iDreamPost

మనోభావాలు దెబ్బతిన్నాయి – Nostalgia

మనోభావాలు దెబ్బతిన్నాయి – Nostalgia

గత కొన్నేళ్ళుగా చాలా కామన్ గా వింటున్న మాట ‘మనోభావాలు దెబ్బ తిన్నాయి’. లోతుగా ఆలోచిస్తే సినిమా చూసే ప్రేక్షకులు మారారా లేకపోతే సామాజిక పరిస్థితుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అనే ప్రశ్న ఉద్భవిస్తుంది. మనిషి జననం,మరణం ఈ రెండు క్రియల్లో ఏ మార్పు లేదు రాదు. కాని జీవన విధానంలో, పద్ధతుల్లో, సంస్కృతిలో మార్పులు చాల వచ్చాయి వస్తున్నాయి. వీటి ప్రభావం కొన్ని విషయాల్లో స్వల్పంగా కొన్ని విషయాల్లో తీవ్రంగా ఉంటోంది. ఒకప్పుడు మనుషుల మధ్య విభజన కుల, మత, వృత్తి ఇతరత్రా ప్రాతిపదికన జరిగి ఎవరి పరిధిలో వాళ్ళు నడుచుకునేవాళ్ళు. కాని ప్రపంచీకరణతో పాటు వివిధ కారణాల వల్ల ఈ హద్దులు చెరిగిపోయి కాలక్రమేణా కొత్త ఆలోచనలు మొదలయ్యాయి.

ఆధునిక ప్రపంచంలో ఇవి మరింత ముదిరి కుల మత ప్రతిపాదికన వర్గాల వారిగా విడిపోయి ఏదో హక్కుల కోసం పోరాడాలి, మనల్ని ఎవరో ఆణిచేస్తున్నారు కాబట్టి కాపాడుకోవాలనే ధోరణి వికృత రూపం దాలుస్తోంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దీనికి సినిమా కూడా మినహాయింపు కాదు కాబట్టి..సినిమా తీయడం ఒక కళ. మన ఊహాల్ని స్వేచ్చగా ఆవిష్కరించుకునే ఒక అందమైన వేదిక. అలా అని మనకు ఏది సరి అనిపిస్తే అది తీయడానికి ఇక్కడ అవకాశం ఉండదు. ఎందుకంటే దీనికి కొన్ని పరిమితులు ఉన్నాయి.

ఉదాహరణకి పాశ్చాత్య సినిమాలు తీసుకుంటే చుంబనం, నగ్నత్వం, విచ్చలవిడితనం సర్వ సాధారణ విషయాలు. కాని అవి మన సినిమాలకు వచ్చేటప్పటికి ఒకప్పుడు చాలా ఆంక్షలు ఉండేవి. బాలీవుడ్ పుణ్యమాని ఇప్పుడవి వాటి కంటే దారుణంగా మన తెరలపై రాజ్యమేలుతున్నాయి. ఇక వెబ్ సిరీస్ ల గురించి చెప్పేదేముంది.దీన్ని పక్కనబెడితే ఫలానా సినిమా వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని రచ్చ చేయడం ఈనాటిది కాదు. దశాబ్దాలుగా ఉంది. ఒక్కసారి వివాదం, మనోభావాలు దెబ్బ తినటం అనేవి మన తెలుగు సినిమాల్లో ఎంత వరకు జరిగాయని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే కొన్ని ఉదాహరణలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు…

1. మాల పిల్ల(1938)

 గూడవల్లి రామబ్రహ్మం గారు తీసిన ఈ సినిమా సాంఘిక దురాచారాలను ప్రశ్నించే విధంగా సాగుతుంది. ఆ కాలంలో సామజిక కట్టుబాట్లు జన జీవితంలో ఒక భాగంగా ఉన్నాయి. సహజంగానే దానికి వ్యతిరేకంగా ఉన్న ఈ చిత్రం పట్ల తీవ్ర నిరసన ఎదురైంది.ఒక బ్రాహ్మణ యువకుడికి ఒక హరిజన యువతికి మధ్య ప్రేమకథ గా తీసిన ఈ చిత్రం తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువయ్యింది. అంటరానితనం, కుల విభజన, అంశాలను సూటిగా చూపడంతో ఛాందస వాదులకు నచ్చక మనోభావాల పేరిట అప్పట్లోనే నిరసనలు తెలిపారు.

2. రక్త చరిత్ర(2010)

 అనంతపురం ఫ్యాక్షన్ గోడవల్ని వెండితెరపై చూపి కాసులు దోచుకునే వర్మ ప్లాన్ బ్రహ్మాండంగా వర్కవుట్ అయ్యింది. మద్దెలచెరువు సూరి,పరిటాల రవి శత్రుత్వాన్ని నేపధ్యంగా తీసుకోవడం బాగా దుమారం రేపింది. ఒక దశలో సినిమా విడుదల కాకుండా చేసే ప్రయత్నాలు కూడా జరిగాయి. తమ కుటుంబ కథలను వక్రీకరించారని ఆయా కుటుంబాలు మీడియాకు వెళ్ళినా వర్మ ఆగలేదు. ఏకంగా సూర్య లాంటి స్టార్ హీరోతో రెండో భాగం తీసి చూపించాడు.

3. సూపర్ ఎక్సప్రెస్(1991) 

సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ తండ్రి, ప్రసిద్ధ రచయిత సత్యమూర్తి దర్శకత్వంలో వచ్చిన సినిమా. 1990 ప్దారాంతంలో దాదర్ ఎక్సప్రెస్ ట్రైన్లో జరిగిన గ్యాంగ్ రేప్ ఆధారంగా రివెంజ్ డ్రామా మిక్స్ చేసి తీసారు. అది కాస్త వివాదంగా మారి సినిమా పేరును సూపర్ ఎక్సప్రెస్ గా మార్చారు. నాగబాబు హీరో. అయితే ఆ ఘటన నిజంగా జరగలేదని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించినా జనం అప్పటికే బాగా నమ్మేశారు. కానీ మూవీ రిజల్ట్ ఫ్లాప్.

4. దేనికైనా రెడీ(2012) 

మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి ఆ కుల సంఘాలు. మోహన్ బాబు ఇంటి ముందు నిరసన ప్రదర్శనలు జరిగితే వ్యవహారం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. ఈ గొడవ సంగతి ఎలా ఉన్న మూవీ మాత్రం కమర్షియల్ గా ఆడి నిర్మాతకు డబ్బుని విష్ణుకి హిట్టుని మిగిల్చాయి

5. బొబ్బిలి పులి(1982) 

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం జరగడానికి ముందు వచ్చిన చివరి చిత్రం. దాసరి దర్శకుడు.సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు.కారణం అప్పటి రాజకీయ పరిస్థితులను, వ్యక్తులను ఇందులో విమర్శనాత్మకంగా చూపించారని అది వాళ్ళ మనోభావాలు దెబ్బ తీస్తాయని అధికారులు సర్టిఫికేట్ ఇవ్వలేదు. నిర్మాత వడ్డే రమేష్, దాసరి ఇద్దరూ నటుడు ప్రభాకర్ రెడ్డి సహాయంతో రాష్ట్రపతిని కలిసి కట్స్ లేకుండా విడుదల చేయించుకున్నారు. సినిమా చరిత్ర సృష్టించి ఏడాది పాటు ఆడింది.

6.చైతన్య రథం(1987) 

ధవళ సత్యం దర్శకత్వంలో భానుచందర్ హీరోగా వచ్చిన చిత్రం. వంగవీటి హత్యోదంతం నేపధ్యంగా తీసిన ఈ సినిమాలో పలు వివాదాస్పద అంశాలను చొప్పించడంతో చాలా సమస్యలు ఎదుర్కొంది. అప్పటి ప్రభుత్వం ప్రదర్శనలు జరగకుండా అడ్డుకుందని కథనాలు వచ్చాయి. ఇప్పుడీ సినిమా ప్రింట్ అందుబాటులో లేకపోవడంతో వంగవీటి అభిమానులు ఇప్పుడు చూద్దామన్నా అవకాశం లేకుండా పోయింది

7. పిచ్చోడి చేతిలో రాయి(1993) 

దాసరి స్వీయ దర్శకత్వంలో ప్రధాన పాత్రలో నిర్మించిన చిత్రం. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగా పలు శక్తులు షూటింగ్ కి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉండటంతో గుట్టుగా పూర్తి చేసారు. కారణం వర్తమాన రాజకీయాలకు సంబంధించిన పలు సున్నితమైన అంశాలను స్పృశించడమే. పొలిటికల్ గా చాలా పంచులు ఉంటాయి ఇందులో. దాసరి ఉద్దేశం ఏదైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు

8. గోవిందా గోవిందా(1993) 

నాగార్జున,శ్రీదేవి జంటగా తిరుమల శ్రీవారి గుళ్ళో కిరీటం దొంగతనం చేయటం అనే కథాంశంతో తీసారు రాంగోపాల్ వర్మ.ఈ కథను ఎంచుకోవడం పట్ల తీవ్ర విమర్శల పాలైంది చిత్ర బృందం. సెన్సారు బోర్డు చెప్పిన కొన్ని మార్పులతో ఎట్టకేలకు భారీ ఎత్తున విడుదల చేశారు. కాని డిజాస్టర్ చవిచూడాల్సి వచ్చింది. రాజ్ కోటి స్వరపరిచిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోవడం ఒక్కటే దీని విషయంలో కలిగిన ఊరట

9. అల్లుడా మజాకా(1994) 

అత్తా అల్లుళ్ళ మధ్య ఉండాల్సిన సరదా అల్లరిని హద్దులు దాటించి భ్రష్టు పట్టించారని మహిళా సంఘాలు రోడెక్కాయి. చిరంజీవి లాంటి అగ్ర నటుడు నటించాల్సిన చిత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేసాయి. ద్వందార్థాలు కూడా మోతాదు మించి ఉండటం చిరుని ఇబ్బంది పెట్టాయి. కాని ప్రేక్షకులు మాత్రం దీనికి పట్టం కట్టి విజయం చేకూర్చారు.ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఫలితం పాజిటివ్ గా వచ్చినా విమర్శలను పరిగణించిన చిరు ఆ తర్వాత ఇలాంటి బి గ్రేడ్ కథను మళ్ళీ ఒప్పుకోలేదు. మంచి అభిరుచి కల దర్శకుడి పేరున్న ఈవివి సత్యనారాయణకు ఒక బ్యాడ్ రిమార్క్ అని చెప్పొచ్చు

10. అసెంబ్లీ రౌడీ(1991) 

పేరే పెద్ద వివాదం తీసుకొచ్చిన చిత్రం. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు వెళ్ళే గౌరవమయిన చోటికి రౌడీలు వెళ్తారన్నట్టు అర్థం వస్తుందని రాజకీయ నాయకులు ఆక్షేపించారు. కానీ సినిమా చూసాక ఇదే సరైన పేరు అని వారికి తెలిసింది. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.బి గోపాల్ దర్శకత్వం, కెవి మహదేవన్ పాటలు, దివ్యభారతి గ్లామర్, పరుచూరి పదునైన సంభాషణలు వంద రోజులు ఆడేలా చేశాయి.

ఇవి కాకుండా ఇంకా సప్తపది, ఆరుగురు పతివ్రతలు,ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం,పోలీస్ భార్య,రౌడీ ఇన్స్పెక్టర్, కెమరామెన్ గంగతో రాంబాబు, అదిరింది అల్లుడు,బొంబాయి, అమృత, నాయకుడు లాంటి చాలా సినిమాలు వివాదాల్లో చిక్కుకుని ఎలాగోలా బయటపడ్డాయి. సినిమాని సినిమాగా చూడకుండా వ్యక్తిగతంగా అన్వయించుకుంటే ఇలాంటి సమస్యలే వస్తాయి. ఇప్పుడు ఈ ట్రెండ్ బాగా పెరిగి ఇంకా తీవ్రమవుతోందే తప్ప తగ్గే సూచనలు కనిపించడం లేదు.

మనోభావం సుఖీభవ…..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి