iDreamPost

పుస్తకంలో వెన్నెల తెరపై విలవిలా – Nostalgia

పుస్తకంలో వెన్నెల తెరపై విలవిలా – Nostalgia

నవలా కథా చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమకు కొత్త కాదు. ఇప్పటికి ఎన్నో వచ్చాయి. అక్కినేని నాగేశ్వరావు సెక్రటరీ, చిరంజీవి అభిలాష, నాగార్జున ఆఖరి పోరాటం, వెంకటేష్ ఒంటరి పోరాటం కొన్ని ఉదాహరణలు మాత్రమే. అయితే జనాదరణ పొందిన ప్రతి నవల తెరమీద అంతే అద్భుతంగా వస్తుందన్న గ్యారెంటీ లేదు. అదెలాగో చూద్దాం. 1982లో రచయిత యండమూరి వీరేంద్రనాధ్ రాసిన వెన్నెల్లో ఆడపిల్ల అప్పట్లో ఒక పెద్ద సంచలనం. కేవలం ఈ సీరియల్ చదవడం కోసమే వారపత్రికను కొనే పాఠకులు లక్షల్లో ఉండేవాళ్ళు. అప్పటిదాకా రీడర్స్ కు తెలియని ఒక సరికొత్త అనుభూతిని దాని ద్వారా కలిగించడం సాహితీవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది.

ఇది నవలగా అచ్చయ్యాక ఎన్ని లక్షల కాపీలు అమ్ముడుపోయాయో లెక్క చెప్పడం కష్టం. నవసాహితి బుక్ హౌస్ ఇప్పటికే సుమారు నలభై దాకా ఎడిషన్లు వెలువరించిందంటే దానికున్న ఆదరణ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. 1990 ప్రాంతంలో ఈ కథను ఆధారంగా చేసుకుని దూరదర్శన్ లో టీవీ సీరియల్ వస్తే అది కూడా సూపర్ హిట్ అయ్యింది. కానీ ఎందుకనో దర్శకులు మాత్రం ఇంత గొప్ప ప్లాట్ ని సినిమాగా మలచాలన్న ఆలోచన చేయలేకపోయారు. 1997లో వీర శంకర్ అనే యువకుడికి ఆ సాహసం చేయాలనిపించింది. దానికి అగ్ర నిర్మాత కె ఎస్ రామారావు ప్రోత్సాహం అందించడంతో ఎందరో పుస్తకాభిమానుల కల నెరవేరే సమయం వచ్చింది. ఇది సినిమాగా తీయబోతున్నారని వార్త వచ్చినప్పుడు మరో క్లాసిక్ రూపొందుతుందనే అనుకున్నారందరూ

పెళ్లి సందడి దెబ్బకు ఒక్క సినిమాతో పెద్ద మార్కెట్ పట్టేసిన శ్రీకాంత్ హీరోగా సాధిక హీరోయిన్ గా హలో ఐ లవ్ యు టైటిల్ తో ప్రకటించినప్పుడు కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఆనందపడ్డారు. గులాబీతో సెన్సేషన్ సృష్టించిన శశి ప్రీతం సంగీత దర్శకుడిగా ఒరిజినల్ సోల్ ని మిస్ కాకుండా ఓ దృశ్య కావ్యంగా మలిచేందుకు వీరశంకర్ శాయశక్తులా కష్టపడ్డారు. చదరంగం ఛాంపియన్ అయిన హీరోని ఓ అమ్మాయి తన మొహం చూపించకుండా కనుక్కోమని కవ్వించి చివరికి ఊహించని మజిలీకి తన కథను తీసుకెళ్లడమే ఇందులో మెయిన్ పాయింట్. 1997 నవంబర్ 1న విడుదలైన హలో ఐ లవ్ యు ప్రేక్షకులను కనీస స్థాయిలో మెప్పించలేకపోయింది. పుస్తకంలో ఉన్న ఫీల్ ని తెరమీద ఆడియన్స్ ఫీల్ కాలేదు. 13 ఏళ్ళ పాత నవలని సినిమాగా అంగీకరించలేకపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి