ఆసియా కప్-2023లో ఓటమి అనేదే లేకుండా దూసుకుపోతున్న టీమిండియాకు బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. సూపర్-4లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 6 రన్స్ తేడాతో బంగ్లా చేతిలో భారత్ ఓటమిపాలైంది. టీమిండియా ఈ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చింది. వాళ్ల స్థానాల్లో తిలక్ వర్మ, మహ్మద్ షమి, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణలకు టీమ్‌లో అవకాశమిచ్చింది. ఈ మ్యాచ్‌తోనే హైదరాబాదీ తిలక్ వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఛేజింగ్‌లో భారత్‌కు శుభారంభం దక్కలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ వర్మ (5), కేఎల్ రాహుల్ (19), ఇషాన్ కిషన్ (5) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. సూర్యకుమార్ యాదవ్ (26), రవీంద్ర జడేజా (7) కూడా స్వల్ప వ్యవధిలోనే ఔటవ్వడంతో భారత్ దిక్కుతోచని స్థితిలో కనిపించింది. కానీ శుబ్‌మన్ గిల్ (121) మాత్రం ఒంటటి పోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఆపద్బాంధవుడి పాత్రను పోషిస్తూ జట్టును రేసులో నిలిపాడు. అయితే రిక్వైర్డ్ రన్‌రేట్ పెరిగిపోవడంతో హిట్టింగ్‌కు వెళ్లిన గిల్.. మెహదీ హసన్ బౌలింగ్‌లో కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాతి బంతికి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటై వెనుదిరిగాడు. గిల్ ఔటైనా అక్షర్ పటేల్ మాత్రం పట్టు వదల్లేదు. టీమిండియాను విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు.
శార్దూల్‌తో కలసి చక్కగా బ్యాటింగ్ చేసిన అక్షర్.. జట్టును గెలిపించేట్లే కనిపించాడు. కానీ 49వ ఓవర్లో వీళ్లిద్దరూ ఔటవ్వడంతో భారత ఫ్యాన్స్ ఆశలు వదులుకున్నారు. ఆ తర్వాత షమి రనౌటవడంతో ఇన్నింగ్స్ ముగిసింది. ఆసియా కప్ చరిత్రలో భారత్‌పై బంగ్లాదేశ్‌కు రెండో విజయమిది. ఈ రెండు సార్లు కూడా టీమిండియా తరఫున రెండు సెంచరీలు నమోదయ్యాయి. 2012లో బంగ్లాతో ఆసియా కప్ మ్యాచ్‌లో సచిన్ (114) సెంచరీ కొట్టాడు. ఇప్పుడేమో గిల్ శతకం బాదాడు. మన ప్లేయర్లు సెంచరీలు కొట్టిన రెండు సందర్భాల్లోనూ జట్టు ఓటమిపాలైంది. దీంతో కొందరు నెటిజన్స్ వీళ్ల సెంచరీలే భారత్ కొంపముంచాయంటూ అర్థం లేని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ రెండు మ్యాచుల్లోనూ మిడిల్ ఓవర్లలో భారత బౌలర్ల ఫెయిల్యూర్ కామన్‌గా కనిపిస్తోంది. అలాగే బ్యాట్స్‌మెన్ త్వరగా ఔటవ్వడం కూడా జట్టు విజయావకాశాలను దెబ్బతీసింది.
ఇదీ చదవండి: బంగ్లాపై భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు!
Bangladesh’s last 2 wins over India in Asia Cup history:
2012 – Sachin Tendulkar scored a century.
2023 – Shubman Gill scored a century. pic.twitter.com/nBgji6Opct
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2023