iDreamPost
iDreamPost
సూపర్ స్టార్ మహేష్ బాబు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI)లో ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ (PLHF) పేరుతో ఫౌండేషన్‌ను ప్రారంభించారు. పిల్లలకు గుండె సంబంధిత సంరక్షణను అందించడానికి ఈ PLHF బాసటగా నిలవనుంది.
“మహేష్ బాబు ఫౌండేషన్” RCHI తో చేతులు కలిపింది, ఇందులో భాగంగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో ఆర్థిక స్థోమత లేని పిల్లలకు PLHF ద్వారా చికిత్స అందించబడుతుంది.
మన భారతదేశంలో, ప్రతి 1000 మందిలో 10 మందికి పుట్టుకతోనే గుండె జబ్బులు ఉంటున్నాయి. ప్రతి సంవత్సరం 2 లక్షల కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బులతో పుడుతున్నారు.
దాదాపు ఐదవ వంతు పిల్లలు పుట్టుకతోనే తీవ్రమైన గుండె సంబంధిత ప్రమాదాన్ని కలిగి ఉంటున్నారు. ఇది గణనీయమైన అనారోగ్యం మరియు శిశు మరణాలకు దారితీస్తుంది. దీని గురించి తెలుసుకున్న మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు రెయిన్‌బో చిల్డ్రన్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ (RCHI) తో కలిసి ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్‌ను ప్రారంభించాడు.
ఫౌండేషన్‌ను ప్రారంభోత్సవం సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ, “పిల్లలు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటారు. “మహేష్ బాబు ఫౌండేషన్” ద్వారా RCHI లో కార్డియక్ కేర్, పిల్లలకు అవసరమైన సహాయం చేయడం నాకు సంతోషంగా ఉంది. చిన్న హృదయాలు గొప్ప సంరక్షణకు అర్హమైనవి” అని అన్నారు.
ఇక మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా, ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా 1,000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్లను చేయించారు. అంతే కాకుండా ‘హీల్ ఎ చైల్డ్’ అనే ఫౌండేషన్ ద్వారా తన సహాయం అందిస్తూనే ఉంటారు. ఆర్థిక స్థోమత మరియు వైద్య ఖర్చులను భరించలేని తల్లిదండ్రుల పిల్లలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.