iDreamPost

కేఎల్‌ రాహుల్‌లో మార్పు తెచ్చిన గాయం! అసలు కథ అక్కడే మొదలైంది..!

KL Rahul Iconic Knock From Centurion: కేఎల్ రాహుల్ సెంచూరియన్ లో అద్భుతమైన ఫామ్ ని కనబరిచాడు. అయితే ఇది రాహుల్ 2.0 వర్షన్ అనే చెప్పాలి.

KL Rahul Iconic Knock From Centurion: కేఎల్ రాహుల్ సెంచూరియన్ లో అద్భుతమైన ఫామ్ ని కనబరిచాడు. అయితే ఇది రాహుల్ 2.0 వర్షన్ అనే చెప్పాలి.

కేఎల్‌ రాహుల్‌లో మార్పు తెచ్చిన గాయం! అసలు కథ అక్కడే మొదలైంది..!

ఏ క్రికెటర్ కెరీర్లో అయినా ఒడిదొడుకులు సహజం. అప్పుడే పొగడ్తలతో ముంచెత్తుతారు. అదే నోటితో విమర్శల వర్షం కురిపిస్తారు. ఏ మైదానంలో జేజేలు అందుకుంటారో.. అదే గ్రౌండ్ లో పెదవి విరుపులు కూడా చూస్తారు. ఎవరి కెరీర్లో అయినా ఫామ్ అనేది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. శతకాలతో చెలరేగిన ఆటగాడు ఘోరంగా విఫలం కూడా కావచ్చు. విరాట్ కోహ్లీ, రోహింత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లు కూడా ఈ ఫేజ్ చూసిన వాళ్లే. కానీ, ఆ తర్వాత వాళ్లు తిరిగి పుంజుకున్నారు. మళ్లీ తమ కెరీర్లో అత్యుత్తమ ఫామ్ ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు కేఎల్ రాహుల్ కూడా అదే ఫేజ్ లో ఉన్నాడు. గాయం వల్ల కెరీర్ మొత్తం ప్రశ్నార్థకం కాగా.. తిరిగి పుంజుకుని తన సత్తా చాటుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నది రాహుల్ 2.0 వర్షన్ అంటూ అభిమానులు మాత్రమే కాకుండా.. మాజీలు సైతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

ఐపీఎల్ 2023లో కేఎల్ రాహుల్ కు గాయమైంది. ఆ తర్వాత అతని కెరీర్ మొత్తం ప్రశ్నార్థకంగా మారిపోయింది. చాలా మంది రాహుల్ పని అయిపోయింది అని కూడా భావించారు. కానీ, గాయం నుంచి కోలుకోవడం మాత్రమే కాకుండా.. ఇప్పుడు అత్యుత్తమ ఫామ్ తో చెలరేగిపోతున్నాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో కష్టాల్లో ఉన్న టీమిండియాకి గౌరవప్రద స్కోరును అందించాడు. తొలిరోజే టాపార్డర్ మాత్రమే కాకుండా.. మిడిల్ ఆర్డర్ కూడా పేకమేడలా కూలిపోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జైస్వాల్, శుభ్ మన్ గిల్, అయ్యర్, ఠాకూర్ ఇలా అందరూ పెవిలియన్ కు క్యూ కట్టారు. అలాంటి తరుణంలో కేఎల్ రాహుల్ అడ్డంగా నిలబడిపోయాడు. టెయిలెండర్స్ ని అడ్డుపెట్టుకుని ఆటను ముందుకు సాగించాడు.

kl rahul

కేవలం 150 పరుగులలోపే ఆలౌట్ అవ్వాల్సిన పరిస్థితి నుంచి 245 పరుగులు చేసే స్థితికి చేర్చాడు. తొలిరోజు వర్షం కారణంగా ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి టీమిండియా 208 పరుగులు చేసింది. రెండోరోజు ఆట ప్రారంభమయ్యాక రాహుల్ తన ఫామ్ కొనసాగించాడు. సిరాజ్, ప్రసిద్ధ క్రిష్ణలను అడ్డుపెట్టుని శతకం పూర్తి చేసుకున్నాడు. సిక్సర్ సాయంతో అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అలాగే శతకాన్ని కూాడా సూపర్ సిక్సర్ పూర్తి చేసుకున్నాడు. 137 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. మొత్తానికి టీమిండియాకి మంచి స్టార్ట్ ని అయితే కేఎల్ రాహుల్ అందించాడు. నిజానికి ఇది కేఎల్ రాహుల్ కెరీర్ లోనే కాదు.. టీమిండియా టెస్టు చరిత్రలోనే ఈ శతకం టాప్ 10లో స్థానం దక్కించుకుంటుంది. ఈ మాట మేము చెప్పడంలేదు.. టీమిండియా దిగ్గజ మాజీ ఆటగాడు.. సునీల్ గవాస్కర్ చెప్పాడు.

 

“మీరు ప్రేమించే ఆట, దానికోసం ఎంతో త్యాగం చేసిన ఆటకు మీరు చాలాకాలం దూరమైతే.. ఆ ఆట మీద మీ అభిప్రాయం మారిపోతుంది. అయితే కేఎల్ రాహుల్ మాత్రం ఆటను బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ నేనే తప్పుగా అనుకున్నాను కావచ్చు. ఆట ప్రారంభంలో కేఎల్ రాహుల్ కాస్త ఫామ్ లో లేనట్లు కనిపించాడు. కానీ, ఆ తర్వాత పుంజుకున్నాడు. ఆసియా కప్ లో తొలి మ్యాచ్ లో అద్భుతమైన శతకాన్ని నమోదు చేశాడు. నిజానికి కేఎల్ రాహుల్ లక్కీ అనే చెప్పాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కి గాయం కావడం వల్ల రాహుల్ జట్టులోకి వచ్చాడు. ఒక్కోసారి లక్ కూడా మనకు ఫేవర్ చేయాలి. అయితే ఆ లక్ వల్ల వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రస్తుతం కేఎల్ రాహుల్ అదే చేస్తున్నాడు. ఇప్పుడు అసలు కేఎల్ రాహుల్ ని ఏ ఫార్మాట్ లో నుంచి కూడా పక్కన పెట్టే పరిస్థితి లేకుండా అతను ఆడుతున్నాడు” అంటూ సునీల్ గావాస్కర్ కొనియాడాడు.

అలాగే టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కేఎల్ రాహుల్ ఆటపై పొగడ్తల వర్షం కురిపించాడు. “కేఎల్ రాహుల్ ఎంతో సునాయాసంగా బ్యాటింగ్ చేశాడు. ఈ పిచ్ మీద బ్యాటింగ్ అంత ఈజీనా అనేల అతని ఆట ఉంది. ఫుట్ వర్క్, బ్యాలెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ నాక్ చూస్తే రాహుల్ కి ఈ స్థానమే కరెక్ట్ అనే భావన కలుగుతోంది” అంటూ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. కేఎల్ రాహుల్ ఇప్పుడు చూపిస్తున్న ఫామ్ మొత్తం అతనిలో ఉన్న కొత్త కోణం అనే చెప్పాలి. విమర్శలు, అసలు జట్టులోకి ఎందుకు తీసుకున్నారు? అతను అసలు ఆటగాడేనా? అంటూ చాలామంది చాలా రకాలుగా మాటలు అన్నారు. ఇప్పుడు గాయం తర్వాత జట్టులోకి వచ్చిన రాహుల్ తనపై వచ్చిన విమర్శలకు బ్యాటుతోనే సమాధానం చెబుతున్నాడు. ఆ గాయమే ఆటపై రాహుల్ దృష్టిని, పట్టుని మార్చేసిందని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కొన్నిసార్లు లైఫ్ లో చెడు జరగడం కూడా మంచికే అన్నట్లు రాహుల్ గాయం అతడిని పూర్తిగా మార్చేసింది. ఇది నిజంగానే కేఎల్ రాహుల్ 2.0 అనే చెప్పాలి. మరి.. రాహుల్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి