iDreamPost
android-app
ios-app

అందరూ పాండ్యాను తిడుతున్నారు! కానీ.. అతనో గొప్ప రికార్డు సాధించాడు!

  • Published Aug 07, 2023 | 11:11 AM Updated Updated Aug 07, 2023 | 11:11 AM
  • Published Aug 07, 2023 | 11:11 AMUpdated Aug 07, 2023 | 11:11 AM
అందరూ పాండ్యాను తిడుతున్నారు! కానీ.. అతనో గొప్ప రికార్డు సాధించాడు!

వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమి పాలుకావడంతో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతని చెత్త కెప్టెన్సీతోనే టీమిండియా ఓడిపోతుందని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ తప్పిదాల కారణంగానే రెండో టీ20లో గెలవాల్సిన టీమిండియా ఓటమి పాలైందని క్రికెట్‌ నిపుణులు కూడా అంటున్నారు. అయితే.. ఈ విమర్శలు కాసేపు పక్కనపెడితే.. అదే హార్దిక్‌ పాండ్యా ఓ అరుదైన గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తరపున తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఆ రికార్డు ఏంటంటే.. టీ20 క్రికెట్‌లో(ఐపీఎల్‌ కలుపుకుని) బ్యాటర్‌గా 4 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 150 వికెట్లు తీసుకున్న తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్‌ పాండ్యా రికార్డు సృష్టించాడు. వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో బ్రాండన్‌ కింగ్‌ను అవుట్‌ చేయడంతో పాండ్యా ఈ ఘనత అందుకున్నాడు. కాగా ఇప్పటి వరకు పాండ్యా టీ20 క్రికెట్‌లో 4391 పరుగులు, అలాగే 152 వికెట్ల సాధించాడు. మరే ఇండియన్‌ క్రికెటర్‌కు ఈ రికార్డు లేదు. అందుకే అతనే టీ20ల్లో టీమిండియాకు అత్యత్తుమ ఆల్‌రౌండర్‌ అయ్యాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. తిలక్‌ వర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌తో 51 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాటర్లు విఫలం అయ్యారు. కాస్తో కూస్తో ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(27), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా(24) పర్వాలేదనిపించారు. శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌, అక్షర్‌ పటేల్‌ దారుణంగా విఫలం అయ్యారు. విండీస్‌ బౌలర్లలో అకెల్‌ హోస్సెన్‌, అల్జారీ జోసెఫ్‌, షెఫర్డ్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక 153 పరుగుల టార్గెట్‌ను విండీస్‌ 18.5 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి ఛేదించింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. నికోలస్‌ పూరన్‌(67), కెప్టెన్‌ పావెల్‌, హెట్‌మేయర్‌ రాణించడంతో విండీస్‌కు విజయం సులువైంది. భారత బౌలర్లలో పాండ్యా, చాహల్‌ మూడేసి వికెట్ల పడగొట్టారు. అర్షదీప్‌ సింగ్‌, ముఖేష్‌ కుమార్‌ చెరో వికెట్‌ తీసకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమితో పాటు.. పాండ్యా సాధించిన రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా ఓటమికి పాండ్యానే కారణం? అతను చేసిన పెద్ద తప్పు ఏంటి?