iDreamPost

మల్టీప్లెక్సుల్లో ఉచితంగా సినిమా

మల్టీప్లెక్సుల్లో ఉచితంగా సినిమా

అదేంటి ఒకపక్క టికెట్ రేట్లతో అల్లాడిపోతుంటే ఫ్రీగా సినిమా అది కూడా మల్టీప్లెక్సుల్లో అని ఆశ్చర్యపోతున్నారా. కానీ ఇది అక్షరాలా నిజం. ఆజాది అమృత్ మహోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వ సూచనల మేరకు ఆగస్ట్ 9 నుంచి 11వ తేదీ దాకా, తిరిగి 16 నుంచి 21 దాకా మార్నింగ్ షోలు ఫ్రీగా స్క్రీనింగ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట 15 నిమిషాల లోపు ఇది పూర్తవ్వాలి. అయితే మనకు కావలసిన మూవీ కాదు. 1982లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాంధీని మాత్రమే ప్రదర్శిస్తారు. ఎవరైనా వెళ్లొచ్చు. ముఖ్యంగా స్కూల్స్ కాలేజీ పిల్లలను తీసుకెళ్లేలా యాజమాన్యాలు ప్లాన్ చేసుకోవాలని చెప్పేశారు.

ఈ చర్య నేరుగా లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ల మీద పడబోతోంది. రేపే విడుదల కాబోతున్న వీటికి ఉదయం ఆటలు ఉండవు. అయితే కొత్త తెలుగు రిలీజులు మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2 మినహాయింపు తేదీల్లో ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. నిజానికిది మంచి చర్య. ఒకప్పుడు 90 దశకంలో ఈ తరహా ప్రత్యేక సినిమాలను చూపించడం జరిగేది. తర్వాత ఇది కనుమరుగు అయిపోయింది. అయితే గాంధీతో పాటు మన అల్లూరి సీతారామరాజు, ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్, సైరా నరసింహారెడ్డి లాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ చిత్రాలను కూడా వేస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది కానీ గాంధీ యూనివర్సల్ మూవీ కాబట్టి ఆ గౌరవం దానికే దక్కింది.

గాంధీ నిజంగానే వెండితెరపై మరోసారి చూడాల్సిన గొప్ప సినిమా. పోకిరిని డబ్బులిచ్చి ఎగబడి చూడటంలో ఎంత ఆనందం పొందామో మహాత్ముని చరిత్రని ఉచితంగా చూసే అవకాశాన్ని కూడా వదులుకోకూడదు. ఎప్పుడో నలభై ఏళ్ళ క్రితం సినిమా కాబట్టి ప్రింట్ విషయంలో అనుమానం అక్కర్లేదు. కొన్నేళ్ల క్రితమే బ్లూరే రిలీజ్ కోసం డిజిటల్ సౌండ్ ని మిక్స్ చేసి రీ మాస్టర్ చేయించారు. సో చాలా స్పష్టమైన క్వాలిటీలో గాంధీని చూడొచ్చు. మొత్తం 552 సింగల్ మరియు మల్టీప్లెక్సుల్లో గాంధీ ఉంటుంది. పైన చెప్పిన తేదీల్లో మన వీలును బట్టి ఏ షోకైనా వెళ్లిపోవచ్చు. ఓటిటిలో కన్నా వెండితెరపై ఇవిచ్చే అనుభూతిని స్పృశించాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి