iDreamPost

జె.సి కుటుంబానికి హైకోర్ట్ షాక్..

జె.సి కుటుంబానికి హైకోర్ట్ షాక్..

గతంలో రాష్ట్రప్రభుత్వం మాజీమంత్రి జెసి దివాకర్ రెడ్డి కుటుంబానికి సంబందించిన త్రిశూల్ సంస్థకు అనంతపురం జిల్లా, యాకిడి మండలంలోని కొనుప్పలపాడులో కేటాయించిన లైమ్ స్టోన్ లీజుకు సంభందించిన వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ లీజు అనుమతులను రద్దు చెయ్యాలని, త్రిశూల్ సంస్థ అక్రమాలపై సిబిఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ తాడిపత్రికి చెందిన వి.మురళి ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి 2011 లో హైకోర్టుని ఆశ్రయించారు.

మంగళవారం ఈ కేసులో పిటిషనర్ తరపు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేజే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్య లతో కూడిన హైకోర్టు ధర్మాసనం త్రిశూల్ సంస్థకు కేటాయించిన భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆసంస్థ లీజుకు పొందిన క్వారీలో తొవ్విన లైమ్ స్టోన్ ని విక్రయించడంపై కూడా విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణని మార్చి 3 కి వాయిదా వేసింది.

ఈ కేసులో ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించిన ప్రభుత్వం తరపు న్యాయవాది సుమన్ కోర్ట్ ఆదేశాల మేరకు లైమ్ స్టోన్ లీజు రద్దుచేశామన్నారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న హైకోర్టు ధర్మాసనం లీజును రద్దు చేస్తే సరిపోదని, సిమెంట్ ఫ్యాక్టరి కోసం త్రిశూల్ సంస్థకి ఇచ్చిన 1,605 ఎకరాల క్వారీని కూడా సదరు సంస్థ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. దీనిపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా కోర్ట్ కు నివేదిక సమర్పించాలని ధర్మాసనం పేర్కొంది.

ఇదేసమయంలో పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రాజశేఖర్ జోక్యం చేసుకొని, ఇప్పటివరకు తవ్వి తీసిన లైమ్ స్టోన్ ని త్రిశూల్ కంపెనీ ఇతర ప్రయివేట్ సంస్థలకి విక్రయించిందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు త్రిశూల్ సంస్థ ఇలా ఇతర కంపెనీలకు విక్రయించేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాక ఇప్పటివరకు త్రిశూల్ సంస్థ ఎంతమేర లైమ్ స్టోని ని అక్రమంగా విక్రయించారు ?? దానికి భాద్యులెవరో ?? చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి