iDreamPost
android-app
ios-app

రోడ్డు ప్రమాదంలో జానపద గాయకుడు దుర్మరణం!

  • Published Oct 07, 2023 | 3:31 PM Updated Updated Oct 07, 2023 | 3:31 PM
రోడ్డు ప్రమాదంలో జానపద గాయకుడు దుర్మరణం!

ఇటీవల దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం ఇలా ఎన్నో కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ అధికారులు అంటున్నారు. డ్రైవర్లు చేస్తున్న తప్పిదాల వల్ల ఎంతోమంది అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతోమంది అనాథలుగా మారిపోతున్నారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో జానపద గాయకుడు కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే..

పలాసలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. శుక్రవారం మండలంలోని డొక్కరిపేటకి చెందిన జానపద గాయకుడు శాలిన అశోక్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ప్రస్తుతం అశోక్ జాతీయ రహదారి రోడ్డు పనుల్లో వర్కర్ గా పనిచేస్తున్నారు. తన పని ముగించుకొని స్కూటీపై ఇంటికి వెళ్తున్న సమయంలో బొలేరో వ్యాన్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అశోక్ అక్కడికక్కడే కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు.

మృతుడు అశోక్ కి భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. వీరంతా ఇతని సంపాదనపైనే బతుకుతున్నారు. మృత దేహాన్ని ఆయన స్వగ్రామం మాకన్నపల్లికి తీసుకువెళ్ళి అంత్యక్రియలు జరిపించారు. అశోక్ మరణంతో కుటుంబ సభ్యుల రోదన ఆపతరం కాలేదు. గ్రామస్థులు సైతం కంటతడి పెట్టుకున్నారు. అశోక్ మరణ వార్త తెలిసి ఉద్దానం ప్రాంతానికి చెందిన కళాకారులు, గాయకులు అక్కడికి చేరుకొని ఆయన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అశోక్ కి ఘన నివాళులర్పించారు. తర్వాత ఉద్దానం సాహితీ సాంస్కృతిక వేదిక ఉపాధ్యక్షులు కుత్తం వినోద్ సంతాప సభ నిర్వహించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.