క్రికెట్ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు రానే వచ్చింది. జెంటిల్మన్ గేమ్‌లో అత్యుత్తమ సమరాల్లో ఒకటిగా చెప్పుకునే ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఆసియా కప్-2023లో భాగంగా దాయాది జట్లు శనివారం అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేపాల్‌ను చిత్తుచేసి టోర్నీని ఘనంగా ఆరంభించిన పాక్.. భారత్‌తో మ్యాచ్‌కు సై అంటోంది. మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్‌తోనే తన పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ తుది జట్టును ప్రకటించింది. నేపాల్‌తో తలపడిన టీమ్‌నే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.
పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 238 రన్స్ తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో గ్రూప్-ఏలో పాక్ ముందంజలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఫెయిలైన ఓపెనర్లు ఫఖర్ జమాన్ (14), ఇమామ్ ఉల్ హక్ (5)లను భారత్‌తో పోరులోనూ కొనసాగించేందుకు పాక్ మేనేజ్మెంట్ మొగ్గు చూపింది. అదే విధంగా ఆడతాడో లేడోననే సందేహాలు తలెత్తుతున్న పేసర్ షాహిన్ అఫ్రిదికి కూడా తుది జట్టులో చోటు కల్పించింది. అతడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు వెల్లడించింది. టీమిండియాతో మ్యాచ్‌కు షాహిన్, నసీం షా, హ్యారిస్ రవూఫ్ రూపంలో పేస్ త్రయం అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది పీసీబీ.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు తమ టీమ్ కాంబినేషన్ పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సాధించి కమ్‌బ్యాక్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నాడు హిట్‌మ్యాన్. తమకు అందుబాటులో చాలా కాంబినేషన్స్ ఉన్నాయని తెలిపాడు. బ్యాటింగ్ యూనిట్లో అనుభవం కలిగిన ఆటగాళ్లు ఉన్నారని చెప్పాడు. ఈసారి ఆసియా కప్ ఫైనల్లో భారత్-పాక్ ఆడతాయని ఆశిస్తున్నట్లు రోహిత్ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌తో ఆడటం తమకు అతిపెద్ద సవాల్ అని.. ఈ మ్యాచ్‌లో ఎవరు అత్యుత్తమ క్రికెట్ ఆడితే విజయం వారినే వరిస్తుందని భారత కెప్టెన్ వివరించాడు.
ఇదీ చదవండి: భారత జెర్సీలపై పాక్ పేరు లేకపోవడానికి కారణం!