iDreamPost

Presidential Polls 2022: భార‌త‌దేశానికి తొలిసారిగా రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇద్ద‌రూ మ‌హిళ‌లే ఎన్నికైతే?

Presidential Polls 2022: భార‌త‌దేశానికి తొలిసారిగా రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఇద్ద‌రూ మ‌హిళ‌లే ఎన్నికైతే?

అంతా అనుకున్నట్లే జరిగితే మన దేశ చరిత్రలో ఓ అద్భుతం ఆవిష్కృతం కానుంది. తొలిసారి దేశ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులు రెండింటినీ మహిళలే అధిష్ఠించే అవకాశం దగ్గరలోనే ఉంది. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పోటీ చేస్తుండగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ మార్గరెట్ ఆల్వా ఉప రాష్ట్రపతి పదవికి చివరి నిముషంలో నామినేషన్ వేశారు.ముర్ముకు పోటీగా విపక్షాలు బీజీపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి. ఇక పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ఢాంకర్ ఎన్డీయే అభ్యర్థిగా ఆల్వాతో పోటీ పడుతున్నారు. ఈ పోటీలో ఇద్దరు మహిళలూ కనక నెగ్గితే మన ప్రథమ, ద్వితీయ పౌరులు ఇద్దరూ స్త్రీలే అవుతారు. ఇప్పటివరకు రాష్ట్రపతిగా, దేశ ప్రధానిగా ఇద్దరు మహిళలు పని చేశారు. ఇందిరా గాంధీ దేశ ప్రధానిగా గడగడలాడిస్తే, ప్రతిభా పాటిల్ రాష్ట్రపతిగా సేవలందించారు. ఇప్పుడిక మార్గరెట్ ఆల్వా గెలిస్తే మనకు మహిళా ఉప రాష్ట్రపతి లేరన్న కొరత తీరిపోతుంది. దాంతో పాటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే ఒకేసారి రెండు అత్యున్నత పదవులనూ మహిళలే ఏలబోయే గొప్ప సందర్భం సాకారమవుతుంది.

64 ఏళ్ళ ద్రౌపది ముర్ము ఒడిషాకు చెందిన బీజేపీ నేత. టీచర్ గా పని చేసిన ముర్ము 1997లో కౌన్సిలర్ గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాయ్ రంగ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు సార్లు బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చాకు వైస్ ప్రెసిడెంట్ గా పని చేశారు. తర్వాత జార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తించారు. ముర్ము జార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్. ఒడిషా నుంచి మరో రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన తొలి గిరిజన మహిళా నేత కూడా ఆవిడే.

ఇక మార్గరెట్ ఆల్వా ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. రాజస్థాన్, గోవా, గుజరాత్, ఉత్తరాఖండ్ లకు గవర్నర్ గా పని చేశారు. కేంద్ర మంత్రిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మొదలుకొని చాలా మంత్రిత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మహిళలకు హక్కులు కల్పించే ఎన్నో చట్టాల రూపకల్పన కోసం ఆమె పోరాడారు.

రాష్ట్రపతి ఎన్నిక భిన్నం. పార్లమెంటులో ఉభయ సభల సభ్యులు, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టసభల సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ మేరకు సోమవారం పోలింగ్ జరిగింది. మొత్తం 4,796 ఎలక్టర్లలో 99.9 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. పది రాష్ట్రాలు, పాండిచ్చేరిలో వంద శాతం పోలింగ్ నమోదైంది. జూలై 21న కౌంటింగ్ జరుగుతుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.

ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము, మార్గరెట్ ఆల్వా కనుక అత్యున్నత స్థానాలకు ఎన్నికైతే దేశంలో మహిళా నాయకత్వానికి కొత్త దారులు తెరుచుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి