iDreamPost

రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి – గంటా

రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయి – గంటా

మరి కొద్ది సేపట్లో రాష్ట్ర రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వేసిన బి.యన్ రావు కమిటీ తమ నివేదిక ను ప్రభుత్వానికి అందచేయనున్నది. మరోవైపు రాష్ట్రంలో రాజధాని చుట్టూ రాజకియ వేడి రాజుకుంది. రాజకీయ నాయకులు తమ పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. ఒకపక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధి వికేంద్రీకరణ పేరు మీద రాజధానిని అమరావతి నుండి జగన్ తరలిస్తే ఉరుకోము అంటూ హెచ్చరికలు చేస్తుంటే మరో పక్క తెలుగు తముళ్ళు కొండ్రు మురళి లాంటివారు రాజధాని తమ ప్రాంతం అయిన విశాఖలో ఉండాటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ బహిరంగంగా చెప్తున్నారు, తాజాగా తెలుగుదేశం శాసన సభ్యుడు గంటా శ్రీనివాస్ కూడా సోషల్ మీడియా వేదికగా విశాఖ కు రాజధాని అవ్వటానికి అన్ని అర్హతలు ఉన్నాయి అంటూ తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.

గంటా శ్రీనివాస్ మాటల్లో

విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ఏర్పాటుకు 100శాతం అర్హతలు వున్నాయి.

అసెంబ్లీలో మూడు రాజధానులపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత విశాఖ వాసిగా..ఈ ప్రాంతంతో అనుబంధం వున్న వ్యక్తిగా ఆ ప్రతిపాదనను స్వాగతించాను. రాజధానిపై ఎప్పుడు చర్చ జరిగినా వ్యక్తిగతంగా విశాఖే సరైనదేనని అభిప్రాయం గతంలో నుంచి చెప్తున్నాను.

అమరావతిని రాజధానిగా ఎంపిక చేసినప్పుడు కూడా విశాఖని ఆర్ధిక రాజధానిగా చేయమని డిమాండ్ చేశాను. రాజధాని మార్చాలన్న చర్చ వచ్చిన ప్రతీసారీ పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా విశాఖవైపే మొగ్గు చూపించాను.శ్రీ కృష్ణ కమిటీ విస్తృతమైన అభిప్రాయసేకరణ చేసింది. అమరావతి కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నారు.

కొత్త ప్రభుత్వం విశాఖను ఎంచుకున్నప్పుడు దానిని స్వాగతించాల్సిన బాధ్యత నాపై వుందని భావించాను. పార్టీపరంగా భిన్నమైన అభిప్రాయాలు వుండవొచ్చు…చంద్రబాబునాయుడి గారికి కానీ పార్టీకి కానీ అమరావతిని రాజధానిగా ప్రకటించాం కనుక అక్కడే వుండాలనే అభిప్రాయం వుండొచ్చు. నేను కానీ, ఇక్కడ వున్న ప్రజాప్రతినిధులు కానీ వైజాగ్ రాజధానిని కాదనలేని పరిస్ధితి వుంది. వైజాగ్ కేపిటల్ పై మేథావులు, విద్యార్ధులు, ప్రజాసంఘాలపై అద్భుతమైన స్పందన వస్తోంది…అందరూ స్వాగతిస్తున్నారు.

ఇప్పటికీ అమరావతిలో పనిచేస్తున్న అధికారులు వీకెండ్ కోసం హైదరాబాద్ కు వెళ్ళిపోయే పరిస్ధితి వుంది… అదే విశాఖపట్టణం అయితే అందరూ ఇక్కడే స్ధిరనివాసం ఏర్పరుచుకోవడానికి అవకాశం వుంది… విద్య,వైద్య,సోషల్ లైఫ్ కు అవసరమైన అన్ని సౌకర్యాలు ఇక్కడ వున్నాయి.

గంటా శ్రీనివాసరావు అభిప్రాయంపై తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి