iDreamPost

గల్లీ రౌడీ రివ్యూ

గల్లీ రౌడీ రివ్యూ

మీడియం బడ్జెట్ సినిమాలతో తనకంటూ ఒక ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో సందీప్ కిషన్ ఇవాళ గల్లీ రౌడీగా థియేటర్లలో అడుగు పెట్టాడు. బాక్సాఫీస్ వద్ద పోటీ ఉన్నప్పటికీ అంతో ఇంతో కాస్త ఎక్కువ బజ్ ఉన్నది ఈ సినిమాకే. హాస్య చిత్రాలతో ఓ బ్రాండ్ సృష్టించుకున్న జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం చేయగా చాలా గ్యాప్ తర్వాత కోన వెంకట్ తన కలానికి పని చెప్పి దీనికి స్క్రీన్ ప్లే అందించడం విశేషం. క్యాస్టింగ్ పరంగా బాబీ సింహ లాంటి వాళ్ళు ఆకర్షణగా తోడయ్యారు. ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా చేశారు. మరి మంచి టైమింగ్ తో వచ్చిన గల్లీ రౌడీ గట్స్ చూపించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

వైజాగ్ లో ఉండే పేరుమోసిన రౌడీ మీసాల సింహాచలం(నాగినీడు)మనవడు వాసు(సందీప్ కిషన్). వీళ్ళ ప్రత్యర్థి బైరాగి(మైమ్ గోపి) వల్ల ఈ కుటుంబానికి నగరంలో ఉనికి లేకుండా పోతుంది. ఎప్పటికైనా వాసు తన వారసత్వాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో చదువు మాన్పించి మరీ వాసుని గల్లీ రౌడీగా తయారు చేస్తాడు తాత. మరోవైపు హెడ్ కానిస్టేబుల్ పట్టపగలు వెంకట్ రావు(రాజేంద్ర ప్రసాద్)రెండు కోట్ల విలువైన భూమిని బైరాగి కబ్జా చేసి రివర్స్ లో దారుణంగా అవమానిస్తాడు. దీంతో వాసు సహాయంతో తమ డబ్బులు రాబట్టుకునేందుకు ఆ కుటుంబం స్కెచ్ వేస్తుంది. ఈలోగా ఊహించని పరిణామం ఒకటి జరిగిపోతుంది. ఆ తర్వాత సినిమాలోనే చూడాలి

నటీనటులు

సందీప్ కిషన్ లో ఉన్న ఎనర్జీ అందరికీ తెలిసిందే. ఒకరకమైన మాస్ బాడీ లాంగ్వేజ్ తో ఇలాంటి పాత్రలు బాగా పండిస్తాడు. కానీ విచిత్రంగా టైటిల్ రోల్ తనదే అయినప్పటికీ ఇతను కనిపించేది తక్కువనిపిస్తే ఆశ్చర్యపోకండి. ఇలాంటి స్క్రిప్ట్ లో తన క్యారెక్టర్ ఎంతమేర ఉందన్నది చెక్ చేసుకోకుండా గుడ్డిగా దర్శకుడిని నమ్మడం వల్ల వచ్చిన ఫలితం ఇది. ఒకటి రెండు ఫైట్ల తప్ప అభిమానులకైనా నచ్చేలా వాసుని సరిగా డిజైన్ చేయలేకపోయారు. హీరోయిన్ నేహా శెట్టి లుక్స్ పర్వాలేదు. బాబీ సింహకు బిల్డప్ ఎక్కువయ్యింది కానీ దానికి తగ్గ మెటీరియల్ సినిమాలో లేదు.

అందరికంటే ఎక్కువ స్క్రీన్ టైం దొరికింది మాత్రం రాజేంద్ర ప్రసాదే. తెరనిండుగా కనిపించడమే కాదు నవ్వించడానికి తన వంతు ప్రయత్నం గట్టిగానే చేశారు కానీ ఫలితం దక్కలేదు. మైమ్ గోపి మాత్రం భయపెట్టాడు. క్రూరమైన విలనీని ఉన్నంత సేపూ చూపించాడు. వైవా హర్ష, వెన్నెల కిషోర్, షకలక శంకర్, పోసాని తదితరులంతా అలా మధ్యమధ్యలో వచ్చి కాసిన్ని జోకులు వేసేందుకు ఉపయోగపడ్డారు. వెంకట్ రావు ఫ్యామిలీలో తల్లి, భార్య, కొడుకు ఇలా ఎవరికి వారు తమకు తోచినంతలో కాస్త డీసెంట్ గా కాస్త ఓవర్ గా నవరసాలు పండించేశారు

డైరెక్టర్ అండ్ టీమ్

దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి తీసిన సీమ శాస్త్రి, సీమ టపాకాయ్, ఈడో రకం ఆడో రకం లాంటి ఎంటర్ టైనర్స్ కు ఇప్పటికీ అభిమానులు ఉన్నారు. రెగ్యులర్ గా టీవీలో వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడం గమనించొచ్చు. కానీ ఇవి తీసిన కాలానికి వర్తమానానికి చాలా మార్పులు వచ్చిన విషయం ఈయన పసిగట్టలేదని గల్లీ రౌడీలో సిల్లీ కామెడీకి ఫస్ట్ హాఫ్ సగం కాకుండానే అర్థమైపోతుంది. మాములు జోకులుకు నవ్వే జెనరేషన్ లేదిప్పుడు. ముతక హాస్యానికి చెల్లుచీటి పడిపోయింది. ఈ సత్యాన్ని గుర్తించకుండా నాగేశ్వర్ రెడ్డి అవే పొరపాట్లు రిపీట్ చేయడం విచారకరం. కేవలం వినోదాన్నే నమ్ముకున్న ఈయన కొత్తగా ఆలోచించాల్సింది.

ఎంత కామెడీ సినిమా అయినా సరే మరీ లాజిక్స్ ని గాలికి వదిలేస్తామంటే తీసినవాళ్లు నవ్వులపాలు కావడానికి అంత కన్నా వేరే కారణం అక్కర్లేదు. విలన్ కి బోయపాటి వివి వినాయక్ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చినప్పుడు హీరోకి అందులో సగమైనా ఎక్స్ పోజ్ చేయాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఈ లెక్క తప్పితే ఎలా ఉంటుందో గల్లీ రౌడీలో చూడొచ్చు. బైరాగిని అంత క్రూరంగా చూపించినప్పుడు హీరో వాసు నుంచి కనీస ప్రతిఘటనని సగటు మాస్ ప్రేక్షకుడు ఆశిస్తాడు. కానీ విలన్ చనిపోయేదాకా కూడా అది జరగదు. పైపెచ్చు వాడిని హత్య చేసినవాడు కూడా వేరేవాడిగా చూపించి అదేదో ట్విస్ట్ అనుకోమని క్లైమాక్స్ లోనూ వాయిస్తాడు దర్శకుడు.

గల్లీ రౌడీకి ప్రధానంగా టైటిల్ జస్టిఫికేషన్ జరగకపోవడం ఇందులో అసలు మైనస్. దీని బదులు వెంకట్ రావు కుటుంబం అని పెట్టినా పర్ఫెక్ట్ గా సరిపోయేది. ఏదో మార్కెట్ కోసం పోస్టర్లలో సందీప్ కిషన్ బొమ్మను పెట్టారు కానీ ఎక్కువగా కనిపించేది రాజేంద్రప్రసాదే. ఆయనకు పెద్ద పాత్రలు ఇవ్వడం డైరెక్టర్ సెంటిమెంటో ఏమో కానీ ఇందులో పూర్తిగా ఎక్కువైపోయింది. అసలు హీరోయిన్ ఫ్యామిలీ పరమ దుర్మార్గుడైన బైరాగిని కిడ్నాప్ చేయడమనే పాయింటే అర్థం లేనిది. దాన్ని పట్టుకుని ఏదో విజయ్ తుపాకీ స్టైల్ లో మర్డర్ ఎపిసోడ్ ప్లాన్ చేయడంతో సీరియస్ గా ఫీలవ్వాల్సిన ఆ ట్రాక్ మొత్తం రెంటికి చెడ్డ రేవడిలా తయారయ్యింది

పోనీ ఇంటర్వల్ తర్వాత బాబీ సింహా ఎంట్రీతో అయినా గల్లీ రౌడీ కొత్త మలుపు తీసుకుంటాడేమో అని ఎదురు చూస్తే అది తీరకపోగా పైపెచ్చు నీరసం ఎక్కువవుతుంది. ముసలి బ్యాచ్ ని వెంటేసుకుని సందీప్ కిషన్ రౌడీ వేషాలు వేయడం ఏమిటో, వైజాగ్ లాంటి సిటీలో ఓ హెడ్ కానిస్టేబుల్ కి కనీస తెలివితేటలు లేకపోవడం ఏమిటో, వందలాది మంది పనిచేసే ఫ్యాక్టరీలో పెద్ద హత్య జరిగితే సిసి కెమెరాల ప్రస్తావనే లేకుండా కథకుడి సౌకర్యానికి అనుగుణంగా వాటి ఊసే తేకపోవడం ఏమిటో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ప్రేక్షకులను మరీ అమాయకంగా జమకడితే నష్టపోయేది వాళ్ళు కాదు సదరు దర్శక నిర్మాతలే.

రామ్ మిర్యాల – సాయి కార్తీక్ ల సంగీతం మొదటిపాట వరకు మెప్పించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్లేదు. గట్టిగానే కొట్టారు. ఐటెం సాంగ్ మాస్ కి ఎక్కేలానే ఉంది. భాను భోగవరపు కథకు కోన వెంకట్-నాగేశ్వర్ రెడ్డిల జోడు స్క్రీన్ ప్లే పెద్దగా ఉపయోగపడింది లేదు. అక్కడక్కడా తప్పించి డైలాగుల్లోనూ పెద్దగా మెరుపులు లేవు. సుజాత సిద్దార్థ్ ఛాయాగ్రహణం బాగుంది. చోట కె ప్రసాద్ ఎడిటింగ్ మొహమాటపడకపోయి ఉంటే బాగుండేది. కెఎఫ్సి-ఎంవివి సంస్థల నిర్మాణ విలువలు మరీ గొప్పగా ఏం లేవు. చాలా పొదుపుగా ఖర్చు పెట్టిన వైనం అర్థమైపోతుంది. బడ్జెట్ పరంగా సేఫ్ గేమ్ ఆడారు

ప్లస్ గా అనిపించేవి

మొదటి పాట
కెమెరా వర్క్
ఓ రెండు ట్విస్టులు

మైనస్ గా తోచేవి

సందీప్ కిషన్ పాత్ర
రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే సంభాషణలు
దర్శకత్వం

కంక్లూజన్

ఇప్పటి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం అంటే ఏదో నాలుగు సింపుల్ జోకులు పెట్టేసి హీరోయిన్ ఫ్యామిలీ చుట్టూ రొటీన్ కామెడీని సెట్ చేయడమంత ఈజీ కాదు. పదేళ్ల క్రితం నాటి ఫార్ములాలు ఇప్పుడు వర్కౌట్ కావు. గల్లీ రౌడీ అదేమీ పట్టించుకోకుండా రెగ్యులర్ దారిలోనే వెళ్లడంతో హాయిగా నవ్వుకుందామని థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులు నిరాశపడతారు. ట్రైలర్లను చూసో టైటిల్ ని బట్టో ఏదేదో ఊహించుకుంటే మాత్రం భారంగా బయటికి రావాల్సి ఉంటుంది. బిర్యానీ పెడతామని చెప్పి ఉప్పు తగ్గిన దద్దోజనం వడ్డిస్తే ఎవరికైనా కడుపు నిండిన ఫీలింగ్ ఎందుకు కలుగుతుంది. గల్లీ రౌడీ వండిన భోజనం అలా ఉంది మరి

ఒక్కమాటలో – సిల్లీ రౌడీ

Also Read : మాస్ట్రో రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి