎక్కిన ముగ్గురు యువకులను తాకే ప్రయత్నం చేయడం యువకులు తప్పించుకోవడానికి అంబులెన్స్ కిటికిలోనుండి బయటకు రావడానికి ప్రయత్నించడం నవ్వుల పువ్వులు పూయిస్తుంది. అయితే ఒక యువకుడు కిటికిలోనుండి బయటకు రావడంతో తిరిగి అంబులెన్స్ లోకి ఎక్కించారు. కరోనా సోకిన వ్యక్తి తమను ఎక్కడ తాకుతాడో అని తమకు కరోనా ఎక్కడ సోకుతుందో అని గజగజ వణికిపోయారు ముగ్గురు యువకులు.

తర్వాత ఇదంతా నిబంధనలు అతిక్రమించి రోడ్లపైకి వస్తున్న వారిని భయపెట్టడానికి చేసిన ప్రయత్నమని పోలీసులు వివరణ ఇచ్చారు. రోగి వేషంలో ఉన్న వ్యక్తిని తామే ఏర్పాటు చేశామని పోలీసులు వెల్లడించారు. దీంతో ముగ్గురు యువకులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా సోకుతుందని ఇంత భయం ఉన్నప్పుడు లాక్ డౌన్ నిబంధనలు మీరి బయటకు రాకూడదని యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు పోలీసులు. గత కొంతకాలంగా తిరుప్పూర్ పోలీసులు విన్నూత్న రీతిలో ప్రజలకు కరోనా తీవ్రత పట్ల అవగాహనా కలిగిస్తున్నారు. ప్రస్తుతం యువకులను భయపెట్టిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి