iDreamPost

మూడు రాజధానుల ఆలోచన చంద్రబాబు చేసి ఉంటే..?

మూడు రాజధానుల ఆలోచన చంద్రబాబు చేసి ఉంటే..?

రాజకీయ నాయకులకు మీడియా అండదండలు చాలా అవసరం. మీడియా చెప్పుచేతల్లో ఉంటే తాము చేసే ప్రతి పనీ అమోఘం అని, అదే పని అవతలి పక్షంలో వారు చేస్తే ఛండాలం అనీ మీడియా చేత ఊదరగొట్టించవచ్చు.

ఈ విషయం ఎనిమిది దశాబ్దాల క్రితమే అడాల్ఫ్ హిట్లర్ కనిపెట్టాడు. ప్రాపగాండా మంత్రిత్వ శాఖ ఒకదానిని సృష్టించి, దానికి జోసెఫ్ గోబెల్స్ అనే వాడిని మంత్రిగా నియమించాడు. హిట్లర్ చేసే ప్రతి పనికీ జనంలో మద్దతు కూడగట్టేలా ప్రచారం చేయడం ఇతని పని. అలాంటి ప్రచారాన్ని ఆ తర్వాత కాలంలో గోబెల్స్ ప్రచారం అని పిలిచేలా తన పనిలో విజయం సాధించాడు ఈ గోబెల్స్.

సమకాలీన రాజకీయాల్లో మీడియా శక్తి గుర్తించి, దానిని మచ్చిక చేసుకున్న వారిలో అగ్రగణ్యుడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఆయన, వారి పార్టీలో కొంతమంది తీవ్రంగా విరుచుకుపడుతున్న రాజధాని వికేంద్రీకరణ అన్న ఆలోచన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు చేసిఉంటే అదో అద్భుతం అన్నట్లు మీడియాలో మోతెక్కిపోయి ఉండేది.

ముందు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిలో అసమానతల గురించి, దాన్ని తొలగించి, అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి ఫలాలు అందజేయవలసిన ఆవశ్యకత గురించి మీడియాలో వార్తలు వచ్చేవి. రాయలసీమ, ఉత్తరాంధ్ర నాయకులు తమ వెనుకబాటు తనం గురించి సభలు పెట్టి, ఆదుకోవలసిందిగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తులు చేసేవారు. కొన్నాళ్ళు ఇలా జరిగాక ఒక రోజు రాజధాని వికేంద్రీకరణ గురించి ముఖ్యమంత్రి ప్రకటన చేయడం, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు, నాయకులు, మేధావులు వారికి కృతజ్ఞతలు చెప్పడంతో మీడియా మోతెక్కిపోయేది. పోటీలు పడి ఆయా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారికి సన్మాన సత్కారాలు జరిగేవి.

అంతర్జాతీయ స్థాయిలో సంచలనం

కొందరు మరీ విధేయత కలిగిన మీడియా అధిపతులు తమ నేతను అంతర్జాతీయ స్టార్ చేసే ప్రయత్నంలో కొత్త పాట, పాత మాట లాంటి శీర్షికలతో ముఖ్యమంత్రి పక్కన ఇరవైనాలుగు గంటలూ తను ఉన్నట్లు కొన్ని ఊహాజనిత సీన్లు, డైలాగులను వార్తల రూపంలో పంచేవారు.

అర్ధరాత్రి, ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉండగా తనొక్కడే మేలుకుని ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్న చంద్రబాబు బల్ల మీద ఉన్న ఫోన్ మోగింది. చంద్రబాబు ఫోన్ తీసి “హలో చంద్రబాబు హియర్” అన్నాడు. “హలో మిస్టర్ చంద్రబాబు. ట్రంప్ స్పీకింగ్” అని అవతలి నుంచి వినిపించింది.

చంద్రబాబు ఆశ్చర్యపోయాడు. ముందుగా సెక్రటరీ ఎవరైనా ఫోన్ చేశాక కానీ అధ్యక్షుడు లైన్ లోకి రాడు. కానీ ఇప్పుడు ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వయంగా ఫోన్ చేశాడు.

“మిస్టర్ బాబూ! మూడు చోట్ల రాజధాని అన్న మీ ఆలోచన అమోఘం. మాకు కూడా ఇంత పెద్ద దేశంలో రాజధాని నగరం ఒక వైపు ఉండడం వలన ఈస్ట్ కోస్ట్ బాగా డెవలప్ అయి, వెస్ట్ కోస్ట్ అభివృద్ధి సరిగా లేదు. మా సమస్యకు పరిష్కారం మీరు చూపించారు. మీరు వీలు చూసుకుని మా దేశానికి వచ్చి ఓ పది రాజధానులకు అనువైన నగరాలు సూచించి, మా సెనేట్ లో సభ్యులకు దిశానిర్దేశం చేయమని నా విన్నపం”అన్నాడు ట్రంప్ ఇంగ్లీషులో.

” సారీ మిస్టర్ ట్రంప్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నా రాష్ట్ర అభివృద్ధి మీదే. ప్రపంచంలో టాప్-5 రాష్ట్రాలలో ఒకటిగా నా రాష్ట్రాన్ని నిలిపేవరకూ ఈ రాష్ట్రం విడిచి వచ్చే సమస్య లేదు”అని ధృఢంగా చెప్పాడు చంద్రబాబు.

” మై మిస్ ఫార్చూన్ బాబూ. రెగ్యులర్ టచ్ లో ఉంటాను. నాకు గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ “అని ట్రంప్ ఫోన్ పెట్టేవాడు.

కాసేపటి తరువాత మాస్కో నుంచి పుతిన్, బీజింగ్ నుంచి జిన్ పింగ్ ఫోన్లు చేశారు. మళ్లీ అదే విజ్ఞాపన . పెద్ద దేశాలు కావడం వల్ల ఒక రాజధాని నగరంతో తమ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధిలో అంతరం ఉందనీ, చంద్రబాబు చేసిన బహుళ రాజధానుల ఆలోచన అనుసరించాలని అనుకుంటున్నామనీ, తమ దేశానికి వచ్చి దిశానిర్దేశం చేయమని వారు చేసిన విఙప్తులు సున్నితంగా తోసిపుచ్చారు చంద్రబాబు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలిపేవరకూ మరో విషయం మీద తన ఫోకస్ పడదనీ, కావాలంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సలహాలు ఇస్తుంటాననీ చెప్పారు.

మరుసటి రోజు నుంచి ప్రతిరోజు వివిధ దేశాల నుంచి నానా యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ప్రకటించడం, ఐక్యరాజ్యసమితి తమ జనరల్ అసెంబ్లీలో ఉపన్యాసం ఇవ్వమని ఆహ్వానం పంపడం లాంటి వార్తల వెల్లువెత్తుతాయి.

ది గ్లోబల్ విజనరీ అని సోషల్ మీడియాలో ట్యాగ్ లైన్ తగిలిస్తారు!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి