iDreamPost

కుండ బద్ధలు కొట్టిన కేంద్రం… ఇకపై నేతలు ఏమి చెబుతారో..?

కుండ బద్ధలు కొట్టిన కేంద్రం… ఇకపై నేతలు ఏమి చెబుతారో..?

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దాదాపు 50 రోజులు నుంచి అమరావతిలోని కొన్ని గ్రామాల్లో ఉద్యమాలు చేస్తున్న వారికి, రాజధానిగా అమరావతే కొనసాగుతుందన్న ఆశతో ఉన్న టీడీపీలోని కొంత మంది నేతలకు ఉన్న ఒకే ఒక్క ఆశ ఆడియాశైంది. కేంద్రం జోక్యం చేసుకుంటుందని, రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని భావించిన వారికి ఈ రోజు ఓ క్లారిటీ వచ్చింది. ఏపీ రాజధాని అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టమని.. రాష్ట పరిధిలో ఎక్కడ పెట్టుకోవాలో వారిష్టమంటూ కేంద్ర హోం శాఖ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ రోజు లోక్‌సభలో కుండబద్ధలు కొట్టారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పై విధంగా సమాధానం ఇవ్వడం గమనార్హం.

టీడీపీ, ఆ పార్టీ నేతల ఆధ్వర్యంలో అమరావతి జేఏసీ పేరిట ఇన్నాళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా కూడా రాష్ట్ర సమతుల అభివృద్ధి కోసం మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకే వెళుతోంది. ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రంలోని మెజారిటీ ప్రజల మద్దతు ఉండడంతో.. అమరావతి ఉద్యమం కొన్ని గ్రామాలకే పరిమితమైంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజమహేంద్రవరం, తిరుపతిల్లో పర్యటించినా.. ప్రజల నుంచి స్పందన కరువైంది. చివరకు జోలి పట్టుకుని విరాళాలు సేకరిస్తూ అమరావతి కోసం కలసి రండంటూ అన్ని వర్గాల వారిని కోరినా చంద్రబాబుకు ఉపసమనం దక్కలేదు.

అమరావతి ప్రాంతంలో ఉద్యమం ప్రారంభమైన 10 రోజులకే చంద్రబాబు, టీడీపీ సమర్థతపై రైతులు ఓ అంచనాకు వచ్చారు. టీడీపీ వల్ల మూడు రాజధానులు ప్రతిపాదన ఆగదని తెలుసుకున్న వారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తమ నిరసనలు, ఆందోళనల్లో ప్రధాని మోదీ, అమిత్‌షా ఫొటోలు, బీజేపీ జెండాలను ఉపయోగిస్తూ.. మీరే దిక్కనేలా వ్యవహరించారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా రాజధానిగా అమరావతి కొనసాగుతుందంటూ భరోసా ఇచ్చారు. బీజేపీతో తాను మాట్లాడతానని చెప్పకొచ్చారు. (ఆ తర్వాత రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు.. అది వేరే విషయం).

అమరావతి జేఏసీ నేతలు రాష్ట్రానికి వచ్చిన బీజేపీ నేతలకు, ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు వినతిపత్రాలు ఇస్తున్నారు. తాజాగా నిన్న సోమవారం కూడా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, కింజారపు రామ్మోహన్‌నాయుడుల ఆధ్వర్యంలో జేఏసీ నేతలు కేంద్ర మంత్రులు పియూష్‌ గోయెల్, ప్రహ్లాద్‌ జోషీలను కలిశారు. ఈ విషయం ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళతామంటూ మంత్రులు తమకు హామీ ఇచ్చారని మీడియాకు చెప్పారు. ఇది జరిగి 24 గంటలకు గడవకముందే లోక్‌సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి మీ రాజధాని మీ ఇష్టం అంటూ.. బంతి తమ కోర్టులో లేదని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అమరావతిని కదిలించలేరని మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది.

మూడు రాజధానులను కేంద్రం అడ్డుకుంటుందని, మోదీ శంకుస్థాపన చేసిన అమరావతే కొనసాగుతుందని రైతులకు చెబుతూ వచ్చిన టీడీపీ, బీజేపీ నేతలు, జేఏసీ ప్రతినిధులు ఇకపై ఏమి చేస్తారో చూడాలి. ఉన్న ఒక్క అవకాశం కూడా పోవడంతో ఇకపై అమరావతి ఉద్యమం ఎటు పయనిస్తుందన్నది కాలమే నిర్ణయించాలి. అతి త్వరలో రాజధాని గ్రామాల్లో మళ్లీ పర్యటించనున్నజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈసారి ఏమి హామీ ఇస్తారో చూడాలి. కేంద్ర మంత్రి ప్రకటనపై చంద్రబాబు స్పందిస్తారా.. లేక తన పని తాను చేసుకుపోతారా.. ? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి