iDreamPost
android-app
ios-app

కొడుకు.. కోట్లు సంపాదించే క్రికెటర్‌.. తండ్రి సెక్యూరిటీ గార్డ్‌!

  • Published Feb 23, 2024 | 4:01 PM Updated Updated Feb 23, 2024 | 8:46 PM

Robin's Father Javier: ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే.. నేమ్‌, ఫేమ్‌తో పాటు భారీ సంపాదన కూడా వచ్చినట్లే. అలా చాలా మంది జీవితాలు ఓవర్‌నైట్‌లో మారిపోయాయి. అలా ఓ ఆటగాడు కోట్ల ధర పలికినా.. అతని తండ్రి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..

Robin's Father Javier: ఐపీఎల్‌లో ఆడే అవకాశం వస్తే.. నేమ్‌, ఫేమ్‌తో పాటు భారీ సంపాదన కూడా వచ్చినట్లే. అలా చాలా మంది జీవితాలు ఓవర్‌నైట్‌లో మారిపోయాయి. అలా ఓ ఆటగాడు కోట్ల ధర పలికినా.. అతని తండ్రి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 23, 2024 | 4:01 PMUpdated Feb 23, 2024 | 8:46 PM
కొడుకు.. కోట్లు సంపాదించే క్రికెటర్‌.. తండ్రి సెక్యూరిటీ గార్డ్‌!

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ భారత క్రికెట్‌ కు ఎంత మేలు చేసిందో తెలీదు కానీ, చాలా మంది పేద క్రికెటర్ల జీవితాలను మాత్రం మార్చేసింది. ఐపీఎల్‌ వేలంలో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుందనే విషయం తెలిసిందే. అనామక క్రికెటర్లు కూడా వేలంలో కోట్ల ధర పలుకుతున్నారు. ఐపీఎల్‌ 2024 కోసం జరిగిన మినీ వేలంలో ఓ యువ క్రికెటర్‌ పై గుజరాత్‌ టైటాన్స్‌ ఫ్రాంచైజ్‌ కోట్ల వర్షం కురిపించింది. జార్ఖండ్‌ కు చెందిన రాబిన్స్‌ ను ఏకంగా రూ.3.60 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. దాంతో ఆ క్రికెటర్‌ కుటుంబ నేపథ్యం పూర్తిగా మారిపోయి ఉంటుందని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. కానీ, ఆ క్రికెటర్‌ తండ్రి ప్రస్తుతం రాంచీలోని ఎయిర్‌ పోర్టులో ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్‌ గా విధులు నిర్వహిస్తున్నాడు. కొడుకు కోట్లు సంపాదించే క్రికెటర్‌ గా ఎదిగినా కూడా.. తండ్రి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌ గానే ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇంతకీ రాబిన్స్‌ తండ్రి ఇంకా సెక్యూరిటీ గార్డ్‌ గా పనిచేయడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య నాలుగో టెస్ట్‌ సందర్భంగా రాంచీలోని బిర్సా ముండా అంతర్జాతీయ విమానాశ్రయానికి భారత క్రికెటర్లు చేరుకున్నారు. అదే ఎయిర్‌ పోర్టులో ఫ్రాన్సిస్‌ జేవియర్‌ మింజ్‌ అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్‌ గా పనిచేస్తున్నాడు. ఆయన గతంలో ఆర్మీలో పనిచేసి.. రిటైర్మెంట్‌ తర్వాత ఎయిర్‌పోర్టులో సెక్యూరిటీ గార్డ్‌ గా చేరారు. భారత ఆటగాళ్లు విమానం దిగి.. వస్తున్న సమయంలో వాళ్లను జేవియర్‌ అలాగే చూస్తుండి పోయారు. ఏదో ఒక రోజు నా కొడుకు కూడా ఇలానే భారత జట్టుతో కలిసి వస్తాడని జేవియర్‌ ఊహించుకుంటూ ఉన్నారు. ఈ జేవియర్‌ కొడుకే రాబిన్స్‌. ఐపీఎల్‌ వేలంలో రూ.3.60 కోట్ల ధర పలికిన ఆటగాడు. ఐపీఎల్‌ ఆడబోతున్న తొలి గిరిజన బిడ్డ. అయితే.. కొడుకు ఐపీఎల్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఆడేందుకు రెడీ అవుతున్నా.. వేలంలో కోట్ల ధర పలికిన ఇంకా తండ్రి ఎందుకు సెక్యూరిటీ గార్డ్‌ పనిచేయాల్సి వస్తుందనే అనుమానం మీలో కలగొచ్చు. రాబిన్స్‌ ఐపీఎల్‌ వేలంలో అమ్ముడు పోకముందు నుంచి.. జేవియర్‌ సంపాదన మీదే కుటుంబం నడిచింది.

ఇప్పుడు కూడా ఆయన తన కుటుంబం కోసమే పనిచేస్తున్నారు. తన కొడుకు క్రికెటర్‌ అయినంత మాత్రానా.. తాను పనిచేయకుండా ఉండలేనని.. పని చేయకుండా ఉంటేతనకు తిన్న అన్నం వంటపట్టదని అన్నారు. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకూ పనిచేస్తూనే ఉంటానని వెల్లడించారు. తన కొడుకు.. ఐపీఎల్‌ లో మంచి ధర పలకడంతో తాము ఆర్థికంగా బలపడిన మాట వాస్తవమే కానీ, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ పాత ఇంట్లోనే ఉంటున్నామని.. కొత్త ఇంట్లోకి మారాలన్న ఆలోచన తమకు లేదని.. అదృష్టవశాత్తు తన కొడుక్కి కూడా ఆ ఆలోచన లేదని అన్నారు. ఇప్పుడు డబ్బు వచ్చిందని.. పని మానేసి కూర్చోని తింటే ఎలా.. అందుకే సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నానని అన్నారు. అయినా.. తన కొడుకు ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని.. టీమిండియా తరఫున ఆడాలంటే ఇంకా కష్టపడాలని.. ఆ రోజు కూడా వస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. ఐపీఎల్‌ వేలానికి ముందు.. ధోని తమతో మాట్లాడారని.. వేలంలో రాబిన్స్‌ ను ఎవరూ కొనకపోయినా.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కొనుగోలు చేస్తుందనే హామీ ఇచ్చారని తెలిపారు. కానీ, గుజరాత్‌ టైటాన్స్‌ మంచి ధరపెట్టి కొనుగోలు చేయడం సంతోషంగా ఉందని జేవియర్‌ వెల్లడించారు. మరి కొడుకు కోట్లు సంపాదిస్తున్నా.. ఏం మాత్రం నామోషీ అనుకోకుండా సెక్యూరిటీ గార్డ్‌ గా పనిచేస్తున్న జేవియర్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.