iDreamPost

అక్కడ కరోనా ఉంటుందేమో..?

అక్కడ కరోనా ఉంటుందేమో..?

అక్కడ కరోనా ఉంటుందేమో.. ఈ అనుమానం ప్రతి ఒక్కరిలోనూ ఇప్పుడు కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జాగ్రత్తగా ఉండమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుకొని పోలీసులు, వైద్యులు ఎంత మొత్తుకుంటున్నా విననివాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మొన్న న్యూఢిల్లీ, నేడు కోయంబేడు మార్కెట్.. వీటిలో ఎక్కడ గమనించినా ఒకటే కారణం కనిపిస్తుంది. అదేంటంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా సామూహికంగా ఒకచోట చేరడం. ఈ విషయంలో అధిక శాతం మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే అనవసరంగా బయటకు తిరగవద్దు అని ఎంత మొత్తుకుంటున్నా పట్టించుకోకపోవడం గమనించవచ్చు.

లాక్ డౌన్ 3.0 లో ఇచ్చిన మినహాయింపులను నూటికి 150% వినియోగించుకుని రోడ్లపైన పడి విచ్చలవిడిగా తిరుగుతున్న కొంత మంది ని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో నే కాకుండా పల్లెటూర్లలో కూడా చూస్తున్నాం. అదేమని ప్రశ్నిస్తే నిర్లక్ష్యం తో కూడిన నవ్వు ఒకటి వారి నుంచి వస్తుంది.

మనిషి సంఘజీవి గా చెబుతుంటారు. కానీ భారతీయతలో ఈ సంఘజీవనం మరింత విస్తృతంగా ఉందేమో అన్న సందేహం కలుగుతోంది. ఎప్పుడు రోడ్లపై తిరగనట్లు.. ఎన్నడూ మార్కెట్ లోకి వెళ్ల నట్లు.. పల్లెల నుంచి మొదటి సారి నగరానికి వస్తే ఎంత సంభ్రమాశ్చర్యాలతో తిరుగుతారో.. ఆ స్థాయిలో ఇప్పుడు జనం రోడ్లపై పడుతున్నారు. ఇది ప్రమాదకరం బాబోయ్ అని ఎంత మొత్తుకుంటున్నా వారి చెవికెక్కడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే కరోనా కట్టడి ఎప్పటికి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ప్రస్తుతం ప్రజలకు అవగాహన పెరిగిందా లేక నిర్లక్ష్యం పెరిగిందా అన్న దానికి స్పష్టమైన సమాధానం చెప్పడం కష్టమే. ఇదే ధోరణి కొనసాగితే ఎదురయ్యే వైద్య సంబంధిత అవసరాలు తీర్చడం ఎవరికీ సాధ్యం కాదన్నది ఇప్పటికే పలు అభివృద్ధి చెందిన ఆదేశాలు ఉదాహరణలుగా మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి మోడీ తో పాటు ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి కేసీఆర్ జగన్ లు మొత్తుకుంటున్నారు. ఇప్పటికైనా కనువిప్పు కాకపోతే ఇబ్బందులు ఎదుర్కోవడానికి సిద్ధపడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి