iDreamPost

పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌! ‘వందేమాతరం’తో దద్దరిల్లిన స్టేడియం

  • Published Aug 10, 2023 | 8:00 AMUpdated Aug 10, 2023 | 8:00 AM
  • Published Aug 10, 2023 | 8:00 AMUpdated Aug 10, 2023 | 8:00 AM
పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌! ‘వందేమాతరం’తో దద్దరిల్లిన స్టేడియం

సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో టీమిండియా సత్తా చాటుతోంది. ఇప్పటికే ఒక్క ఓటమి కూడా లేకుండా సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌‌ను చిత్తుగా ఓడించింది. బుధవారం జరిగిన చివరి రౌండ్ రాబీన్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌ 4-0 తేడాతో పాక్‌పై ఘన విజయం సాధించింది. టీమిండియా సూపర్‌ ఎటాక్‌ ముందు దాయాది పాకిస్థాన్ నిలబడలేకపోయింది.

టీమిండియా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. జుగ్‌రాజ్, మన్‌దీప్ సింగ్ తలో గోల్ సాధించారు. అలాగే బలమైన డిఫెన్స్‌తో పాటు ఎటాకింగ్ గేమ్‌తో పాకిస్థాన్‌ను అల్లాడించింది. ఫస్ట్ క్వార్టర్‌లోనే లభించిన పెనాల్టీ కార్నర్‌ను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. దాంతో భారత్ 1-0తో తొలి క్వార్టర్‌ను ముగించింది. రెండో క్వార్టర్‌లో హార్మన్‌ప్రీత్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. జుగ్ రాజ్ డ్రాగ్ ఫ్లిక్‌తో బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. చివరి క్వార్టర్‌లో మ్యాచ్ ముగుస్తుందనగా.. మన్‌దీప్ సింగ్ మరో గోల్ కొట్టి భారత్ ఆధిక్యాన్ని 4కు పెంచాడు.

ఇక ఆట ఏదైనా భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ అంటే అదో మినీ యుద్ధంలా సాగుతుంది. అందుకే ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్ ప్రపంచం భారత్‌-పాక్‌ మ్యాచ్‌లపై ఆసక్తి కనబరస్తుంది. అయితే చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు కూడా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భారత క్రికెట్‌ జట్టు స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చాడు. కాగా, ఈ మ్యాచ్‌ సందర్భంగా ‘వందేమాతరం’ నినాదాలతో మైదానం దద్దరిల్లింది. ఏఆర్‌ రెహమాన్‌ స్వరపర్చిన ‘మా తుఝే సలాం’పాటతో స్టేడియం ఊగిపోయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కిందున్న ఆ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరల్డ్ కప్ షెడ్యూల్ లో మార్పులు! ఇండియా-పాక్ మ్యాచ్ తో సహా 9 మ్యాచ్ లు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి