Dharani
Dharani
దేశంలోనే కాక.. అంతర్జాతీయంగా కూడా ఎంతో మంచి పేరు తెచ్చుకుంది దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్. నమ్మకానికి మారు పేరుగా నిలిచింది ఈ సంస్థ. ఇన్ఫోసిస్‌లో జాబ్ అంటే.. ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ సంస్థకు సంబంధించి మరో గొప్ప విషయం ఏంటంటే.. కేవలం వ్యాపార ధోరణి మాత్రమే కాక.. సమాజం పట్ల తన బాధ్యతను కూడా చాటుకుంటుంది. విపత్తుల సమయంలో వెంటనే స్పందిస్తుంటుంది. ఇక ఈ సంస్థ సహవ్యవస్థాపకులు సుధామూర్తి అనేక సేవా కార్యక్రమాలు చేపడతారు. ఈ క్రమంలో తాజాగా మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఇన్ఫోసిస్. పేద విద్యార్థుల కోసం.. నాలుగేళ్ల కాలానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆ వివరాలు..
ప్రముఖ విద్యా సంస్థల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్‌లో ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంటున్న పేద విద్యార్థినులకు ఇన్ఫోసిస్ శుభవార్త చెప్పింది. వీరికి స్టెమ్ స్టార్స్ ఉపకార వేతనాలు (స్కాలర్‌షిప్స్) ఇచ్చేందుకు ఏకంగా రూ. 100 కోట్ల కేటాయించినట్లు వెల్లడించింది.. ఇన్ఫోసిస్ దాతృత్వ విభాగం.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్. తొలి విడతలో భాగంగా దేశంలోని ప్రముఖ కాలేజీల్లో సీట్లు పొందిన 2 వేల మంది విద్యార్థినులకు నాలుగేళ్ల పాటు ఈ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
ఉన్నత విద్య అభ్యసిస్తోన్న పేద విద్యార్థినిలకు వసతి ఖర్చులు, స్టడీ మెటీరియల్స్, ట్యూషన్ ఫీజులు ఇలా వీటి కోసం ఏడాదికి రూ. లక్ష వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది ఇన్ఫీ ఫౌండేషన్. ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుమిత్ విర్మానీ మాట్లాడుతూ..‘‘దేశంలోని పేద కుటుంబాల యువత తాము కోరుకున్న ఉన్నత చదువులు చదవలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా బాలికలపైనే ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అలాంటి వారికి చేయూత అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం’’ అని చెప్పుకొచ్చారు.
స్కాలర్‌షిప్ ప్రారంభ సంవత్సరంలో భాగంగా ఎన్‌ఐఆర్‌ఎఫ్ గుర్తింపు ఉన్న విద్యాలయాలు.. ఐఐటీలు , బిట్స్ పిలానీ, నిట్ సహా ప్రముఖ వైద్య కళాశాలల్లో చదివే వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం కేవలం ఒక వ్యక్తికో, సమాజానికో సేవ చేయడం లాంటిది కాదనీ.. మహిళలకు విద్య ఆవశ్యకతను నొక్కి చెప్పడం కోసం ప్రారంభించినట్లు విర్మానీ తెలిపారు. మహిళలు చదువుకుంటే.. అది వారి పిల్లలపై సానుకూల ప్రభావం చూపుతుందన్నారు. అంతేకాక ఎన్నో తరాల సమస్యకు పరిష్కారంగా మారుతుందని తెలిపారు. అందుకే చదువు పట్ల ఉత్సాహంగా ఉన్న విద్యార్థినిల కోసంఈ స్టెమ్ స్టార్స్ స్కాలర్‌షిప్ ప్రోగ్రాం ప్రారంభించినట్లు చెప్పుకొచ్చారు.