iDreamPost

ముఖ్యమంత్రి ని మాజీ ఎన్నికల కమిషనర్ కలవడం పై సర్వత్రా ఆసక్తి

ముఖ్యమంత్రి ని మాజీ ఎన్నికల కమిషనర్ కలవడం పై సర్వత్రా ఆసక్తి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తునట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేసిన ఆకస్మిక ప్రకటనతో ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయంతో అధికార విపక్షాల మధ్య పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగిన తరుణంలో, ఎన్నికల రద్దు ఉత్తర్వులను నిలుపుదల చెయ్యాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సుప్రీమ్ కోర్ట్ ని ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సోమవారం తాడేపల్లిలో సియం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అవ్వడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఒకపక్క ఈ వివాదాంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషనర్ మధ్య వివాదం మరింత ముదరడంతో, ఈ అంశంపై ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై జగన్ రమాకాంత్ రెడ్డి తో చర్చించినట్టు సమాచారం.

కాగా, ఎన్నికల కమిషనర్ విచాక్షణాధికారాల గురించి, సాధారణంగా ఇలాంటి వివాదాలు తలెత్తినప్పుడు ప్రభుత్వానికున్న అధికారాలు గురించి, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులపై ఏవిధంగా చర్యలు తీసుకోవచ్చు, ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల అభిశంసన ప్రక్రియ ఏవిధంగా ఉంటుందనే తదితర న్యాయపరమైన అంశాలపై సీఎం జగన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి తో చర్చించినట్టు సమాచారం. ఈ అంశాలపై ముఖ్యమంత్రికి రమాకాంత్ రెడ్డి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారని తెలిసింది. ఈ భేటీలో సీఎం జగన్ తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ తో పాటు పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి లు కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి