iDreamPost
android-app
ios-app

ఫ్లాపైనందుకు సారీ చెప్పేశాడు

  • Published Mar 30, 2021 | 5:16 AM Updated Updated Mar 30, 2021 | 5:16 AM
ఫ్లాపైనందుకు సారీ చెప్పేశాడు

సినిమాల్లో హిట్లు ఫ్లాపులు సహజం. అది ఏ హీరోకైనా అనుభవమే. అంతటి నట సార్వభౌముడు ఎన్టీఆర్ గారికే చివరి దశలో శ్రీనాధుడు, సామ్రాట్ అశోక లాంటి డిజాస్టర్లు తప్పలేదు. మేజర్ చంద్రకాంత్ కమర్షియల్ గా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. చిరంజీవి సైతం ఒకదశలో ఈ పరాజయాలు తట్టుకోలేక 1996లో అసలు ఏ విడుదల లేకుండా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ నా పేరు సూర్య దెబ్బకు నెలల తరబడి మేకప్ కి దూరంగా ఉండటం అభిమానులకు గుర్తే. ఇలా ప్రతిఒక్కరి కెరీర్లో ఇలాంటి ఆటుపోట్లు ఉంటాయి. అవి సహజం. అయితే వీటిని పైకి ఒప్పేసుకునే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.

రెండేళ్ల క్రితం వినయ విధేయ రామ డిజాస్టర్ అయినప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కి సారీ చెబుతూ ఏకంగా ఓ నోట్ రిలీజ్ చేయడం అప్పట్లో సంచలనం. దీని వల్ల దర్శకుడు బోయపాటి శీను ఇబ్బంది పడ్డ మాటా వాస్తవం. అప్పటిదాకా తానొక్కడే ఫ్లాప్ ఇచ్చినట్టు ఇలా చేయడం ఏమిటని తన సన్నిహితులతో చెప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీని సంగతలా ఉంచితే తాజాగా హీరో కార్తికేయ కూడా అదే బాట పట్టాడు. ఇటీవలే వచ్చిన చావు కబురు చల్లగా దారుణమైన ఫలితాన్ని అందుకోవడంతో సోషల్ మీడియా వేదికగా నచ్చని వాళ్ళను క్షమాపణ అడిగి ఇకపై ఇలాంటివిమళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటానని చెప్పాడు.

నిజానికి ఇలా చేయాల్సిన అవసరం లేదు. కానీ కథల ఎంపికలో పదే పదే చేస్తున్న తప్పుల వల్ల కార్తికేయ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. కేవలం బ్యానర్ పేరు చూసి అప్పట్లో హిప్పీ చేశానని చెప్పుకున్న ఇతను కనీసం స్టోరీని కూడా పూర్తిగా విని ఉండడని సినిమా చూశాక అభిమానులు అర్థం చేసుకున్నారు. ఇలా ఎన్నో పొరపాట్లు ఆరెక్స్ 100 తర్వాత హిట్టుని దూరం చేశాయి. అందుకే తనపై ఇంకా నెగటివ్ మార్క్ రావడం ఎందుకనుకుని ఫైనల్ గా ఇలా చేశాడు. గీత లాంటి పెద్ద బ్యానర్ లో చేసిన సినిమాకే ఇలా చెప్పుకున్నాడంటే చావు కబురు చల్లగా వెనుక ఏదో జరిగిందనే చర్చ ఫిలిం నగర్ లో ఉంది.